తెలుగువారి వెలుగుదారి గిడుగు

Gidugu Ramamurthy

తెలుగుభాషకు, తెలుగు జాతికి వెలుగుదీపికలై ప్రకాశించిన అతి కొద్దిమందిలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని తపిస్తూ తన జీవిత పర్యంతమూ పోరాడిన ధీశాలి. సామాన్య ప్రజలభాషకే ప్రభుత్వాలు పట్టం కట్టేలా వ్యవహారిక భాషోద్యమాన్ని మహౌన్నతంగా నడిపిన భాషావేత్త ఆయన. పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటీష్‌ పాలన దేశమంతటా బలంగా స్థిరపడుతున్న రోజుల్లో సమాజ సంస్కరణే లక్ష్యంగా ఉద్యమాలు నడిపిన ముగ్గురు తెలుగు ప్రముఖులు జాతి కీర్తికేతనాలుగా నిలిచారు. ఆ ముగ్గురు మహనీయులూ కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలను ప్రోత్సహించడం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడడం, స్త్రీ విద్యకు పునాదులు వేయడం, తన రచనలు, పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం వంటి మహత్తర కార్యాలెన్నింటినో సాధించారు. గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం చూపిన అభ్యుదయ మార్గాన్ని మరింత విస్తరింపజేశారు. సాహితీరంగంలో విశిష్ట ప్రక్రియలకు రూపకల్పన చేశారు. ‘ముత్యాలసరాలు’, ‘పూర్ణమ్మ’, ‘దేశభక్తి’ తదితర గీతాల్లోనూ; ‘కన్యాశుల్కం’ నాటకం, కథానికల ద్వారా అభ్యుదయాంశను తెలుగుజాతికి అందించారు. వీరిద్దరి కన్నా మరో అడుగు ముందుకేసిన గిడుగు సాహిత్యం, విజ్ఞానం ప్రజలకు చేరువ కావాలంటే కావ్యభాష ఎంతమాత్రమూ పనికిరాదని, వ్యవహారిక భాషలోనే రచనలు, బోధన సాగాలని ఉద్యమాన్ని నడిపాడు. ఆనాటి సాంప్రదాయ పండితులతో హౌరాహౌరీగా పోరాడి ఆధునిక ప్రమాణభాషను ప్రతిష్టింపజేసి అందరికీ మార్గదర్శకుడయ్యారు.

శ్రీకాకుళం పట్టణానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పర్వతాల పేట అగ్రహారంలో గిడుగు రామ్మూర్తి 1863 ఆగస్టు 29న జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ ఆ గ్రామంలోనే గిడుగు రామ్మూర్తి ప్రాధమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తరువాత విజయనగరంలోని మహారాజా ఇంగ్లీష్‌ పాఠశాలలో 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసయ్యారు. అదే ఏడాది ఆయనకు వివాహం జరిగింది. అనంతరం 1880లో పర్లాకిమిడి రాజా వారి పాఠశాలలో చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. 1886లో ఎఫ్‌ఎ, 1896లో బిఎ డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే కుశాగ్రబుద్ధిగా ఉన్న గిడుగు రామ్మూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలిగా సాహిత్య, భాషా రంగాల్లో కృషిచేశారు. పర్లాకిమిడిలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్న గిడుగు రామ్మూర్తి తన పరిసర ప్రాంతాల్లోని సవరుల జీవన శైలి పట్ల ఆసక్తి చూపించారు. లిపిలేని వారి భాషకు లిపిని, భాష వ్యాకరణాన్ని, ఇంగ్లీష్‌ నిఘంటువును రూపొందించారు. శ్రీముఖలింగం ఆలయంలోని శాసనాలను అధ్యయనం చేసి కళింగదేశ చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. కళింగ రాజ్యానికి ఎనిమిదో శతాబ్దం నుంచి 12 శతాబ్దం వరకూ శ్రీముఖలింగం రాజధాని అని, దానిపక్కనే ఉన్న నగరి కటకం సైనిక స్థావరమని నిరూపించారు. కళింగపట్టణం కళింగరాజ్యానికి ప్రముఖ ఓడరేవు పట్టణం అని నిర్ధారించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాటికి కావ్యాలు, పుస్తకాలు, బోధనలలో వాడుకలో ఉన్న గ్రాంథికభాష స్ధానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టడానికి పెద్ద ఉద్యమమే నడిపారు.

గిడుగు నడిపిన వ్యవహారిక భాషోద్యమంవల్ల గ్రాంథికభాషకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని గ్రాంధికవాదులు ఆందోళనపడి కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపించారు. దీని పేరుతో ఒక మాసపత్రికను కూడా నడిపారు. అక్కడతో ఆగకుండా ఆరు సంపుటాలతో సూర్యరాయాంధ్ర నిఘంటువును ప్రచురించారు. గ్రాంధిక భాషావాదులకు పోటీగా వ్యవహారిక భాషావాదులు కూడా ఒక పత్రిక అవసరమని గిడుగు భావించారు. అయితే గ్రాంధిక భాషావాదులకు ఉన్న అంగబలం, అర్ధబలం తమకు లేకపోయింది. అయినప్పటికీ 1919లో తెలుగు అనే మాసపత్రికను పర్లాకిమిడి నుంచే ప్రారంభించారు. అది ఏడాది పాటే కొనసాగినప్పటికీ వ్యవహరిక భాషాద్యోమానికి ఒక ఊతకర్రలా నిలిచింది.

వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరణ ఇచ్చినది 1907లో వై.ఎ. ఏట్స్‌ అనే ఆంగ్లేయుడు. ఈయన ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చాడు. Giduguచిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆయనకు ఏమాత్రం అర్థం కాలేదు. ప్రజలు వాడుకలో వ్యవహరిస్తున్న భాష ఒకలా, పుస్తకాల్లో ఉన్న భాష మరొకలా ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని ఆయన విశాఖపట్నంలోని ఎవిఎన్‌ కాలేజ్‌ ప్రిన్పిపాల్‌గా ఉన్న పి.టి.శ్రీనివాస అయ్యంగార్‌ని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ తన కన్నా ఈ సమస్యపై గిడుగు, గురజాడ సరైన పరిష్కారం చూపగలరని చెప్పారు. ఇలా వ్యవహరిక భాషోద్యమానికి ఒక అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందే 1897లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకానికి ముందుమాట రాస్తూ- వ్యవహార భాషలో సృజనాత్మకత రచనలు రావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే గురజాడకు సన్నిహిత మిత్రుడైన గిడుగు వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంబించడంతో గురజాడ ఆకాంక్షలు కొంతవరకు నెరవేరాయి. ఈ నేపధ్యంలో విజయనగరంలో ఆంధ్ర సాహిత్య సంఘం ఏర్పడింది. ఉత్తర కోస్తా జిల్లాల స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌ జె.ఎ.ఏట్స్‌ ప్రతి ఏటా ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి బోధనా పద్ధతుల గురించి పెద్దలతో ఉపన్యాసాలు ఇప్పించేవారు. అలా జరిగిన వార్షిక సమావేశాల్లో 1907 నుంచి 1910 వరకు గిడుగు రామ్మూర్తి పాల్గొని వాడుకభాష గొప్పతనాన్ని వివరిస్తూ, పాఠశాలల్లో విద్యార్థులకు బోధనాభాషగా శిష్ట వ్యవహారికమే ఎందుకుండాలో ఉదాహరణలతో సహా వివరించారు. 1913లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్‌ సమావేశంలో గురజాడ అప్పారావు వాడుక భాషలోనే రచనలు చేసి తన ‘ముత్యాలసరాలు’ వినిపించారు. అంతకుముందు 1911 సెప్టెంబర్‌ 8వ తేదిన బ్రిటీష్‌ ప్రభుత్వం విద్యార్థులకు ఏ భాషాశైలి ఉపయోగమో నిర్ణయించడానికి పండితులతో ఒక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో గ్రాంధికభాషావాదులైన జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రిలతో పాటు వ్యవహారిక భాషోద్యమకర్త అయిన గిడుగు రామ్మూర్తి కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం అనేక సమావేశాలు జరిపి వాడుకలో ఉన్న పదాలను, క్రియారూపాలను, సమాసాలను, విభక్తి రూపాలను విద్యార్ధులు వ్యాసరచనలో ఉపయోగించవచ్చని తన నివేదికలో పేర్కొంది. దీంతో వ్యవహారిక భాషావాదులు కొంతవరకు విజయం సాధించారు. అయితే గ్రాంధిక భాషావాదులు తమ మొండిపట్టు వీడలేదు. దేశంలోని ధనికులు, రాజకీయ పలుకుబడి కలిగినవారు గ్రాంధికభాషవైపే మొగ్గు చూపడంవల్ల గతంలో వ్యవహారిక భాష వాడటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇచ్చిన జివోను 1914లో ఉపసంహరించుకుంది. విద్యాశాఖ మరో జీవోను గ్రాంధిక భాషావాదులకు అనుకూలంగా జారీ చేసింది. అయినప్పటికీ తన పోరాటంలో గిడుగురామ్మూర్తి వెనకంజ వేయలేదు.

