నవలాలోకంలో నక్షత్రం

YSulochanarani novels

నవలాలోకంలో నక్షత్రం యద్ధనపూడి సులోచనారాణీ
——————————————————–
తెలుగు నవలాలోకంలో ఒక నక్షత్రం యద్దనపూడి సులోచనారాణి. అమె రాసిన నవల చదవని తెలుగువారు గానీ, ఆమె నవల ఆధారంగా తీసిన సినిమాను, కనీసం టెలీ సీరియల్ ఒక ఎపిసోడ్ ని గానీ చూడని తెలుగువారు అరుదనే చెప్పాలి. అటువంటి   ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి(79) కాలిఫోర్నియా:  గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా సులోచనారాణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుమార్తె శైలజ తెలిపారు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు ఎవ్వరూ సాటిరారని సులోచనారాణి నిరూపించుకున్నారు. ఆమె రాసిన పలు కథలు సినిమాలుగా కూడా తీశారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మువ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు.

యద్దనపూడి సులోచనారాణి తాను పరిశీలించిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకుని తొలుత రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా మారుతున్న ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి వారి ఊహల్లో నుంచి వచ్చేట్టుగా పాత్రలను సృష్టించుకుని వాటిని సజీవ పాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. ఆమె రచనల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, మధ్య తరగతి అమ్మాయి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, హుందాతనం, మాటకారితనం ఎక్కువగా కనిపిస్తాయి. ఆగమనం, ఆశల శిఖరాలు, ఆత్మీయులు, అగ్నిపూలు, అభిశాపం, ఆహుతి, అమర హృదయం, బహుమతి, బంధీ, బంగారు కలలు, మీనా, జీవన తరంగాలు వంటి ప్రముఖ నవలలను సులోచనారాణి రచించారు.

Yaddanapudi Sulochanaraniనవలా రచనలో యద్ధనపూడి ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు పాఠకలోకం నవలతో ఉర్రూతలు ఊగుతున్న వేళ ట్రెండ్‌ను బట్టి ఆమె వెలుగొందలేదు. ఒక ట్రెండ్‌ను సెట్ చేశారు. ఆ ట్రెండ్‌కు నేటికీ ఫాలోయింగ్ ఉంది. హీరోల అందాన్ని వర్ణించడంలో, వారి రాజసాన్ని తన అక్షరాల్లో తొణికించడంలో యద్ధనపూడి ట్రెండ్ సెట్టర్. యద్ధనపూడి నవలలు చదివిన వాళ్లకు ఈ విషయం అర్థం అవుతుంది.

హీరోని ధనవంతుడిగా చూపినా, ధనం లేకపోయినా అందగాడిగా చూపినా యద్ధనపూడి హీరో ఒక ధీరోదత్తుడు. ఆ హీరోయిజాన్నే తమ నవలల్లో కూడా ఆవిష్కరించారు యండమూరి, కొమ్మనాపల్లి గణపతిరావు వంటి ప్రముఖ రచయితలు. ఈ విషయాన్ని కొమ్మనాపల్లి ఓపెన్‌గానే ఒప్పుకుంటారు. పొడవాటి కారు, అందులోంచి దిగే అందమైన హీరో.. వంటి వర్ణనలు తమ లాంటి వాళ్లు యద్ధనపూడి నుంచినే నేర్చుకున్నామని కొమ్మనాపల్లి చెప్పాడు.

యండమూరి, కొమ్మనాపల్లి వంటి వాళ్లు తెలుగు నవల ప్రియులకు చాలా ఇష్టమైన వాళ్లు. వీళ్లకే మార్గదర్శకురాలు యద్ధనపూడి అంటే ఆమె స్థాయిని అర్థం చేసుకోవచ్చు. రచనలో ఆమెది అందెవేసిన చెయ్యి. ‘మీనా’ వంటి సుధీర్ఘ నవల కథ మొత్తాన్నీ హీరోయిన్ పాత్ర చేతే చెప్పించి మెప్పించడం యద్ధనపూడి రచనా ప్రతిభకు నిదర్శనం. కథనంతా హీరోయిన్ ఫస్ట్ పర్సన్‌గా పాఠకుడికి వివరిస్తుంది. రచనలో అలాంటి విజయవంతమైన ప్రయోగం చేయగలడం యద్ధనపూడి గొప్పదనం.

