తల్లి ఒడి తొలి బడి

21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం….

Language day

తల్లి ఒడి తొలి బడి. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. జననీ జన్మభూమిస్య స్వర్గాదపీ గరీయసీ అన్నారంటే తల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని మనకు తేట తెల్లమవుతోంది. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చే భాష మాతృభాష.

శిశువు తొలిసారిగా తానొక భాషను నేర్చుకుంటున్నామనే జ్ఞానం కూడా లేనప్పుడు, తనలో ఉన్న అనుకరించడం అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి భాషని అనుకరిస్తూ, జీవితంలో తొలిసారిగా నేర్చుకునే భాష ..మాతృభాష.

ఫిబ్రవరి 21 ప్రాముఖ్యత
international language day1947లో…భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.

తల్లి నొడికంటే పరమామృతంబు కలదే”అని మహాకవి రాయప్రోలు వారన్నారు.
అలాగే మహాత్మా గాంధీజీ “మాతృ భాషా తృణీకారం అంటే మాతృదేవి తిరస్కారంతో సమానం”అని మహాత్మా గాంధీజీ అన్నారు.
దీన్నిబట్టి మాతృభాషకు ఉన్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది. మాతృమూర్తి పై ,మాతృభూమిపై , మనసున్న ప్రతి మనిషికీ అవ్యజమైన ప్రేమ,గౌరవం ఉంటుంది
అందుకే ” మాతృ దేవోభవః” అని జన్మనిచ్చిన తల్లికి మన తొలి వందనం సమర్పించుకుంటాం.

“శిశువు సౌందర్య దృష్టిని ,తన లోని భావాలను,తన ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష” అని గాంధీజీ అభిప్రాయ పడ్డారు.
“దేశ భాష లందు లెస్స తెలుగు భాష అని చక్రవర్తి, సాహితీ సార్వభౌములు శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో తన ఇష్ట దైవమైన శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువుతో ఎంతో అందంగా చెప్పించారు. ఏ భాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడుతాడో ,ఏ భాష ఇతర భాషల అభ్యసనంపై ప్రభావం చూపుతుందో ఆ భాషనే మాతృభాష
అంటారు. సాహిత్య వారసత్వ సంపదకు జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది. అటువంటి మాతృభాషను అపురూపంగా చూసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సామాన్య ప్రజలు కూడా మాతృభాష లోనే భావ వ్యక్తీకరణ ద్వారానే ఒకరికొకరు దగ్గరవుతారనేది సత్యం .
రవీంద్ర నాథ్ ఠాగోర్ ఏమంటారంటే…”మాతృభాష అనేది అమ్మ పాలంత మధురమైనది ,పవిత్రమైనది. కాబట్టి ప్రతీ మనిషి తన మాతృభాష ను నేర్చుకోవాలి”అంటారు.
మాతృభాష అంటే మనం అప్రయత్నంగా పెద్దల ద్వారా, మన చుట్టూ ఉండే సమాజం ద్వారా నేర్చుకొనేది. ప్రపంచంలో అనాదిగా ఇటువంటి భాషలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. అందులో కొన్నింటికి లిపి ఉంది. కొన్నింటికి లిపిలేదు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వలన ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందినది. అయితే ఈ ఇంగ్లీషు భాష నేర్వటం అన్నది అవసరమూ, విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కానీ మోజు కారాదు. ఈ మోజులో పడి మాతృభాష నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు.

మాతృ భాష ఎందుకు?
desa bhaashalandu telugu lessa‘ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో స్కూల్లో తోటి విద్యార్థులతో మాట్లాడతామో, ఆ భాష మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. మాతృభాషా దినోత్సవ ప్రకటన సదర్భంగా ప్రపంచంలోని అన్ని భాషలు సమానంగా గుర్తించబడ్డాయి. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి’. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏమిటంటే – మాతృభాషలోనే భావోద్వేగాల అభివ్యక్తిని, జ్ఞానాభివృద్ధిని సమున్నతంగా సాధించగలమని. అదే సమయంలో తన వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భాషీయుడి హక్కు అని, తన భాషను కాపాడుకోవడం ద్వారానే ఇది సాధ్యమని.

