ఆదిపురుష్‌ గా ప్రభాస్

‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్‌ పేరు ప్రపంచం నలుమూలలా పాకింది. ఈ చిత్రంతో ఆయన జాతీయస్థాయి నటుడిగా మారారు. దీంతో బాలీవుడ్‌కు చెందిన దర్శకనిర్మాతలు ప్రభాస్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దర్శకుడు ఓం రావత్‌తో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నారు. చిత్రం పేరు ‘ఆదిపురుష్’‌. సినిమాకి సంబంధించిన పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా కథానాయకుడు ప్రభాస్‌, దర్శకుడు ఓంరావత్‌ ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘చెడుపై మంచి సాధించే విజయాన్ని పండగలా చేసుకుందాం..’’అని పేర్కొన్నారు. ఈ పోస్టర్లో రాముడు విల్లు పైకి ఎక్కిపెటినట్లు ఉండగా, ఇంకా పదితలల దశకంఠుడు, గదతో వేగంగా దూసుకొస్తున్న హనుమంతుడుతో కూడిన రూపాలు ఉన్నాయి. ప్రభాస్‌ తొలిసారిగా హిందీలో నేరుగా సినిమా చేస్తున్నాడు. గతంలో ఆయన నటించిన చిత్రాలు బాలీవుడ్‌లోకి అనువాదమై అలరించాయి. ఈ సినిమాని 3డీలో తెరకెక్కించనున్నారు. చిత్రాన్ని ముందుగా హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరించి తరువాత తమిళ, మలయాళి, కన్నడ భాషలతో పాటు మరికొన్ని అంతర్జాతీయ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భూషణ్‌ కుమార్‌ సమర్పణలో గుల్షన్‌ కుమార్‌, టీ-సీరీస్‌ ఫిల్మ్ పతాకంపై కిషన్‌ కుమార్‌, ఓం రావత్‌, ప్రసాద్‌ సుతార్‌ రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాని 2021 సెట్స్ పైకి తీసుకెళ్లి 2022 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ రాధా కృష్ణకుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత వైజయంతి మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీపికా పదుకొణె ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఏ.ఆర్‌.రెహమాన్ ‌సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాలు పూరైయిన తరువాతే ‘ఆదిపురుష్’‌ చిత్రం ఉండనుందని సమాచారం.

Send a Comment

Your email address will not be published.