అమూల్యం ...

జ్ఞానుల గురించి ఒకడు కించపరుస్తూ మాట్లాడుతూ ఉండే వాడు. ఎక్కడ పడితే అక్కడ ప్రాంతం ఏదని కూడా చూడకుండా జ్ఞానులను విమర్శిస్తూ ఉండే వాడు. అవహేళన చేసేవాడు. పగలబడి నవ్వేవాడు.

ఈ విషయం ఒక జ్ఞానికి తెలిసింది. ఆయన అతనిని పిలిచి తన వద్ద ఉన్న ఉంగరాన్ని అతనికి ఇచ్చాడు. అది వజ్రం పొదిగిన ఉంగరం. దీనిని బజారు వీధికి తీసుకుపోయి వెయ్యి రూపాయలకు అమ్మి డబ్బులు తీసుకురమ్మని చెప్తారు జ్ఞాని.

అతను మహదానందంగా ఆ ఉంగరాన్ని తీసుకుపోతాడు. పచారీ సరకులు అమ్మే దుకాణాలు ఉన్న వీధికి వెళ్లి అక్కడ ఆ ఉంగరాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ ఎవరూ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ముందుకు రారు. ఓ డజన్ దుకాణాలకు వెళ్తాడు. ఏ ఒక్కరూ అంత డబ్బు ఇవ్వడానికి ఇష్టపడరు. కొందరు వెళ్ళవయ్యా వెళ్ళు అని కసురుకుంటారు. దానితో అతను డీలా పడతాడు. అతను ఇక లాభం లేదనుకుని జ్ఞాని వద్దకు వస్తాడు. ” స్వామీ ఈ ఉంగరాన్ని కనీసం వంద రూపాయలకు కూడా ఎవరూ తీసుకోమంటున్నారు. పోవయ్యా పో అని కసురుకున్నారండి ” అని బాధపడతాడు.

వెంటనే జ్ఞాని “పరవాలేదు. దీనిని ఒక బంగారు నగల దుకాణానికి తీసుకుపోయి దీని ఖరీదు ఎంతో తెలుసుకురా” అని అంటారు.

అతను సరేనని ఆ ఉంగరంతో ఒక బంగారు దుకాణానికి వెళ్తాడు. ఆ ఉంగరానికి ఎంత డబ్బు ఇస్తారు అని అడుగుతాడు. దీనికి లక్ష రూపాయలు ఇవ్వగలం అని అంటాడు దుకాణదారు. అతని ఆనందానికి అంతు లేదు. తక్షణమే అతను జ్ఞాని వద్దకు వచ్చి అయ్యా ఈ ఉంగరానికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు అని అంటాడు.

అప్పుడు జ్ఞాని అతనితో నెమ్మదిగా ఇలా అంటారు ….

“ఈ ఉంగరం విలువ కిరాణా దుకాణాలున్న వీధిలో ఉన్న వారికి ఏమాత్రం తెలిసిందో నీకు కూడా జ్ఞానుల గురించి తెలిసింది అంతే. జ్ఞానుల గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. నువ్వు ఎవరినైనా విమర్శించు. అది నీకున్న హక్కు. దానిని ఎవరూ కాదనరు. కానీ ఒక్కటి. ఏ విషయాన్నైనా విమర్శించాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం ప్రధానం. అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఎవరో ఎక్కడో ఏదో అన్నారని ఆ నాలుగు ముక్కలు పట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒకరిని విమర్శించడం ఎప్పుడూ మంచిది కాదు. ఇక ముందైనా సరిగ్గా నడచుకో” అని.

ఒక్కో వస్తువుకు ఒక్కో చోట ఒక్కో విలువ ఉంటుంది. స్థానం బట్టి ఆ విలువ ఉంటుందని తెలుసుకోవాలి. ప్రతి దానికి ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఆ విశిష్టతను వెలకట్ట లేని అమూల్యమైనదిగా ఉన్నతమైనదిగా చూడవలసినదే ఆధ్యాత్మిక అంశం. దాని లోతుపాతులు తెలుసుకుని అనుసరించడం ముఖ్యం.

– యామిజాల జగదేశ్

Send a Comment

Your email address will not be published.