‘తెలుగు’ కమ్యూనిటీ భాషే లక్ష్యం

Ammamma2018వ సంవత్సరం ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ లో నివసిస్తున్న తెలుగువారికి ఒక భాషా స్పూర్తినిచ్చింది. ఏడాది పొడుగునా సాహితీ పరంగా ఎదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. తెలుగుబడులు ప్రతీ ప్రధాన నగరంలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి ఇక్కడి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇతోధికంగా ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర విక్టోరియన్ స్కూల్ అఫ్ లాంగ్వేజ్ వారు తెలుగు భాష స్థానికులకు కూడా అందుబాటులో ఉండడానికి వీలుగా అనుమతినిచ్చి తెలుగు భాషనూ బోధనా భాషగా విక్టిరియా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. సిడ్నీలో శ్రీ మల్లిక్ రాచకొండ గారి అధ్వర్యంలో ఇప్పుడు ఏకంగా 5 బడులు నిర్వహిస్తున్నారు. అలాగే బ్రిస్బేన్, అడిలైడ్, కాన్బెరా, మెల్బోర్న్, పెర్త్ మరియు ఆక్లాండ్ నగరాల్లో లెక్కలు చూసుకుంటీ సుమారు 400 మందికి పైగా పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. మన జనాభాతో పోలిస్తే గత పదేళ్ళలో ఇంతమంది పిల్లలు తెలుగు బడులకు వెళ్లి తెలుగు నేర్చుకోవడం మునుపెన్నడూ లేదు.

2016 జనాభా లెక్కలు ప్రకారం తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011 లో సుమారు 7,400 మంది ఉన్న తెలుగు మాట్లాడే వారి సంఖ్య 34,435 మందికి పెరిగింది. ఇంచుమించుగా ఐదింతలు పెరిగిందనే చెప్పాలి. అనధికారికంగా ఈ సంఖ్య 70-80 వేల మధ్య ఉంటుందని అంచనా. సంఖ్యా పరంగా ఉన్న పెరుగుదలను చూసి SBS రేడియో వారు తెలుగు భాషా కార్యక్రమాలను ప్రవేశ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సదవకాశాన్ని సద్వినియం చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA – Federation of Telugu Associations in Australia) 2014 లో తెలుగు కమ్యూనిటీ భాషగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పత్రాన్ని సమర్పించడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వ గణాంకాల లెక్కల ప్రకారం తగినంత జనాభా లేకపోవడం వలన ఆ విజ్ఞాపనను తిరస్కరించడం జరిగింది. 2016 నుండి 2018 వరకూ భాషా పరంగా జరిగిన కార్యక్రమాలు – ప్రపంచ సాహితీ సదస్సు, రంగస్థల నాటకాలు, తెలుగు బడులు (ఇప్పుడు 10కి పైగా) నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, అవధానాలు, బతుకమ్మ మరియు బోనాలు పండుగలు – వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకొని తెలుగువారందరూ ఏకత్రాటిపై నిలబడి భాషోద్యమంలో భాగంగా క్రొత్త సంవత్సర తీర్మానంగా దృఢనిశ్చయంతో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో “తెలుగు” భాషను కమ్యూనిటీ భాషగా గుర్తించడానికి కృషి చేయాలనీ తెలుగుమల్లి అకాంక్షిస్తోంది.

Send a Comment

Your email address will not be published.