ఆమె నవలలు చదివితే ఆ పాత్రలన్నీ కళ్ల ముందు కదలాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కో నవలను పూర్తిచేస్తూ ఒక్కో మధురానుభూతి కలగక మానదు. కొన్ని నవలలు చదివితే రోజులైనా తేరుకోవడం కష్టం. ఆ పాత్రల చిత్రణ, ఆమె వర్ణన ఆ నవల ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లిపోతుంది. ప్రత్యేకించి తన అక్షరాలతో ప్రేమకథలను ఆవిష్కరించడంలో యద్ధనపూడి తర్వాతే ఎవరైనా. మీనా, ప్రేమదీపిక వంటి నవల్లోని ప్రేమకథలు మన జీవితంలోనూ ఇలా ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ పాఠకుడిని హత్తుకుంటాయి.

నాటి యువతనే కాదు, చదివే తీరిక ఉంటే.. నేటి యువతను కూడా యద్దపూడి నవలలు మురిపించగలవు. యద్ధనపూడి నవలలు అప్పటికీ, ఇప్పటికీ సినిమాలకు ముడి సరుకే. పాఠకులను బాగా ఆకట్టుకున్న నవలలు సినిమాలుగా కూడా ఆకట్టుకున్నాయి. నవల రచయితగా వచ్చే గుర్తింపును రెట్టింపు చేస్తాయి సినిమాలు. ఆ రకంగా కూడా యద్ధనపూడి టాలీవుడ్‌కు గొప్ప సినిమాలకు కథలనిచ్చారు.

టాలీవుడ్‌పై యద్ధనపూడి ప్రభావం ఎంత అంటే.. ఇటీవలే దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ యద్ధనపూడి ఎప్పుడో రాసిన, ఆల్రెడీ సినిమాగా వచ్చేసిన ‘మీనా’ నవలను ‘అ ఆ’ తీయడాన్ని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తెలుగు నవల ప్రస్తావన వచ్చినప్పుడల్లా యద్ధనపూడి స్మరణీయురాలే.

సినీ పరిశ్రమలో సంచలనం

సులోచనారాణి నవలలు వెండి తెరని కూడా ఓ కుదుపు కుదిపేశాయి. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా, టివి సీరియల్స్ గా అలరించాయి. అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మీనా వంటి నవలలు వెండి తెరపై మెరుపులు మెరిపించాయి.

1973 లో విజయనిర్మల, కృష్ణ నటించిన మీనా చిత్ర కథ సులోచనారాణి మీనా నవలనుంచి తీసుకున్నారు. మీనా నవల అత్యంత ప్రజాదరణ పొందింది. మీనా చిత్రం కూడా మంచి విజయం సాధించింది. 2016 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకేకించిన అ.. ఆ చిత్రానికి కూడా మీనా నవలే ఆధారం.

ప్రేమ కథలే

సులోచనా రాణి నవలల్లో ఎక్కువభాగం ప్రేమకథలే ఉంటాయి. మధ్యతరగతి మహిళ మనసులని ఆమె అద్భుతంగా తన రచనలద్వారా తెలియజేసారు. ధనవంతుడైన యువకుడు, మధ్యతరగతి అమ్మాయి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో సులోచనా రాణి ఎక్కువ నవలలు రాశారు
ఆమె రచనల్లో సినిమాలుగా తీయబడ్డ నవలలుః
మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్. ఆత్మ గౌరవం

టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళు, నవలలు;
రాధ మధు నవలలు, ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ,  అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, ఋతువులు నవ్వాయి, కలలకౌగిలి, కీర్తికిరీటాలు, కృష్ణలోహిత, గిరిజా కళ్యాణం,  చీకటిలో చిరుదీపం,  జీవన సౌరభం, జాహ్నవి, దాంపత్యవనం, నిశాంత, ప్రేమ,  ప్రేమదీపిక, ప్రేమపీఠం, బహుమతి, బందీ, బంగారు కలలు, మనోభిరామం, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, మోహిత, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ, సౌగంధి,  సుకుమారి

Send a Comment

Your email address will not be published.