ఆరు రుచుల ఆనంద స‌మ్మే‌ళ‌నం

Ugadi-2018

భారత దేశంతోపాటు ప్రపంచ దేశాల్లో విస్తరించిన తెలుగు ప్రజల జీవితాలతో పెనవేసుకుని, హృదయాల్లో మమేకమైపోయిన పండుగ ఉగాది…. రకరకాల పండుగలు దైవ సంబంధమైనవైతే ఇది ప్రకృతికీ మనిషికీ గల అవినాభావ ఆత్మీయ సంబంధానికి ప్రతీకగా నిలిచిన పండుగ. అందుకే ఈ వసంత కాలంలో లేలేత వేపపూతా, మామిడాకులూ స్వాగతం చెప్తాయి. కష్టం, సుఖం, బాధ, కోపం, దుఃఖం, ఆశ, నిరాశ….ఇలా దైనందిన జీవితంతో ప్రతి సందర్భంలోనూ ఎదురుపడే అనుభూతులు.. అనుభవాలు.. ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి గుర్తులుగా నిలుస్తాయి. ఏడాదికి ఒకసారొచ్చే ఉగాది జీవితకాలపు మర్మాన్ని చెప్తుంది. ఆరు రుచులు కగలిసిన ఉగాది పచ్చడి అన్ని భావోద్వేగాల కలయికే జీవితమని తేల్చి చెప్తుంది. మనం గ్రహించలేని చాలా మూమూలు విషయాలనూ, గుర్తించాల్సిన వాస్తవాలనూ, మళ్లీ ఏడాది వరకూ కావాల్సిన మానసిక స్థయిర్యాన్నీ అందిస్తుంది.

పిండివంటలూ, పట్టుబట్టలూ, తలంటు స్నానాలూ, పూజా కార్యక్రమాలూ, మామిడి తోరణాలూ మాత్రమే కాదు ఉగాది… పండుగంటే మన వాళ్లందరూ కలవాలి. మన ఆనందాన్ని నలుగురికీ పంచాలి. కొందరి కష్టాన్ని ఇంకొందరి సుఖాన్ని, వేరొకరి ఆనందాన్నీ, బాధనూ ఒక దగ్గరకి చేర్చాలి. ఒకరికొకరు అండగా నిలబడాలి. జాగ్రత్తగా ప్రకృతిని గమనిస్తే.. పండుగలోని ఈ వాస్తవాన్ని గ్రహించవచ్చు. అప్పుడు కానీ నిజమైన ఉగాదిని అనుభవించలేం.
మనందరికీ ఉగాది చక్కని జీవిత పాఠం నేర్పుతుంది. ప్రతి ఏడాదీ ప్రేమగా పలకరిస్తుంది. అన్నిరకాల భావోద్వేగాలూ కలిస్తేనే జీవితమనీ, అదే పరిపూర్ణమనీ, ప్రతి ఘట్టాన్నీ ధైర్యంగా ఎదుర్కొంటేనే అసలైన విజయమనీ, మన జీవితాల్లో ప్రతిరోజూ పండుగేననీ అర్థం చెప్తుంది. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులకు ప్రతీకాత్మకంగా ఆరుగురి తెలుగోళ్ళ జీవితాల్లోకి ఒకసారి చూద్దాం…ఇందులోని సన్నివేశాలు మనందరికీ ఎప్పుడో ఓసారి ఎదురయ్యేవే….

చేదును స్వాగతిస్తూ
రాఘవ మొదటి నుంచీ నెమ్మదస్తుడు. దానికితోడు జీవితంలో ప్రతి చిన్న విషయానికీ కుమిలిపోయేవాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. తనకున్న బాధలను ఎవరితోనూ చెప్పుకునేవాడు కాదు. చిన్నచిన్న ఇబ్బందులలోనూ, ప్రతికూల పరిస్థితులలోనూ వెనకడుగేసేవాడు. తీవ్రమైన ఆత్మన్యూనతా భావనతో కుంగిపోయేవాడు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని తెలుసుకోవడానికి వాళ్ల నాన్నకు 17 ఏళ్లు పట్టింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో వెంటనే మానసిక వైద్యుల్ని సంప్రదించారు. ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేకపోవడమే అతని సమస్య అని తేలింది. అందుకే చిన్నతనం నుంచే బాధలను ఎదుర్కొనేతత్వాన్ని.. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగల తెగువను.. పిల్లల్లో పెంపొందించాలి. ఇలాంటి కష్టాన్ని ఉగాది పచ్చడిలోని చేదుతో పోల్చొచ్చు.. అందుకే ఉగాది మిగిలిన భావోద్వేగాల్లాంటి రుచులతో చేదునూ కాస్తంత కలిపితేనే జీవితపు పరమార్థం తెలుస్తుంది.