భాషను బట్టే జాతి గుర్తించబడుతుంది. కాలగమనంలో రాజ్యాల సరిహద్దులు, పాలకులు మారినా ఆయా జాతుల మాతృభాషలు మారవు. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోనే మన తెలుగు జాతిలోనే రాష్ట్ర విభజన ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర-తెలంగాణలు మరొక ఉదాహరణ. ప్రాంతాలను బట్టి, ప్రాకృతికతను బట్టి ఒకే భాషాజాతిలో నెలకొనే సాంస్కృతిక వైవిధ్యాలను, వారి వారసత్వాలను కూడా కాపాడుకోవాలని యునెస్కో సందేశం విశదపరుస్తోంది. ప్రపంచంలోని మౌలిక, వైరూప్య వారసత్వాన్ని రక్షించాలనే ప్రయత్నంలో భాగంగానే భాష విషయంలో యునెస్కో కృషి చేస్తోంది. సంప్రదాయ ప్రజా సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం – వీటిని రక్షించుకోవడం మాతృభాషల రక్షణతోనే వీలవుతుంది. మాతృభాషను కోల్పోతే వారసత్వంగా సాధించుకున్నదంతా కోల్పోయి, ఆ జాతి పూర్తిగా పరాయీకరణ పొంది గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా పెద్ద భాషలతోపాటు చిన్న, అతి చిన్న భాషలను కూడా కాపాడవలసి ఉంది. మన రాషా్ట్రల్లోనే ఉన్న గిరిజన భాషలను కూడా రక్షించవలసిన అవసరాన్ని మన దేశంలోని పెద్ద భాషల రాషా్ట్రలు, ప్రభుత్వాలు గుర్తించవలసి ఉంది.

పిడివాదం
చిన్న భాషలు ఎదిగినందువలన పెద్ద భాషలకు ప్రమాదం ముంచుకొస్తుందన్న వాదం తప్పు. అది ఎదగడం వల్ల ఆ భాషీయులు మాత్రమే కాక దాని చుట్టూతా ఉన్న పెద్ద భాషా జాతి కూడా ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఆ రెండు భాషల మధ్య పరస్పరం భాషపరంగా, సంస్కృతిపరంగా ఇచ్చిపుచ్చుకోవడం సహజంగా జరిగిపోతుంది. ఇందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నిరంగాల్లో సమాన అవకాశాలు తప్పనిసరి. ఈ క్రమ ంలో తమను తాము అభివృద్ధి చేసుకున్న జాతులు ముందడుగు వేస్తాయి. మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న గోండుల కంటే పొరుగురాషా్ట్రల్లో ఉన్న గోండుల సంఖ్య, ప్రదే శం ఎంతో ఎక్కువగా ఉంది. తమ భాషకు లిపి ఉందని ఇంతకాలం తెలియనిస్థితిలో ఉన్న గోండులు తమ పూర్వులు వాడిన లిపిని కనుగొని ఇటీవల తమ భాషాభివృద్ధికి కృషి చేయడం మన రాష్ట్రంలో ప్రారంభమయింది. అయితే పొరుగు రాషా్ట్రల్లో పెద్దసంఖ్యలో ఉన్న గోండులు అక్కడి అధిక సంఖ్యాక భాషల లిపిగానే వాడుకుంటున్నారు. అక్కడ కూడా గోండీ లిపి విస్తరిస్తే క్రమంగా ఈ రెండు మూడు రాషా్ట్రల్లోని గోండులు తాము ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో ప్రత్యేక రాషా్ట్రన్ని కోరతారని కొందరు ఊహిస్తున్నారు. ఇదే నిజంగా జరిగితే అందుకు గోండి జాతి ప్రజలను అభినందించాల్సి ఉంటుంది. మాతృభాషా సిద్ధాంత విజయంగా దానిని భావించవలసి ఉంటుంది.

గిడుగు పట్టిన గొడుగు
తెలుగు భాషోద్ధారకుడు గిడుగు రామమూర్తి సవరలకు వారి మాతృభాషలోనే పాఠాలు చెప్పడం, చైతన్యపరచడం వందేళ్ళ క్రితమే ఆయన శాస్త్రీయ దృక్పథాన్ని సూచిస్తుంది. అదే దృక్పథంతోనే ఆయన తెలుగు భాషను ప్రజాస్వామ్యీకరించాల్సిన అగత్యాన్ని, అందుకు మార్గాన్ని కనిపెట్టగలిగారు. పండితుల పిడి కౌగిలిలో బిగుసుకుపోయి, కఠినమైన సమాసాల కోరలలో నలిగిపోతున్న తెలుగు సంకెళ్ళను తెంచి, ప్రజల భాషకు పట్టం గట్టేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసింది అందుకే. మాతృభాష పరిరక్షణ అంటే అన్ని అవసరాలను దాని ద్వారా తీర్చుకోవడమే. అంటే నేటి ప్రజాస్వామ్య యుగంలో అన్ని రంగాల్లో పరిపాలన, విద్యాబోధన, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అన్నిటా ప్రజల భాషకు పట్టంగట్టేందుకు కావలసిన పునాదులను గిడుగు, ఆయనతో పాటుగా గురజాడ, తాపీ ధర్మారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి అనేక మంది మహనీయులు కృషి చేశారు.

