ఆయనకాయనే సాటి

ఆయనకాయనే సాటి

గాంధీజీ రెండవ సుపుత్రుడు మణిలాల్. ఆయన చాలా కాలం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఆయనకు చాలా కాలం పెళ్లి కాలేదు.

అప్పట్లో భారత దేశంలో ఉన్న తన తండ్రి గాంధీజీకి మణిలాల్ ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఆయన తనకు ఒక భారతీయ యువతినే తాను పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నారు.

మణిలాల్ కోరిక మేరకు చాలా చోట్ల అమ్మాయిలను చూసారు. చివరికి సుశీల అనే ఒక యువతిని చూసి ఆమెతో మణిలాల్ కి పెళ్లి చేయించారు.

అకోలా అనే చోట మణిలాల్ – సుశీల పెళ్లి ఘనంగా జరిగింది.

పెళ్లి అయిన తర్వాత పెళ్ళివారు, గాంధీజీ, ఆయన బంధువులు తమ ప్రదేశానికి తిరుగుప్రయాణమయ్యారు. రైల్వే స్టేషన్ కి వచ్చారు.

గాంధీజీ, మరి కొందరు పెద్ద వాళ్ళు కూర్చున్న అదే బోగీలో నవ దంపతులూ కూర్చున్నారు. అప్పుడే పెళ్ళైన అమ్మాయి సుశీల. ఆమె పరిస్థితిని గ్రహించారు గాంధీజీ.

“మణిలాల్, నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి. ఈ పళ్ళు లేని ముసలి వాళ్ళ గుంపులో నువ్వెందుకురా వచ్చి కూర్చున్నావు” నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని జనం ఎక్కువ మంది లేని బోగీలో కూర్చోవచ్చు కదా… మీ ఇద్దరికీ వీలుగా ఉంటుంది కదా?” అన్నారు గాంధీజీ.

“వైవాహిక జీవితంలో భార్యాభర్తలూ ఒకరికొకరు అర్ధం చేసుకోవడానికి ఓ అవకాశం లభించినప్పుడు దానిని జారవిడుచుకోకూడదు…. సద్వినియోగం చేసుకోవాలి” అని కూడా చెప్పారు గాంధీజీ.

అక్కడ ఉన్న వాళ్ళందరూ గాంధీజీ చెప్పిన మాటలు విని నవ్వారు.

మణిలాల్ సిగ్గుతో తన భార్యను తీసుకుని అక్కడి నుంచి లేచి వెళ్లి మరొక బోగీలో కూర్చున్నారు.

చిన్న చిన్న విషయాల్లో కూడా ఎదుటివారి స్థితిని గ్రహించి నడచుకోవడంలో గాంధీజీ ఆయనకాయనే సాటి అని చెప్పుకోవచ్చు.

– సమీరా సంధ్య

Send a Comment

Your email address will not be published.