చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతు

Krishna
చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు…
అనే పద్యాన్ని చిన్నప్పుడు పాతతరాల్లో అంతా చెప్పేవారు…ఇది శ్రీ కృష్ణుని గురించిన పద్యం

కృష్ణ జన్మాష్టమినాడే శ్రీ కృష్ణుని పుట్టీనరోజు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

ఆద్భుత గాథ
శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.

మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్లైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తునప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. “ఓ కంసా! నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం” అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగృడవుతాడు. “ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తాను” అని హూంకరిస్తాడు.

అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్ధిస్తాడు. “దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లిని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు” అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

మొదటి బిడ్డ పుట్టగానే కాపలావాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు “ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని” ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా, ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం. అది ఇలా జరుగుతూనే వస్తుంది.

ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది.

వసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలావాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు.

“ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంప గలిగేవాడేమో. కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు” అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్ధిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి “నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు” అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు, రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం.

శ్రీ కృష్ణుడు జగద్గురువు
Hare krishnaశ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. ధర్మ పరంగా రాజనీతి తెలిసినవాడు ధర్మ రక్షణే కర్తవ్యంగా ఎన్ని నిందలు వచ్చినా భారించినవాడు. శ్రీ కృష్ణుని ప్రవర్తన అర్ధంకాని అర్జునునకు కృష్ణుడు రణరంగంలో గీతను భోదించాడు. శ్రీ కృష్ణుడు ఉపదేశించిన ఈ గీత ” భగవద్గీత ” గా లోకమున ప్రసిద్ది చెందింది. ఈ గీత భోద విన్న అర్జునుడు తన అజ్ఞానం తొలగించుకొని యుద్ధం చేసి విజయం పొందాడు.ఎప్పుడు లోకంలో ధర్మం నశించి అధర్మం వృద్ది పొందితే అప్పుడల్లా నేను అవతరిస్తానని శ్రీ కృష్ణుడు ‘ గీత ‘ లో ఉపదేశించాడు.శ్రీ కృష్ణుడు చేసిన ప్రతి పనిలో ఈ గీత యొక్క అంతరార్దం నిలిచిఉన్నదని మహాత్ములైనవారు విశ్వసించారు. దీనినే కృష్ణ తత్వంగా కూడా వారు అభివర్ణించారు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు జగద్గురువు.

కృష్ణాష్టమి ఉట్ల పండుగ
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

గుజరాతీల సంప్రదాయం ఆదర్శం
గుజరాత్‌ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీజగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు నాలుగురోజుల ముందునుంచే పూజలు ప్రారంభమవుతాయని జిల్లా కేంద్రానికి సమీపంలోని జీఎస్‌ ఎస్టేట్‌లో నివాసముండే గుజరాతీలైన తోడికోడళ్లు జ్యోతి, కాజల్‌ తెలిపారు. పండగకు నాలుగురోజుల ముందు వచ్చే చవితినాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవారు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.

గోపాలుడు
అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం వూయలలో ఉంచి భక్తి, జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రైప్రూట్స్‌తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే (దహీహండీ) కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా, పురుషులు ప్రత్యేక నృత్యప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండీని పగులగొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు.

ప్రత్యేక నృత్యాలతో అలరించే లాబానా ప్రజలు
లబానా సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు ఒకరోజు ముందునుంచే కుటుంబంలో ఒక పురుషుడు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. చెరువు వద్ద నుంచి తెచ్చిన నల్లమట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారుచేస్తారు. మరునాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పుదిక్కున కట్టె పీటపై కుటుంబసభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. విగ్రహానికి కొత్తబట్టలు అలంకరించినట్లు తెల్లబట్టను నెత్తిన ఉంచుతారు. చేనులోని బావినుంచి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో జీలకర్ర, ఎండుబంక, సిర, గోధుమపిండితో తయారుచేసిన పిండిపదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత పుణ్య స్నానమాచరించి చిన్నారులు కుటుంబసభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్లీ పూజలు నిర్వహిస్తారు. విగ్రహానికి గంధం పూసిన తర్వాత పూజల్లో కూర్చున్న వారందరికీ గంధాన్ని తిలకంగా దిద్దుతారు. అనంతరం సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు. చుట్టుపక్కల వారికి ప్రసాదంగా అందిస్తారు. అనంతరం రాత్రి లబానా సంప్రదాయ వేషధారణలో యువతీ, యువకులు కృష్ణుడి గీతాలపై ఆనందోత్సహాలతో నృత్యాలు చేస్తారు. మరునాడు ఉదయం 7గంటలకు ముందే ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంటికొచ్చి ఉపవాసదీక్షలు విరమిస్తారు.