భాష ప్రాతిపదికన రాష్ట్ర విభజన
సంయుక్త మద్రాసు రాష్ట్రంలో రాజకీయంగా ఎదగలేకపోయిన కొన్ని వర్గాలు ఉద్యమించడంతో ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమం జరిగింది. నిజానికి అది భాషను ఆధారంగా చేసుకుని జరిగిన ఒక ప్రాంతీయ ఉద్యమం మాత్రమే గాని, మొత్తం తెలుగు భాషా సమాజానికి సంబంధించిన ఉద్యమం కాదు. ఆంధ్ర రాష్ట్రంగా వేరుపడిన ప్రాంతం కాక తక్కిన ప్రాంతాల్లో 40 శాతం పైగా ఉన్న తెలుగువారిని వదులుకుని రావడానికి కారణాన్ని నాటికి, నేటికి సమైక్యవాద నాయకులు ఎవ్వరూ ప్రస్తావించరు. ఈ అంశంపై ఎవరూ వారిని ప్రశ్నించరు. ఫలితంగా గడచిన అరవైయేళ్ళలో తమిళనాడు అంతటా తెలుగు ప్రజలు తమ ప్రాథమిక హక్కు అయిన భాషా సాంస్కృతిక అణచివేతకు గురైనారు. పరాయీకరణ చెందారు. ఇక్కడే తెలంగాణ ఉద్యమంలో భాషా సాంస్కృతిక అంశాలను గమనించాలి. దక్షిణ భారతమంతటా విస్తరించి ఉన్న తెలుగు ప్రజల భాషలోను, సాంస్కృతికతలోను కొన్ని వైవిధ్యాలున్నాయి. వీటికి ప్రాకృతిక కారణాలతో పాటు వేర్వేరు రాజ్యాలలో పరాయి పాలనలో శతాబ్దాలుగా వుండడం కూడా కారణం. భాషా సాంస్కృతికతలకు అతీతంగా రాజకీయ అవసరాలు బలంగా ఉన్నప్పుడు పాలనాపరంగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాల్ని సానుభూతితో పరిశీలించాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. నాటి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఉద్యమాన్ని కాని, నేటి తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని కానీ ఈ కోణం నుంచే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అధిక సంఖ్యాకులైన తెలుగు వారి భాషాభివృద్ధికి పాలకులు ఎటువంటి చర్యలు చేపట్టనున్నారనేది ముఖ్యం. గడచిన 60 యేండ్లుగా సంయుక్త రాష్ట్రంలో ఏ భాష ప్రాతిపదికగా ఆ రాష్ట్రం ఏర్పడిందో, ఆ ప్రాతిపదికనే పాలకులు అన్ని విధాలా ధ్వంసం చేసింనందువల్ల ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోను మాతృభాష పరిస్థితి శోచనీయంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో తెగులు
ప్రపంచంలోని పెద్ద భాషల్లో ఒకటైన తెలుగుకు అన్ని శాస్త్ర, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఎదగగల సమర్ధత ఉంది. ఎంతో సాహిత్య చరిత్ర ఉంది. అటువంటి దాన్ని ఎదుగూ బొదుగూ లేకుండా పాలకులు చేశారు. ఇప్పుడైనా రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమ భాషా విధానాన్ని ప్రకటించి, ప్రజల భాషలో పరిపాలనను, విద్యను, శాస్త్ర సాంకేతిక జ్ఞానాభివృద్ధిని, సమాచార సాధనాలను శక్తివంతం చేసేందుకు పూనుకోవాలి. అప్పుడే ఇవి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినందుకు ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఇంకా పాత ధోరణిలోనే ఉభయులూ పరిపాలన కొనసాగిస్తే అది వారి ప్రజా వ్యతిరేకతను సూచిస్తుంది. పరిణామాలు భయంకరంగా ఉంటాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు తమ భాషా విధానాలను స్పష్టంగా, వివరంగా ప్రకటించాల్సి ఉంది. ‘ఒక పటిష్టమైన భాషా విధానం ఉంటే, ఏ భాషనైనా మనం కాపాడుకోవచ్చునని, అభివృద్ధి చేసుకోవచ్చునని యునెస్కో ప్రకటనల్లో కూడా ఉంది. ఇంగ్లీషును నేర్చుకోవటం అంటే తెలుగును పట్టించుకోకపోవటం, తొక్కి వేయటం కాదు. ఇతర భాషలు నేర్చుకోవటం అనే అవసరాన్ని తీర్చుకోవాలన్నా అది మాతృభాష ద్వారా తీర్చుకోవటమే సరైన, శాస్త్రీయమైన విధానం.

మన భాష మన గర్వం
మొత్తం మీద మాతృభాషను పరిరక్షించుకోవటం అంటే కోల్పోతున్న మాతృభాషలను తిరిగి ఉద్ధరించుకోవటమంటే ప్రజల ఆత్మగౌరవ భావనను అభివృద్ధికోరికను సూచిస్తుంది. అన్ని భాషాజాతులకు సమాన అభివృద్ధి అవకాశాలను సమకూర్చినప్పుడే ప్రజాస్వామికంగా అంతర్జాతీయ అవగాహనకు, పరస్పర అభిమానాన్ని పెంపొందించుకోడానికి దారులు ఏర్పడుతాయి. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం,మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీనిని అందించడం ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం అందరి కర్తవ్యం

Send a Comment

Your email address will not be published.