గ్రాంధిక భాషావాదులచేత వచన రచనకు వ్యవహారిక భాష వాడడం సముచితమని ఒప్పించడానికి గిడుగు రామ్మూర్తి రెండు విధాలైన ఉపపత్తులను సేకరించారు. అందులో ఒకటి పూర్వకాలాల్లోని కావ్యాలలో తప్ప ఆనాటి కవులు, పండితులు శాసనాలు, టీకాలు వ్యాఖ్యానాలు వంటి వాటిలో వ్యవహారిక భాషనే వాడారని నిరూపించారు. దీనికోసం ఆయన ఎన్నెన్నో తాళపత్ర గ్రంధాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు. వాటినే బాలకవి శరణ్యం, గద్యచింతామణి వంటి గ్రంథాల్లో ప్రచురించారు. రెండవది పరవస్తు చిన్నయసూరి వ్యాకరణానికి అనుగుణంగా రచనలు చేస్తున్నామని చెప్పుకొనే పండితులు ఎన్నెన్ని విరుద్ధమైన ప్రయోగాలు చేస్తున్నది గిడుగు రామ్మూర్తి ఎత్తి చూపించారు. ఆనాటి పండితులు, కవుల రచనల్లోని వ్యాకరణదోషాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా తాను సేకరించిన సాక్ష్యాధారాలను తనవెంట తీసుకొని ఆంధ్రరాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలు సందర్శించి, విద్యాలయాల్లో పండితులను కలుసుకుని వారితో వ్యవహారిక భాష ఆవశ్యకతపై సభలూ సమావేశాలు నిర్వహించేవారు. వీటి వివరాలన్ని తాను నడిపిన తెలుగు పత్రికలో ప్రచురించేవారు.

ఆ క్రమంలోనే గిడుగు రామ్మూర్తికి కందుకూరి వీరేశలింగం పంతులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1919 ఫిబ్రవరి 28వ తేదిన రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షునిగాను, గిడుగు రామ్మూర్తి, జయంతి గంగన్నలు కార్యదర్శులుగాను ‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం’ ఏర్పడింది. కందుకూరి ప్రభావంతో వితంతు వివాహాలను కూడా జరిపించి సంఘసంస్కరణోద్యమానికి తన వంతు కృషి జరిపారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఒక ‘నవ్యాంధ్ర వ్యాకరణం’, ‘నవ్యాంధ్ర నిఘంటువు’ రాయడానికి అవసరమైన సమాచారమంతా సేకరించి పెట్టుకున్నప్పటికీ నిరంతరం వాదోపవాదాలతో కాలం గడపడం వల్ల గిడుగు రామ్మూర్తి ఆ మహాకార్యాలు నిర్వర్తించడానికి వీలు కుదరలేదు. కందుకూరి వీరేశలింగం ‘నవ్యాంధ్ర వ్యాకరణం’ పేరుతో ఒక విపులమైన వ్యాకరణం రాయడానికి పూనుకోగా గిడుగు రామ్మూర్తి తాను సేకరించిన సమాచారాన్నంతటిని ఆయనకు ఇచ్చారు. అయితే ఇది జరిగిన కొద్దిరోజులకే వీరేశలింగం మృతి చెందడంతో ఆ వ్యాకరణం వెలుగు చూడలేదు. వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు రామ్మూర్తికి పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, చళ్లపిళ్ల వెంకటశాస్త్రి, తాపీ ధర్మారావు, పురిపండా అప్పలస్వామి తదితరులంతా చేదోడువాదుడుగా నిలిచారు. 1933లో గిడుగు రామ్మూర్తి సప్తతి మహౌత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేందవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో ‘వ్యాస సంగ్రహం’ అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. 1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్తు అధికారికంగా వ్యవహారికభాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే ప్రతిభ అనే సాహిత్య పత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా ‘జనవాణి’ అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర – ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవర భాషాకృషికి మెచ్చి కైజిర్‌ -ఇ-హింద్‌ పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు. గిడుగు రామ్మూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామత కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుది విన్నపంలో వ్యవహారిక భాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కానీ, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరి మాటలు- ‘దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజన వ్యవహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంధికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదువవద్దనీ, విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కానీ ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను.’ అని అన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటులో తాను అభిమానించిన పర్లాకిమిడి జమిందారు, బ్రిటీష్‌ ప్రభుత్వం తెలుగు వారికి అన్యాయం చేయడంతో ఆయన నిర్వేదంతో పర్లాకిమిడిని విడిచిపెట్టి వచ్చేశారు. తెలుగు భాషకు వ్యవహారిక జిలుగులద్దిన మానవతామూర్తి గిడుగు వెంకట రామమూర్తి 1940 జనవరి 22వ తేదీన కాలధర్మం చెందారు.

వ్యవహారిక భాషను ప్రతిష్టించడంలో విశ్వవిద్యాయాలు, ప్రభుత్వం వెనకంజ వేసినప్పటికీ పత్రికలు మాత్రం గిడుగు రామ్మూర్తి వాదానికి ఎంతో బలాన్ని చేకూర్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1969లో తెలుగు అకాడమీని స్ధాపించింది. 1969లో పిహెచ్‌డి విద్యార్థులు తమ పరిశోధనా వ్యాసాలను వ్యవహారికంలో రాయడానికి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుమతించింది. 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా వ్యవహారిక భాషనే ఆమోదించింది. 1911లో గిడుగు రామ్మూర్తి ప్రారంభించిన వ్యవహారిక భాషోద్యమం 1973 నాటికి విజయవంతమైంది.

(ఈనెల 29 గిడుగు వెంకట రామమూర్తి 155వ జయంతి)

Send a Comment

Your email address will not be published.