కాశీయాత్ర - రెండు ప్రముఖ పుస్తకాలు

కాశీయాత్ర - రెండు ప్రముఖ పుస్తకాలు

కాశీ క్షేత్రం గురించి చెప్పాలంటే ఇది భారతీయ ఆత్మ. మహానగరం. ప్రాచీన సంప్రదాయ విద్యలకు అప్పటికీ ఎప్పటికీ ఓ గొప్ప అధ్యయన అధ్యాపన కేంద్రం. అటువంటి కాశీ గురించి తెలుగులో వచ్చిన పుస్తకాలు కొన్ని ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనవి రెండున్నాయి. అవి ఒకటి – ఏనుగుల వీరాస్వామయ్య గారి పుస్తకం కాశీ యాత్రా చరిత్ర. రెండవది – చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి కాశీ యాత్ర.

వీటిలో మొదటిదైన ఏనుగుల వారి కాశీయాత్ర తెలుగులో వచ్చిన మొట్టమొదటి యాత్రా చరిత్రగా చెప్పుకోవచ్చు. ఆయన కాశీ, గయా యాత్రల కోసం 15 నెలల 15 రోజుల పది నిమిషాలు గడిపారు. ఈ యాత్ర 1830 మే 18 వ తేదీన మొదలై 1831 సెప్టెంబర్ వరకు సాగింది. ఈ యాత్రను ఆయన దాదాపు వంద మందితో చేపట్టారు. బస్సు సౌకర్యం సరిగ్గా లేని రోజుల్లో ఆయన ఈ యాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం విశేషం.

ఆయన తన పారాయణ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు తన స్నేహితుడు కోమలేశ్వరపురం శ్నరీనివాస పిళ్ళైకి ఉత్తరాల ద్వారా చెప్తూ వచ్చారు. ఆ లేఖల ద్వారానే ఆనాటి కాశీయాత్ర విషయాలు మనకు తెలిశాయి. ఆయన 1836 లో దుర్ముఖి సంవత్సర భాద్రపద బహుళ పక్ష అష్టమీ రోజున (సోమవారం) మరణించిన తర్వాత శ్రీనివాస పిళ్ళై ఏనుగుల వారి కాశీ యాత్రా చరిత్రను తొలి సారిగా ప్రచురించారు. మరో 31 ఏళ్ళ తర్వాత 1869 లో ఇది రెండో ముద్రణకు నోచుకుంది. అయితే 1941 లో ప్రముఖ పరిశోధకులు దిగవల్లి వెంకట రావు గారి ఆధ్వర్యంలో ఈ యాత్రా చరిత్ర విడుదల అయ్యింది.

ఇక ఆంద్ర దేశంలో తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధిపొందిన వారిలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గురువుల కటాక్షంతో తెలుగుసాహిత్యంలో అమూల్యమైన పుస్తకాలు అందించారు. ఆయన అవధానానికి పెట్టింది పేరు. తిరుపతి వెంకట కవుల “పాండవోద్యోగ విజయం” నాటకాన్ని ఎరుగని ఆంధ్రుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.

శతావధానిగా యెనలేని కీర్తిప్రతిష్టలు పొందిన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి తన పద్దెనిమిదో ఏట కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడ వ్యాకరణం అధ్యయనం చేశారు. ఈ సమయంలో అక్కడ చవిచూసిన అనుభవాలను ఆయన కాశీ యాత్ర అనే శీర్షిక కింద పుస్తకం రాశారు.
————————-
యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.