అడుగు దూరంలోనే విజయం...

అడుగు దూరంలోనే  విజయం...

“మరొక్క అడుగేస్తే విజయమే అనే సమయంలో ప్రయత్నాన్ని వదులుకుంటారు కొందరు. మరికొందరు అసలు అన్నీ చేసెయ్యాలి అని అనుకుంటారు తప్ప ప్రయత్నం మాత్రం మొదలుపెట్టారు. కానీ గురువుగారూ నా విషయంలో ప్రయత్నం చేద్దామనుకునే సరికి ఏదో ఒకటి అడ్డు తగుల్తోంది. ఏం చెయ్యమంటారు చెప్పండి?” అని ఒకడు తన గురువుగారి దగ్గర వాపోయాడు.

అతని మాటలన్నీ విన్న గురువు గారు అతని వంక కాస్సేపు ప్రశాంతంగా చూశారు. ఆ తర్వాత తానున్న ఇంటి ఆవరణలో ఓ చెట్టు మీద కొమ్మలపై అటూ ఇటూ దూకుతున్న కోతులను చూడమన్నారు గురువుగారు.

“ఆ కోతులు ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకో లేదా ఒక చెట్టు పై నుంచి మరో చెట్టు కొమ్మ మీదకో దూకడం చూస్తున్నావుగా… అవి అలా దూకేటప్పుడు ఏ మాత్రం కింద పడిపోకుండా ఎంత కచ్చితంగా ఉన్నాయో చూసేవా? అవి ఎలా అంత కచ్చితంగా ఒక కొమ్మ నుంచి మరో కొమ్మను పట్టుకోగలుగుతున్నాయంటావు? అలా దూకేటప్పుడు వాటిలో ఏ కోశానా భయమో జంకో కనిపించవు. వాటిని దీక్షగా చూడు. ” అని అన్నారు గురువుగారు.

తన ప్రశ్నకు జవాబు చెప్పకుండా కోతులు దూకుతున్న తీరు చూడమని చెప్తారేమిటీ? అని మనసులో అనుకున్న అతను అయోమయంలో పడ్డాడు.

“గురువుగారూ …కోతులు దూకడం చూసాను సరే గానీ నా ప్రశ్నకు జవాబివ్వండి….” అని తనలో నశిస్తున్న ఓపికను బయటపెట్టాడు అతను.

అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు –

“కోతులు ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మకు దూకడాన్ని తదేకంగా చూడు. అవి చకచకమని దూకుతున్నట్లు అనిపించినా అవి దూకుతున్నప్పుడు పట్టుకోవలసిన మరో కొమ్మ, కింద పడిపోకుండా ఉండటానికి అవి అనుసరించే పద్ధతి, పట్టుదల అనే వాటిలో ఎక్కడైనా కాస్తంత జంకో లేదా బేలతనమో కనిపిస్తున్నాయా? లేదుగా….తమ లక్ష్యం తప్పకూడదన్నఅంచనాను గణించే అవి దూకుతాయి. వీటన్నింటినీ మించి తాము ఎలాగైనా మరో కొమ్మను పట్టుకోగలమన్న వాటి ప్రయత్నంలోని నమ్మకం విశేషం. ఆ నమ్మకంతోనే అవి ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మకు దూకగలుగుతున్నాయి. వాటి ప్రయత్నంలో లోపం కనిపించదు. కానీ నీకు ఆలోచనాశక్తి ఉండి కూడా అనుకున్న పనిని చెయ్యగలనా లేదా అని సంశయిస్తూ మొదలు పెట్టడానికే నీకు నువ్వు ప్రశ్నలు వేసుకుని నీ కాళ్ళను కట్టేసుకుంటే ఇక ఏ పనైనా ఎలా చెయ్యగలవు. నువ్వనే కాదు, చాలామంది తాము వెళ్ళాల్సిన గమ్యం ఎక్కడిది? ఆ చోటుకి చేరుకోవడానికి సరైన మార్గం ఏది? అక్కడి చేరుకునే క్రమంలో వచ్చే అడ్డంకులు ఏవేవీ? అవి ఎదురైతే ఎలా అధిగమించాలి? వంటివి ఆలోచించకుండా ఏదో ఆవేశంతో మొదలుపెట్టి మొదటి మెట్టులో ఎదురయ్యే అడ్డంకిని దాటలేక చతికిలబడతారు. అది పద్ధతి కాదు. ఆలోచించి చేస్తే ఏదైనా చెయ్యగలం అని అనుకోవడమే కాకుండా చేసే పనిలో నమ్మకం, శ్రద్ధ కచ్చితంగా ఉండాలి. అప్పుడే అనుకున్న ఆశయాన్ని సాధించగలం” అని.

గురువు గారు చెప్పిన దాంట్లోని వాస్తవికతను తెలుసుకుని అతను తన ప్రశ్నకు జవాబు దొరికినట్టు సంతృప్తి చెంది ఆయన దగ్గర సెలవు తీసుకుని తన లక్ష్యం దిశలో అడుగులు వేశాడు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.