ఇష్టమైతే ఏదీ కష్టం కాదు
రాజేష్ తండ్రి ఓ పేద వ్యవసాయ కూలీ. చిన్నప్పటి నుంచీ ఎంతో కష్టపడి అతడిని పెంచి, చదివించి పెద్ద చేశాడు. అతని కుటుంబమంతా ఎప్పటికప్పుడు మేమున్నామన్న ధైర్యాన్ని అతనికిస్తూనే ఉంది. రాజేష్ కూడా బాల్యం నుంచీ పాతికేళ్ల వరకూ కష్టాలు పడుతూనే వచ్చాడు. కానీ ఒక్కరోజు కూడా జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కష్టాలూ జీవితంలో ఒక భాగమనుకునే ముందుకు వెళ్లాడు. అదే అతని విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆ కష్టాలు అతని ఎదురీత ముందు ఎంతోకాలం నిలవలేక పోయాయి. ఈ రోజున తానే స్వయంగా తల్లిదండ్రులకో సొంత ఇల్లు కొనివ్వగలిగాడు. అన్నీ కలగలిస్తేనే జీవితమనుకుని తెలుసుకుని తననీ, తన కుటుంబాన్నీ గెలిపించాడు. ఇలాంటి కష్టాలను ఉగాది పచ్చడిలోని వగరుతో పోల్చొచ్చు. అన్నింటినీ ఇష్టంగా స్వీకరించినప్పుడే అపూర్వ విజయాలు సొంతమౌతాయని వగరుతో ఉగాది పచ్చడి చెప్పకనే చెప్తోంది.

సమస్యలే రాటుదేలుస్తాయి
సుమన చాలా తెలివైన, అందమైన అమ్మాయి. కుటుంబసభ్యులతోనూ, స్నేహితులతోనూ చాలా ప్రేమగా, చలాకీగా ఉండేది. ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ చలాకీతనం కోల్పోయింది. ఇప్పుడు దిగులుగా ఒంటరిగా కూర్చుంటోంది. గత కొన్నాళ్లుగా సరిగా తిండి తినడం, నిద్రపోవడం మానేసింది. చక్కగా 55 కేజీల బరువు ఉండే అమ్మాయి కాస్తా 40 కేజీలకన్నా తగ్గిపోయి, అస్థిపంజరంలా తయారైంది. ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయింది. అప్పటివరకూ అన్ని తరగతుల్లో డిస్టింక్షన్‌లో పాస్‌ అవుతూ వచ్చిన అమ్మాయి.. పరీక్షలు రాయడమే మానేసింది. పూర్తిగా డిప్రెషన్‌లో కూరుకుపోయింది. తీరా కుటుంబసభ్యులు ఆమె స్నేహితులను ఆరా తీశారు. అదేం పెద్ద సమస్య కాదు. అప్పటివరకూ తనని ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి మోసం చేశాడు. ఇలాంటి సమయంలోనే కుటుంబసభ్యులూ, స్నేహితులూ అండగా ఉన్నామంటూ నిలబడ్డారు. ఇప్పుడు సుశాంతి కోలుకుని, ఎప్పటిలా చలాకీగా పరీక్షలకు వెళ్తోంది. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్నీ ఉగాదిలోని పులుపుతో పోల్చుకోవచ్చు.. పులుపు ప్రత్యేక సందర్భాల్లో ప్రాధాన్యతను పొందుతుంది. అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న మనవారికి మనం అండగా ఉంటేనే ఆనందం కదా!

మనస్పర్థలను దూరంచేసే మమ’కారం’
రాజాది అందమైన కుటుంబం. పాత తెలుగు సినిమాలోలా అందరూ కలిసుండే చక్కని ఉమ్మడి కుటుంబం. ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన అమ్మాయే మైత్రి. రాజా, మైత్రిలు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెద్దల్నీ ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మైత్రి మోడ్రన్‌ దుస్తులు ధరించడం ఆ కుటుంబంలో వారికి ససేమిరా నచ్చడం లేదు. చిన్నగా మనస్పర్థలు మొదలయ్యాయి. అంతవరకూ చక్కని కుటుంబం మనస్పర్థలతో చెల్లాచెదురైంది. అది మొదలు కట్నకానుకలు నుంచి అన్ని విషయాలూ చర్చకు వచ్చాయి. అయితే మైత్రి ఎక్కడా కంగారుపడలేదు. ఆ ఇంట్లో ఒక్కొక్కరికీ అర్థమయ్యేలా వాళ్ల తప్పులేంటో తెలియజేసింది. చివరికి ఆ కుటుంబసభ్యుల చేతనే తను చేసే ప్రతి పనినీ శభాష్‌ అనిపించింది. ఆవేశంతో నిర్ణయం తీసుకోకుండా.. తన అస్థిత్వాన్ని చాటుకుంటూనే ఆ కుటుంబసభ్యుల ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చింది. ఇలాంటి మనస్పర్థలను ఉగాది పచ్చడిలోని కారంతో పోల్చొచ్చు. అన్నీ రుచులను కలిపేసినట్టు. జీవితంలో ఇదీ ఒక భాగమే కదా!.. ప్రతికూల పరిస్థితుల్నీ ఎదుర్కొనే పద్ధతినే ఉగాది కూడా నేర్పుతోంది మరి.