వినాయకుడి పండగను గుర్తు చేసే రాజస్థానీ సంప్రదాయం
రాజస్థాన్‌లో కృష్ణాష్టమికి మట్టివిగ్రహాలను తయారుచేసి ప్రత్యేక పూజలు చేస్తామని జిల్లాకేంద్రంలోని రాణీసతీజీ కాలనీలో నివాసముంటున్న రాజస్థాన్‌వాసులు జగదీష్‌అగర్వాల్‌-హేమలత తెలిపారు. కృష్ణుడి విగ్రహానికి పండగరోజు ఉదయం తెల్లదుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. కట్టెతో చేసిన పీటపై కొన్ని కుటుంబాలు కలిసి అందరూ సూచించిన ఒకరి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. ఉపవాసదీక్షలు పాటించి కృష్ణుడిగీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. చీకటిపడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుడిని వేడుకుంటారు. ఇలా రాజస్థానీ సంప్రదాయంలో కొడుకు పుడితే చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తాం. ఆవుదూడను వెంటతీసుకొని చంద్రుడు కన్పించే విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ, చక్కెరతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సంప్రదాయ వేషధారణలో డీజే పాటలపై ఆనందోత్సవాలతో కృష్ణుడి గీతాలపై నృత్యాలు చేస్తారు. మరునాడు ఉదయం ఒక మహిళ పవిత్రస్నానమాచరించి ప్రత్యేక పూజల నడుమ పీట మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో పెట్టి నెత్తిన మహళలు, యువతీ, యువకుల సమక్షంలో దాదాపు 15-20 మంది వరకు కలిసి కృష్ణుని గీతాలు ఆలపిస్తూ వూరేగింపుగా సమీపంలో ఉన్న నదులు, చెరువులకు వెళ్తారు. ఎంతదూరమున్నా పాదయాత్రగా వెళ్లి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒకచోట కూర్చుని కృష్ణభగవానుని స్మరించుకొని తమ తమ ఇళ్లలోకి వెళ్లి ఉపవాస దీక్షల్ని విరమిస్తారు.

సామూహిక వేడుకలు యాదవుల ప్రత్యేకం
కృష్ణుడు అనగానే యాదవులు గుర్తుకొస్తారు. ఆ కులస్థులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు.అర్ధరాత్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజున వూయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనులపండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపుఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. ఆదిలాబాద్‌ పట్టణంలో యాదవసంఘం ఆధ్వర్యంలో ఏటా కృష్ణాష్టమి రోజున ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆరోజున అంతా ఒకచోట చేరి కులదైవాన్ని కొలవడం… ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతోంది. గ్రామాల్లోనూ వూరేగింపులు చేసి ఆలయాల వద్ద కుల పెద్ద చేత ఉట్టికొట్టిండం, సామూహిక భోజనాఉ నిర్వహిస్తుంటారు. ఈవేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్థులు సైతం పాలుపంచుకోవడం పండగకు మరింత వన్నె తీసుకొస్తోంది

తిరుమలలో
తిరుమల ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి.
కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును ‘గోకులాష్టమీ ఆస్థానం’ అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా క్రీ.శ.1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అన్నమాచార్య కీర్తన
తాళ్ళపాక అన్నమాచార్యుడు ఉట్ల పండుగను ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు:
పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నే డిత డు
నడురేయి జనియించినా డు చూడ గదరే
అరుదై శ్రావణబహుళాష్టమి నా టి రాత్రి
తిరువవతారమందెను కృష్ణు డు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను

Send a Comment

Your email address will not be published.