అలెగ్జాండర్ ది గ్రేట్

అలెగ్జాండర్  ది గ్రేట్

ప్రపంచ చరిత్రలో గొప్పసామ్రాజ్యాన్ని నిర్మించిన చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు “అలెగ్జాండర్ ది గ్రేట్ “. చరిత్రలో ఆయన సాధించిన విజయాలు ఆయన జీవితములోని ముఖ్య సంఘటనలు చదివేవుంటారు. ఇప్పుడు ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాము .
మాసిడోనియా రాజైన రెండవ ఫిలిప్ కు క్రీస్తు పూర్వము 356.( బి.సి) లో అలెగ్జాండర్ III జన్మించాడు . రెండవ ఫిలిప్ రాజు అలెగ్జాండరుకు విద్యా బోధన చేయటానికి ప్రముఖ తత్వవేత్త, శాస్త్రవేత్త అయిన అరిస్టాటిల్ ని నియమించాడు . అరిస్టాటిల్ ప్రభావము అలెగ్జాండర్ పై ఎంతగానో వున్నది. అరిస్టాటిల్ శిక్షణ, భోధనల వల్లే అలెగ్జాండర్ ఓటమి ఎరుగని చక్రవర్తి గా చరిత్రలో స్థానాన్ని సంపాదించాడు .
అలెగ్జాండర్ పశ్చిమము నుండి తూర్పుకు సాగించిన జైత్రయాత్రలో తాను గెలిచిన రాజ్యాలలోని దాదాపు 70 నగరాలకు తన పేరు అంటే “అలెగ్జాండ్రియా ” అని పెట్టాడు.

భారతదేశములో తాను జయించిన ఒక నగరానికి తనకు ఇష్టమైన గుర్రము పేరు “బుసిఫల ” అని పెట్టాడు.

ఎవరైతే గ్రీకు దేవత జియస్ సమక్షంలో గల “గార్డియన్ “ముడిని సులువుగా విప్పగలుగుతారో వారే ఆసియా ను జయించగలరని గ్రీకుల విశ్వాసము . అలెగ్జాండర్ తన కత్తితో అ ముడిని చాలా సునాయాసముగా విప్పగలిగాడు .

ఈజిప్టును దాదాపు 200 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పర్షియన్లను అలెగ్జాండర్ ఓడించాడు . పర్షియన్లను జయించి అలెగ్జాండర్ “కింగ్ ఆఫ్ ఏషియా “బిరుదును పొందాడు.

అమ్మాన్ లోని జియాస్ దేవాలయాన్ని అలెగ్జాండర్ దర్శించినప్పుడు అక్కడి పూజారి అలెగ్జాండర్ ను జియాస్ పుత్రుడిగా కీర్తించాడు

అలెగ్జాండర్ మొదటిచూపులోనే పర్షియన్ నాట్యగత్తె రోక్సానా ప్రేమలో పడి ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఇంకా విశేషము ఏమిటి అంటే రోక్సానాను పెళ్లి చేసుకున్నాక పర్షియన్ల మాదిరి దుస్తులు ధరించేవాడు రోక్సాన మీద ప్రేమతో.

భారత దేశములో ప్రవేశించిన అలెగ్జాండర్ చాలా కాలము అవటమువల్ల సైనికుల వ్యతిరేకతవల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలించనందువల్ల తనజైత్ర యాత్రను విరమించుకొని పశ్చిమానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

స్వదేశానికి చేరిన కొద్దికాలానికే అంటే క్రీస్తు పూర్వము 323.(బి.సి)లో అలెగ్జాండర్ మరణించాడు . అయన మరణము ప్రపంచములోని అతి పెద్ద మిస్టరీలలో ఒకటిగా మిగిలిపోయింది .

అలెగ్జాండర్ గౌరవార్ధము రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలోని స్కోప్జే విమానాశ్రయానికి “అలెగ్జాండర్ ద గ్రేట్ ఎయిర్ పోర్ట్ “అని నామకరణం చేశారు.

– అంబడిపూడి శ్యాం సుందర రావు

Send a Comment

Your email address will not be published.