కలిసుంటేనే మాధుర్యం
ఆ ఊరి మొత్తంలో శంకరరావుది చాలా చక్కని కుటుంబమని పేరు. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. ఆ ఇంట్లోకి కొత్తగా ఎవరు ప్రవేశించినా వాళ్లలా ప్రేమించడం, ప్రేమించబడటం నేర్చుకుంటూనే ఉంటారు. ఎవరికి ఏ చిన్న ఆనందం వచ్చినా అది కుటుంబసభ్యులు అందరితో పాటు కలిసి పంచుకుంటారు. అలాంటి వాతావరణాన్ని శంకరరావు ఆ ఇంటిలో వారికి మొదటిరోజు నుంచే అలవాటు చేశాడు. ఇంటి వాతావరణం ప్రేమగా ఉంటే ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొని, గొప్ప విజయాలు సాధించగలరూ అని చెప్పటానికి ఆ ఇల్లొక ఉదాహరణ. వారు పంచే ఆనందం, ప్రేమ ఆ కుటుంబసభ్యులకు ప్రతికూల పరిస్థితుల్లోనూ బలాన్నిస్తుంది. అదే వారి విజయాలకూ దోహదపడుతుందన్నది అంతే నిజం. ఉగాది పచ్చడిలోని తీపి కూడా చెప్పేది అదే కదా..! అన్నిరకాల భావోద్వోగాలనూ అనుభవించాలి. ఉగాది పచ్చడిలోని తీపిలా సంతోషాన్ని బాధలో, దిగులులో, కష్టంలో, నష్టంలో ఉన్నవారందరికీ పంచాలి.

సమస్యలే ఎల్లప్పుడూ ఉండవు
రాకేశ్ చాలా తెలివైన కుర్రాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాడు. దేశంలోనే టాప్‌ మెడికల్‌ కాలేజ్‌లో సీటు సంపాదించాడు. అయితే ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కాలేజీలో చేరిన కొన్ని రోజులకే చదువు మానేస్తాననీ, తమ ఊరికి దగ్గరలోని కాలేజీలోనే డిగ్రీ చదువుకుంటాననీ ఇంటికి ఫోన్‌ చేసి బాధపడటం మొదలుపెట్టాడు. ఇవ్వన్నీ మామూలే.. త్వరలోనే సర్దుకుంటాడని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. అంతలోనే రాకేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడని కాలేజీ నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రాణానికి ప్రమాదం ఏమీలేదని చెప్పగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా అప్పుడు కుటుంబసభ్యుల బాధ చూసి, ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయకూడదని అనుకున్నాడు. కోలుకున్న తర్వాత ప్రతిరోజూ నవ్వుతూనే తనకు ఎదురైన సమస్యల్నీ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఓ ప్రభుత్వాస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు తనకెదురైన సంఘటననే తనని మరింత బలవంతుడిని చేసిందంటాడు. వాటిని ఎదుర్కొన్నప్పుడే కదా గొప్ప విజయాలు మన సొంతమౌతాయనీ ఈ రోజున ఎంతోమంది యువతకి కౌన్సెలింగ్‌ చేస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని ఉగాది పచ్చడిలోని ఉప్పుతో పోల్చుకోవచ్చు… ఉప్పు లేకుండా రుచిని ఊహించలేం. అందుకే ఆశావాద దృక్పథంతో అడుగులు వేసేవాడే జీవితంలో కథానాయకునిగా నిలుస్తాడు.

ఇలా ఉగాది పచ్చడిలోని ఒక్కో రుచీ మన జీవితానికి ముడిపడి ఉన్నదే. అన్వయించుకుంటే ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది కూడా. ఉగాది మనల్ని మనకు తెలియజెప్పే పండుగ. ఓ ఏడాదికి కావాల్సిన బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుకునే సమయం. ఇది మనందరి పండుగ. మన జీవితాలతో పెనవేసుకున్న పండుగ. జీవితంలోని ఆరు రుచులను పరిచయం చేసే పండుగలో మనమంతా మనసారా మైమరచి మాధుర్యాన్ని పంచుకుందాం

Send a Comment

Your email address will not be published.