ఆస్ట్రేలియాలో ‘అరుణ’ కాంతులు

న్యూ సౌత్ వేల్స్ ఎన్నికలలో MLCగా ఆస్ట్రేలియా జాతీయ లేబర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సందర్భంగా శుభాకంక్షలతో…

Aruna_Chandrala_1సూర్య చంద్రులు ఒకే తారై తూర్పు వైపునవున్న పశ్చిమ దేశంలో భారతీయ తెలుగువెలుగుల కాంతి శ్రీమతి అరుణ చంద్రాల. పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటినుండే పోరాట పటిమ, ఎంతటి క్లిష్టమైన సమస్యైనా ఛేదించాలన్న పట్టుదల వంటి లక్షణాలను అలవరుచుకొని పుట్టుగతోనే నాయకత్వ లక్షణాలు గల తెలుగింటి ఆడపడుచుగా పేరుపొందారు. విద్యార్ధిగా ఉన్నపుడే నాయకత్వ బాధ్యతలు చేపట్టి భవిష్యత్తుకు బాట వేసుకున్నారు.

సంఘసేవలో అంచెలంచెలుగా ఎదిగి సిడ్నీ తెలుగు సంఘం అధ్యక్షురాలుగా మూడు సార్లు, యునైటెడ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షురాలుగా 2009 – 11 మధ్య రెండుసార్లు ఎన్నికయి ఇటు తెలుగువారే కాక భారతీయులందరికీ తన సేవలందించారు. హెలేన్స్ బర్గ్ లోని హిందూ దేవాలయంలో వివిధ హోదాల్లో పనిచేసి ఆధ్యాత్మిక సేవలో కూడా తనసత్తా చాటుకున్నారు.
శ్రీమతి అరుణ గారి అధ్వర్యంలో న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ లో మొట్టమొదటిసారి ఉగాది, దీపావళి, బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా భారతీయ గ్రంధాలలో అత్యంత ప్రధానమైనది భగవద్గీత పుస్తకాన్ని అందించడం జరిగింది. భారతీయ సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఎవరో ఒకరు ఈ పుస్తకంపై ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపడతారన్న ఒక నమ్మకం. పలువురు భారతీయ అధికారులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు ఇంకా ఎంతోమంది ముఖ్య అతిధులను పార్లమెంట్ లో పరిచయం చేసి ప్రభుత్వ పరంగా తగినరీతిలో సత్కారాలు చేయడం శ్రీమతి అరుణ గారి అధ్వర్యంలో జరిగింది.

2013లో సిడ్నీలో మొదటిసారిగా ‘ప్రపంచ తెలుగు మహోత్సవం’ మూడు రోజుల పండగ దిగ్విజయంగా జరిపించడంలో శ్రీమతి అరుణ చంద్రాల గారు కీలక పాత్ర వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల నుండి తెలుగువారు తరలి వచ్చి కన్నులపండువుగా జరుపుకున్నారు. అదే కార్యవర్గం గత ఏడేళ్ళుగా భారతీయ పండగలలో మొదటి పండగ ‘వినాయక చవితి’ ప్రతీ సంవత్సరం అత్యంత సంబ్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. వినాయక విగ్రహాలు మట్టితో తయారుచేయించి పర్యావరణ కాలుష్య నివారణకు తనవంతుగా కృషి చేసి అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
సిడ్నీలో ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన పలువురు స్త్రీలు కుటుంబ కలహాల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం మరియు వారికి తగు సహాయం అందివ్వాలన్న తపనతో ‘గ్లోబల్ ఉమెన్ నెట్వర్క్’ కొంతమంది అనుయాయులతో స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు శ్రీమతి అరుణ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా పని చేసారు. అయితే కుటుంబ కలహాలకే పరిమితం కాకుండా వలసదారులకు, విద్యార్ధులకు మరియు ఇతర అననుకూలమైన పరిస్థితిలోనున్న వారికి ఈ సంస్థ తగిన సహాయం అందిస్తుంది.

భారతీయ విద్యార్ధులు చాలామంది ఇబ్బందుల్లో ఉండి లేక చనిపోయినా వారికి సరియైన సమయంలో సహాయం అందక ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. వీరికోసం ప్రత్యేకించి శ్రీమతి అరుణ గారు భారత ప్రభుత్వ దౌత్యాధికారులతో సంప్రదించి ఒక ధార్మిక నిధిని (Benevolent Fund) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిధి ద్వారా ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు భారత ప్రభుత్వమే తగు ఏర్పాట్లు చేసి మన విద్యార్ధులను ఆదుకుంటుంది.

వయోవృద్ధుల అవసరాలను గుర్తించి శ్రీమతి అరుణ గారు Hornesby Tafe లో ఒక ప్రత్యేక అంశాన్ని అధ్యనం చేసి వారికి సామాజిక పరంగా, ప్రభుత్వ సహాయంతో సరియైన ఏర్పాట్లు చేసి వారి జీవన శైలిలో విలువైన మార్పులు తేవడం జరిగింది.

1982లో న్యూ జిలాండ్ దేశానికి వలస వెళ్లి 1986లో ఆస్ట్రేలియా రావడం జరిగింది. భర్త శ్రీ విశ్వనాథ్ గారికి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటూ పరిపూర్ణమైన అంకితభావంతో సమాజసేవ అందిస్తూ వస్తున్నారు. లేబర్ పార్టీ విలువలకు అనుగుణంగా పెట్టుబడిదారీ వర్గానికి అతీతంగా విద్య, వైద్యం వంటి ప్రజాహితమైన సామాజిక అవసరాలను గుర్తించి వాటిని పునరుద్దరించడానికి కంకణం కట్టుకున్నారు. అందుకుగాను వచ్చే న్యూ సౌత్ వేల్స్ ఎన్నికలలో MLCగా ఆస్ట్రేలియా జాతీయ లేబర్ పార్టీ తరఫున టికెట్టు ఇచ్చి గుర్తించడం జరిగింది.

భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య ఆర్ధిక, విద్య, పరిశోధనా, వ్యాపార రంగాలలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ భారత దేశం నుండి ప్రత్యేకంగా మొదటిసారి తెలుగు రాష్త్రం నుండి వచ్చిన మహిళ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ కి పోటీ చేయడం ముదావహం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుమల్లి శుభాకాంక్షలు తెలుపుకుంటుంది.

వచ్చే ఎన్నికలలో ఓటు వేసే పధ్ధతి:

Aruna_Vote

Send a Comment

Your email address will not be published.