తాయి నూతన కార్యవర్గము

TAAI-2019

2019-20 సంవత్సరానికి గాను శ్రీ రాజా రమేష్ రెడ్డి అధ్యక్షులుగా ఆస్ట్రేలియా తెలుగు సంఘం క్రొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్వైజరీ బోర్డు సభ్యులుగా గత సంవత్సరం అధ్యక్షులు శ్రీ శ్రీని కట్ట మరియు శ్రీ రాజేశ్వర్ సుసర్ల (ఇంతకు ముందు తాయి కోశాధికారిగా పని చేసారు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

TAAI Executive comittee 19-20శ్రీ శ్రీని కట్ట అధ్యక్షులుగా గత రెండు సంవత్సరాలుగా (ఒకళ్ళిద్దరు మినహాయించి) ఒకే బృందం కష్టపడి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 2018 నవంబరులో వంగూరి ఫౌండేషన్ (అమెరికా) మరియు లోక్ నాయక్ ఫౌండేషన్ (భారతదేశం) వారితో కలిసి సంయుక్తంగా ప్రపంచ సాహితీ సమావేశం నిర్వహించడం ఎంతో శ్లాఘనీయం. సుమారు 70 మంది అంతర్జాతీయ అతిథులు విచ్చేసిన ఈ సాహితీ సదస్సు తాయి మరియు ఆస్ట్రేలియా తెలుగువారి చరిత్రలో ఒక మైలు రాయి అని చెప్పాలి. ప్రపంచ సాహితీ చరిత్రలో మెల్బోర్న్ నగరం ఒక అగ్ర తారగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

@TCCC (Australia Telugu Community and Cultural Centre)
మరో ముఖ్యాంశం ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది.
మనదని చెప్పుకోవడానికి ఒక స్థిరాస్తి ఉండాలన్న తలంపు ప్రతీ తాయి సభ్యుని ఆలోచనలో మెదులుతూ ఉంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చాలన్న ప్రయత్నం గత 15 ఏళ్లలో రెండు మూడు సార్లు దృడంగా జరిగింది. కాలం కలిసిరాక మరికొన్ని ఇతర కారణాల వలన ఈ ఆలోచన ఒక రూపు దిద్దుకోలేదు.

అయితే గత రెండేళ్లుగా తాయి కార్యవర్గం ఈ విషయమై ఏకాగ్రతతో పనిచేసి సంఘ సభ్యులతో పలుమార్లు సంప్రదించి ఎన్నో వడుదుడుకులను ఎదుర్కొని చివరికి తాయి అనుబంధ సంస్థ @TCCC ని స్థాపించడం జరిగింది. దీనికి సంబందించి తాయి రాజ్యాంగంలో (Constitution) తగు మార్పులు చేసారు. క్రొత్తగా Donor సభ్యులనే ఒక వర్గాన్ని కల్పించారు. మరిన్ని వివరాలకు తాయి కార్యవర్గ సభ్యులను సంప్రదించవచ్చు.

సుమారు 12 మంది సభ్యులు ఇప్పటికే $5,000 చొప్పున విరాళంగా ఇచ్చారు. తాయి కార్యవర్గం ప్రతీ సభ్యుడు/సభ్యురాలు వారి తాహతుకు సరిపడే విరాళం ఇచ్చినట్లయితే అందరి కల త్వరలోనే సాకారం కాగలదని అభ్యర్దిస్తున్నారు.

క్రొత్త కార్యవర్గంలో ఇంచుమించు అందరూ యుక్తవయసు వారే కావడం విశేషం. అందునా ఈ కార్యవర్గంలో ముగ్గురు మహిళలు ఉండడం ఎంతో ముదావహం. వీరందరూ తెలుగు సంఘానికి క్రొత్త తరహాలో అందుబాటులోనున్న సాంకేతికను ఉపయోగించి తమ సేవలందించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

క్రొత్తగా వచ్చిన తెలుగువారిని సభ్యులుగా చేర్పించి తెలుగు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్నారు. @TCCCని సభ్యులందరి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని తహతహలాడుతున్నారు. క్రొత్త కార్యవర్గం ఇప్పటికే జనరంజని కార్యక్రమం నూతనోత్తేజంతో అక్టోబరు 19న జరపాలని నిర్ణయించింది.

Send a Comment

Your email address will not be published.