అలెగ్జాండర్ ప్రేమ

అలెగ్జాండర్ ప్రేమ

ఈ ప్రపంచాన్ని గెలవాలనే లక్ష్యంతో అలెగ్జాండర్ సైన్యంతో ప్రపంచం మీదకు వెళ్ళాడు. ఆయన పారసీకాన్ని గెలిచిన తర్వాత మరో దేశం మీద దండెత్తాడు. ఆ దేశానికి వెళ్ళే దారిలో ఎన్నో అడవులు ఉన్నాయి. అలాగే మధ్యలో వచ్చిన నదులను దాటి ముందుకు సాగవలసి వచ్చింది.

దారిలో ఒక నది నుంచి గ్రీక్ వీరులు తమ వద్ద ఉన్న తోలు సంచులను నీటితో నింపారు. వాళ్ళు వెళ్ళిన సమయం వేసవి కాలం. భరించలేని ఎండలు. కాస్సేపటికే నీరసపరిచే ఎండ వేడి.

ఒకరోజు మిట్టమధ్యాన్నం. అలెగ్జాండర్ కి భరించలేని ఎండ వేడిమితో పెదవులు ఎండినట్లు అయిపోతున్నాయి. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఆ సమయంలో ఒక సైనికుడి దగ్గర  మాత్రం కాసిన్ని మంచినీళ్ళు ఉన్నాయి. అతను ఆ నీటిని తన శిరస్త్రానం తీసి అందులో నీళ్ళు పోసి అలెగ్జాండర్ కి ఇచ్చాడు. అలెగ్జాండర్ అది అందుకుని తన చుట్టూ ఉన్న మిగిలిన సైనికుల వంక చూసాడు. వాళ్ళు కూడా దాహంతో తల్లడిల్లడం గ్రహించాడు అలెగ్జాండర్.

“నా ప్రాణం కన్నా ఎంతో గొప్ప వారైన మీరందరూ దాహంతో తల్లడిల్లుతుంటే నాకు మాత్రం దాహం తీరితే సరిపోతుందా…అది నా స్వార్ధం అయిపోదు….నాకు మాత్రం ఆ నీరెందుకు?” అని అలెగ్జాండర్ అన్నాడు.

“మా పిల్లల కోసం” అన్నాడు ఒక యుద్ధ వీరుడు.

“ఏమిటీ మీ పిల్లల కోసమా?”

“అవును రాజా, దాహంతో మేము నాలిక ఎండి చనిపోయినా మీరు మాత్రం బతికుంటే మా పిల్లల్ని కాపాడుతారు కదా?” అన్నాడు మరొక సైనికుడు.

“మా పిల్లలు చనిపోయినా మేము మరొకరి పిల్లలను తీసుకోవచ్చు. కానీ మా రాజు చనిపోతే మేము అనాధలైపోతాం…” అన్నాడు ఇంకొక వీరుడు.

వారి మాటలు అలెగ్జాండర్ మనసుని పిండేసాయి.

“వీరులారా, మీకు మీ రాజు ప్రాణం ముఖ్యమైతే నాకు నా సైనికుల ప్రాణాలే ముఖ్యం. నేను మాత్రం మిమ్మల్ని కాదని ఎలా నా దాహం తీర్చుకోగలను” అని నీళ్ళు తాగలేదు.

అలెగ్జాండర్ తీరుకు వాళ్ళందరూ విస్తుపోయారు.

– సమీరాసంధ్య

Send a Comment

Your email address will not be published.