ఆధ్యాత్మికతకు సాంకేతిక అనుసంధానం

శ్రీ శివ విష్ణు మందిరం – మెల్బోర్న్
ఎందరో మహానుభావులు చెమటోడ్చి కష్టించి మనకు అందించిన పుణ్య ఫలం. పలువురు సామాజిక స్పృహతో నిస్వార్ధ సేవతో తమ జీవితాలను అర్పించిన కధనం. ఎత్తుపల్లాలకు ఒడుదుడుకులకు అతీతం కాని పుణ్య కార్యం. అంచలంచెలుగా భారతీయతను సంతరించుకొని అందలమెక్కిన వైనం. ఏడుకొండలవాని కరుణా కటాక్షాలకు ప్రతిరూపం. పాతికేళ్ళ సుదూర ప్రయాణం. రజతోత్సవాలు జరుపుకోవడానికి రంగం సిద్ధం.

S Koteswara Raoమెల్బోర్న్ లోని శ్రీ శివ విష్ణు మందిర ప్రాకారం నిర్మాణము ముగించుకొని గుడి ద్వారాలు తెరచి ఈ నెల (అక్టోబర్ 2017)కి పాతికేళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ పాతికేళ్ళ చరిత్రలో ఇప్పటివరకూ మన తెలుగువారు నలుగురు అధ్యక్షులుగా ఎన్నిక కావడం మనకు గర్వకారణం. మొదటివారు శ్రీ రాంప్రసాద్ వేముల, రెండవ వారు శ్రీ రఘు పెండ్యాల, మూడవ వారు శ్రీ హరి గూడూరు మరియు నాల్గవ వారు ఈ ఏడాది శ్రీ కోటీశ్వర రావు శనగపల్లి. గుడి కట్టి పాతికేళ్ళయిన సందర్భంగా శ్రీ కోటీశ్వర రావు గారిని తెలుగుమల్లి పలకరించడం జరిగింది.

గత ఏడేళ్ళుగా శివ విష్ణు మందిరం అభివృద్ధి పనుల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కార్యవర్గంలో వివిధ పదవులను నిర్వహిస్తూ నిత్యమూ విఠలాక్షుని సేవలో పరితపిస్తూ అంచలంచెలుగా ఎదిగి ఈ సంవత్సరం అధ్యక్ష పదవినలంకరించిన శ్రీ కోటీశ్వర రావు గారు ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఒక పల్లెటూరిలో పుట్టి చిన్నప్పుడే గుంటూరు వెళ్లి M.Sc వరకూ అక్కడే చదువుకున్నారు. డిల్లీ IIT లో 1984 లో “ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్” పై అధ్యయనం చేసి డాక్టరేట్ పూర్తి చేసారు. ఆ తరువాత ONGC లో ఒక ఏడాది పాటు సహాయ సంచాలకులుగా (Information Management Services) పనిచేసారు.

డిల్లీలో డాక్టరేట్ చేస్తున్నప్పుడే ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఒక అధ్యాపకుని ప్రోద్భలంతో పెర్మనెంట్ రెసిడెన్స్ కి అర్జీ పెడితే 9 నెలల తరువాత అది కార్య రూపం దాల్చి 1985 ప్రధమార్ధంలో మెల్బోర్న్ రావడం జరిగింది. వచ్చిన దగ్గరనుండి కంప్యూటర్ రంగంలో విక్టోరియన్ ప్రబుత్వ రంగంతో సహా టేలస్త్రా, AGL మొదలైన ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నారు.

1986 లో వీరికి శ్రీమతి వెంకట రంగ లక్ష్మీ  జ్ఞాన ప్రసూనాంబ గారితో వివాహం జరిగింది.

1989 లో శ్రీ శివ విష్ణు మందిరం ప్రారంభం కాకముందే శ్రీ కోటీశ్వర రావు గారు జీవిత సభ్యులుగా చేరడం విశేషం.

1992 లో తాయి సంస్థ ప్రారంభించిన తదుపరి రెండు పర్యాయాలు కోశాధికారిగా కూడా పని చేసారు. అవకాశం దొరికినపుడల్లా రంగస్థలంపై నటిస్తూ తన కళాభిరుచిని చాటుకున్నారు.

జెట్ మెల్బోర్న్ చాప్టర్ కి రెండేళ్ళు ఉపాధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది.

శ్రీ శివ విష్ణు మందిరంలో ప్రస్తుతం కొన్ని పనులు కొన్ని స్వచ్చంద సేవా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, దాతల నుండి సేకరించిన కొంత మొత్తాన్ని వెచ్చించి రోడ్లు, కార్ పార్కింగ్ పనులు చేపట్టామని, అయితే ఇంకా చాలా డబ్బు అవసరం ఉన్నందువలన మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి డబ్బుని జమ చేయడం జరుగుతుందని శ్రీ రావు గారు చెప్పారు.

ఈ సంవత్సరం ముఖ్యంగా సాంకేతిక పరంగా మరికొన్ని కీలక అభివృద్ధి పనులను చేపట్టాలని వాటి ద్వారా భక్తులకు సులభతరంగా సేవలందించ గలమని శ్రీ రావు గారు చెప్పారు.

అదే విధంగా కార్యనిర్వహణ నియమావళి, కార్యసరళి, వ్యవహార పధ్ధతి మొదలైన అంశాలపై దృష్టి సారించి ఎక్కువమంది సభ్యులను చేర్పించడానికి ప్రయత్నిస్తామని శ్రీ కోటీశ్వర రావు గారు చెప్పారు.

ఈ ఆధ్యాత్మిక మందిరాన్ని సాంకేతికతను జోడించి ఆస్ట్రేలియాలో ఒక ముఖ్యమైన హిందూ పుణ్య క్షేత్రంగా తీర్చి దిద్దాలని తలంపుతో ఉన్నట్లు శ్రీ రావు గారు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.