జీతం కోసం పరభాష – జీవితం కోసం మాతృ భాష

జీతం కోసం పరభాష – జీవితం కోసం మాతృ భాష

మాతృ భాషను శ్లాఘిస్తూ ఎంతోమంది కవులు కావ్యాలు వ్రాసారు. ఎంతోమంది గాయకులు పాటలు పాడారు. ఎంతోమంది రచయితలు తమ రచనల ద్వారా భావోద్వేగాలను తెలియజేసారు. మరికొంతమంది జనపదాలతో జానపదాలల్లారు. అజంత భాషగా వెలుగొంది సంగీతానికి కూడా మెరుగులు దిద్దే భాష మనది. ఇతర భాషలు మాట్లాడేవారు కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహిస్తూ మన భాషలోని సంకీర్తనలు ఆలపిస్తున్నారు. ఇలా వ్రాసుకుంటూ పొతే మనభాషలోని పోకడలు, ప్రక్రియలు లెక్కలేనన్ని.

పర సంస్కృతితో సహజీవనం చేస్తూ ‘మన’ భాష అవసరమా? అన్న ప్రశ్న చాలా సాధారణమైనది. ఈ ప్రశ్న అవసరమే. ఎందుకంటే ఈ ప్రశ్నలోనే సమాధానముంది.

“మనం” అంటే ఒక భాష, ఒక బంధం, బాంధవ్యం, ఒక సంస్కృతీ, సాహిత్యం, వాజ్మయం, ఒక ఆలోచనా సరళి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, తరతరాల వారసత్వం, మాండలీకాలు, కళలు, కళా రూపాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రభంధాలు, ప్రవచనాలు, శతకాలు, గేయాలు, గీతాలు, జాతీయాలు, సామెతలు – ఇలా ఒక మహోన్నతమైన సంస్కృతికి వారసులం – ఒక చిన్న ప్రశ్నతో మన సంస్కృతిని కాలదనగలమా? ముమ్మాటికి కాదు.

గతవారం సిడ్నీ జనరంజని రేడియో వారు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు ప్రత్యేకించి తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలన్న అంశంపై ప్రముఖ సాహితీవేత్త శ్రీ వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా అధినేత శ్రీ చిట్టెన్ రాజు గారితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసారు. శ్రీ రాజు గారు పిల్లలడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతూ మాతృ భాష ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే వచ్చే లాభాల గురించి చక్కని ప్రసంగం చేసారు.
సందర్భానుసారంగా కొన్ని జాతీయాలు, సామెతలు మన భాషలోనే చెబితే అందంగా, అర్ధవంతంగా ఉంటాయి. భావం అనువదించవచ్చు గానీ అందులోనున్న భావ సారూప్యతను ప్రతిబింబించలేమని శ్రీ రాజు గారు చెప్పారు. తెలుగులో వ్రాసిన కథలు తెలుగులో చదివినంత ఆనందం అనువదించబడిన భాషల్లో రాదు. అందుకే “జీతం కోసం పరభాష – జీవితం కోసం మాతృ భాష” కావాలని చెప్పారు.

చాలామంది పిల్లలు మన భాషలోని మెలుకువులు ఎలా నేర్చుకోవాలన్న మంచి ప్రశ్నలు వేసి మన భాష ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్నట్లు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తే పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఆశావాదం కనపడింది.

Send a Comment

Your email address will not be published.