దివికేగిన భువనవిజయ కృష్ణుడు


ఇచ్చినంతా ఇచ్చాడు, ఇంతకన్నా ఇవ్వలేననుకున్నాడు
ఇంకేమీ మిగల్లేదనుకున్నాడు. వచ్చిన పని ముగించాడు
అందరూ తనవారనుకున్నాడు, తనలోనే అందరినీ చూసుకున్నాడు
అవతారం చాలించాడు.  కాదు, కాదు చాల్లే అనుకున్నాడు

కుటుంబంలో ఒక కొడుకైనా, అన్నైనా, తమ్ముడైనా, మనవడైనా, భర్తైనా, తండ్రైనా – ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల సమర్ధుడు.  ప్రతీ పాత్రనూ చిరునవ్వుతో పోషించిన ప్రతిభావంతుడు.  వయసులో చిన్నవాడైనా తెలుగు వారికి పెద్ద దిక్కుగా నిలిచిన ప్రజ్ఞావంతుడు.

ఎంత చెప్పినా తక్కువే.  ఏం వ్రాసినా మక్కువే.

వంశీ ‘కృష్ణ’ బుడిగె.  మెల్బోర్న్ నగరంలో ఈ పేరు వినని వారుండరు.  చిన్నవారైతే అన్నగా, పెద్దవారైతే తమ్ముడుగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రూపంలో తన ప్రేమను పంచిపెట్టాడు.  అందరి మన్నలనూ చూరగొన్నాడు.

66881557_595541597519204_20083400220082176_nపేరుకు తగ్గట్టుగా భువన విజయం వారు మొదటిసారిగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన శ్రీకృష్ణ రాయబారము (https://www.youtube.com/watch?v=MBy7GAVLufI&t=18s) రంగస్థల నాటకములో ముఖ్య పాత్రధారి శ్రీకృష్ణుడుగా నటించి ఆ పాత్రలో జీవించాడు.  ఆ పాత్రకే జీవం పోసాడు. ఇక్కడి తెలుగువారి మనసుల్లో శ్రీకృష్ణుడుగా శాశ్వతంగా నిలిచిపోయాడు.

తండ్రి శ్రీ మురళీ బుడిగె గారితో పాటు  విక్టోరియా ప్రభుత్వం నుండి సామాజిక సేవా పురస్కారాన్ని అందుకున్నాడు.

వంశీ గత ఆదివారం సాయంత్రం తన భౌతిక దేహాన్ని విడిచి దేవునిలో ఐక్యం అయ్యాడు అని వ్రాయడానికి ఘంటం కదలడం లేదు.  మాట రావడం లేదు.  చాలా మంది ఫోన్ చేసి మీ నోటితో ‘ఇది నిజం కాదు’ అని చెప్పమని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారంటే వారి గుండెల్లో ఎటువంటి ముద్ర వేసాడో మనం ఊహించవచ్చు.

తండ్రికి తగ్గ తనయుడుగా నిస్వార్ధంగా సామాజిక సేవకు అంకితమై ఒక ప్రామాణికంగా నిలిచాడు.  మనసా, వాచా, కర్మణా – త్రికరణ శుద్ధిగా మానవ మాతృనికి అతీతంగా ప్రవర్తనా నియమాలను పాటించి ఒక కొలమానంగా నిలిచాడు.

వంశీ ఆత్మకు శాంతి కలగాలని ఈ అవాంచనీయ సంఘటను ఎదుర్కొనే శక్తిని వారి కుటుంబానికి కృష్ణ పరమాత్ముడు ఇవ్వాలని కోరుకుంటూ తెలుగుమల్లి మరియు భువన విజయం తరఫున నివాళులర్పిస్తున్నాము.

Send a Comment

Your email address will not be published.