ఉత్తరం .... మాట

ఉత్తరం అనేది ఏదో ఓ విషయం చెప్పడం కోసం మాత్రమే కాదు. అది మరొకరిని మనం ప్రేమిస్తున్నామని, అభిమానిస్తున్నామని, ఆరాధిస్తున్నామని అనే వాటికి ప్రత్యక్ష సాక్ష్యం. ఒక విధంగా ఆలోచిస్తే ఉత్తరం అనేది మన మనసు మాట. నేరుగా చెప్పలేని విషయాన్ని ఉత్తరం ద్వారా చెప్పుకోవచ్చు. కన్నీటి చాయలతో తడిసిన ఉత్తరాలు, ఎడబాటుతో ఒక వ్యక్తి పడే బాధలను చెప్పడానికి రాసుకునే ఉత్తరాలు మనసుతో ముడిపడి ఉంటాయి. తొలి ప్రేమను చెప్పిన ఉత్తరాలు ఇలా ఎన్నో రకాల ఉత్తరాలు నేను చదవకపోలేదు.ఎదుటి వారి గురించి ఆలోచించే వారు రాసే ఉత్తరాలు వారి మనసుకు అద్దం పడతాయి.

అది ఒక బహుళ అంతస్తుల భవనం. ఆ భవన సముదాయంలో చెత్తను ఏరి పరిశుభ్రంగా ఉంచడం కోసం ఒక ప్రకటన ఇవ్వగా ఎందరో వస్తారు ఇంటర్వ్యూకి. వారిలో ఒక యువకుడు ఎంపిక అవుతాడు.

అతను పనిలో చేరినప్పటి నుంచి తనకప్పగించిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తుంటాడు. రోజులు గడుస్తున్నాయి. రోజూ లాగే ఆ రోజు కూడా చెత్త అంతా ఊడ్చి ఒక చెత్త కుండీలో కుమ్మరిస్తుంటే అతని దృష్టి అందులో ఉన్న కొన్ని చిరిగిపోయిన కాగితాలమీద పడుతుంది. ఆసక్తిగా ఆ ముక్కలన్ని ఏరి వాటిని ఒక మూల కూర్చుని ఒక క్రమ పద్ధతిలో పేర్చి చూడగా అదొక ఉత్తరం. ఒక చెల్లెలు తన అన్నయ్యకు రాసుకున్న ఉత్తరం. ఆ ఉత్తరంలో ఆ చెల్లెలు తన కష్ట నస్టాలన్నీ ఏకరువు పెడుతుంది. అతని మనసు చివుక్కుమంది. ఆ ఉత్తరాన్ని దాచుకుంటాడు.

రెండు రోజులకు మూడు రోజులకొకసారి చెత్త కుండీలో అన్నయ్యకు చెల్లెలు రాసిన ఉత్తరం ముక్కలు కనిపిస్తుంటాయి. వాటిని అతను పోగు చేసి ఓ నిర్ణయానికి వస్తాడు. ఆ ఉత్తరాలు బట్టి ఓ చెల్లెలు తన అన్నయ్య నుంచి ఓ ఓదార్పుని ఆశిస్తోందని అర్ధం చేసుకుని తానే ఆమె అన్నయ్య ఉత్తరం రాసినట్టు ఒక ఉత్తరం పోస్ట్ చేస్తాడు ఆ చెల్లెలికి. అలా మూడు నాలుగు ఉత్తరాల తర్వాత అతను ఒక ఉత్తరంతోపాటు కొంత డబ్బు కూడా పంపుతాడు అతను. అందుకు ఆమె ఎంతో సంతోషించి అన్నయ్యకి నేరుగా కృతజ్ఞతలు చెప్పడానికి ఊరి నుంచి బయలు దేరుతుంది. ఆమె రాకను గమనించిన చెత్త ఏరే కుర్రాడు తన విషయం తెలియనివ్వక పక్కకు తప్పుకుంటాడు. అతని ఆనందానికి అంతు లేదు. అక్కడితో కథ ముగుస్తుంది.

ఒకరి కస్టాలు పంచుకోవడానికి మంచి మనసు ఉండాలి. డబ్బో దస్కమో కాదు. ఒక ఉత్తరం చాలు అనేదే ఈ ఇరాన్ కథ సారాంశం.

మాటలు కవితలోనో, ప్రేమ లేఖలోనో మాత్రమే ఎప్పుడూ సజీవంగా ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాలు తాసుకోవడం అనే అలవాటే పోయింది. కనుక కనీసం ఎస్ ఎం ఎస్ ల ద్వారానైనా మనసు పంచుకుంటే మంచిది.

మనిషి సృష్టిలో మాటలు మాటలు మహత్తరమైనవి. అవి ధాన్యం గింజల లాంటివి. విత్తనం భూమిలో పాటి పెడతాం. అది మోక్కై మొలకెత్తి ఆకలితీరుస్తుంది. అంతేకాదు అది మరో విత్తనంగానూ మారుతుంది. అలాగే మాట కూడా విత్తనంగా మారడం, లేదా వృధా చెయ్యడం అనేది మన చేతిలో ఉంది.

– సమీరా సంధ్య

Send a Comment

Your email address will not be published.