ఆకట్టుకున్న‘అంతరిక్షం’

Antariksham Reviewజాతీయ స్థాయిలో ఘాజీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి రెండో ప్రయత్నంగా తొలి తెలుగు స్పేస్‌ మూవీ, సైన్స్‌ఫిక్షన్‌ స్పేస్‌ థ్రిల్లర్‌ అంతరిక్షంను తెరకెక్కించాడు. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్‌లు ఆసక్తికరంగా ఉండటంతో సంకల్ప్‌ మరోసారి మ్యాజిక్‌ చేస్తాడన్న నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాన్ని సంకల్ప్‌ రెడ్డి నిలబెట్టుకున్నాడా..? వరుసగా రెండు సూపర్‌ హిట్‌లు అందుకున్న వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో హ్యాట్రిక్‌ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడా..?

కథ‌ :
దేవ్‌ (వరుణ్ తేజ్‌) ఓ స్పేస్‌ సైంటిస్ట్‌. రష్యాలో ట్రైన్‌ అయిన వ్యోమగామి. ఎన్నో ఆశలతో చంద్రుడి మీద నీటి జాడలు తెలుసుకునేందుకు విప్రయాన్‌ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తాడు. కానీ ఆ మిషన్‌ ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) కూడా ప్రమాదంలో చనిపోతుంది. దీంతో దేవ్‌ స్పేస్‌ రిసెర్చ్‌కు దూరమవుతాడు. కానీ ఐదేళ్ల తరువాత రిసెర్చ్‌ సెంటర్‌కు దేవ్‌ అవసరం పడుతుంది. మిహిరా శాటిలైట్‌ కక్షనుంచి పక్కకు తప్పుకొని మరో శాటిలైట్‌ను డికొట్టబోతుందని తెలుస్తోంది. మిహిరాను దేవ్‌ మాత్రమే కరెక్ట్ చేయగలడని అతన్ని పిలిపిస్తారు. రియా(అదితిరావ్‌ హైదరి), కరణ్‌ (సత్యదేవ్‌), సంజయ్‌ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్లిన దేవ్‌. మిహిరాను ఎలా సరిచేశాడు.? స్పేస్‌లో దేవ్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయమేంటి..? అన్నదే కథ.

న‌టీన‌టులు :
కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ప్రయోగాలు చేస్తూ వస్తున్న వరుణ్ తేజ్‌ ప్రతీ సినిమాతో నటుడిగాను ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో టెంపర్‌ కంట్రోల్‌ లేని సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా అద్భుతంగా నటించాడు. దేవ్‌ పాత్రకు ప్రాణం పోశాడు. రియా పాత్రలో అదితిరావ్‌ హైదరి సూపర్బ్ అనిపించింది. లుక్స్‌ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు సాధించింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో సత్యదేవ్‌, రాజా, రెహమాన్‌, అవసరాల శ్రీనివాస్‌ తమ పాత్రల పరిదిమేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :
అంతరిక్షం కోసం సంకల్ప్‌ తయారు చేసుకున్న కథనం దాదాపు ఘాజీలాగే సాగుతుంది. సినిమా ప్రారంభంలోనే మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్‌ తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్‌ చేసిన దర్శకుడు తొలి భాగాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఎక్కువ భాగం పాత్రల పరిచయంతో పాటు స్పేస్‌ మిషన్‌ అవసరం ఏంటి అన్న విషయాలను వివరించేందుకు కేటాయించాడు. ఫస్ట్ హాఫ్‌లో లవ్‌ స్టోరి కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సెకండ్‌ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్‌ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో సంకల్ప్ చేసిన రిసెర్చ్‌ తెర మీద కనిపిస్తుంది. ద్వితియార్థంలో పెద్దగా కథ లేకపోయినా.. తన కథనంతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. సినిమాకు మరో మేజర్ ప్లస్‌పాయింట్‌ సినిమాటోగ్రఫి. స్పేస్‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా చూపించాడు సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌. గ్రాఫిక్స్‌ అద్భుతమనే స్థాయిలో లేకపోయినా తమకున్న బడ్జెట్‌ పరిధిలో మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. ప్రశాంత్ విహారి సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తారాగణం : వరుణ్‌ తేజ్‌, అదితిరావ్‌ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్‌, రాజా, రెహమాన్‌, శ్రీనివాస్‌ అవసరాల
సంగీతం : ప్రశాంత్ విహారి, దర్శకత్వం : సంకల్ప్‌ రెడ్డి, నిర్మాత : క్రిష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి

Send a Comment

Your email address will not be published.