నేనెరిగిన న్యూ జిలాండ్

తూర్పు వైపున వున్న పడమటి దేశం
భూతలానికి తలమానికం
కనుచూపు మేర పచ్చదనం
ఎటు చూసినా కనిపించరు జనం.

అనన్య సామాన్యమైన హరితవనాలు
అబ్బురపరచే మనోహర దృశ్యాలు
కనువిందైన పర్వత శ్రేణులు
వినుసొంపైన వీరుల గాధలు

ఐరోపా ఖండంలోని వారు కూడా న్యూ జిలాండ్ దేశాన్ని భూతలంపై నున్న అత్యంత సుందర దేశంగా ప్రశంసిస్తుంటారు. ఉత్తర మరియు దక్షిణ ద్వీపాలు గల న్యూ జిలాండ్ దేశం ఎంతో ప్రశాంత వాతావరణంతో సంవత్సరం పొడవునా వర్షాలు పడుతూ ఎటు చూసినా పచ్చదనంతో నిండుకుండలా తొణికిసలాడుతూ ఉంటుంది.

1994-96 సంవత్సరాలలో వలస వెళ్ళిన చాలామంది తెలుగువారు ఉత్తర ద్వీపంలోనున్న ఆక్లాండ్ నగరాన్ని నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, సమశీతోష్ణస్థితి తెలుగువారికి అనుగుణంగా ఉండటం వలన ఆక్లాండ్ అందరూ నివాసయోగ్యమైన నగరంగా భావించారు. న్యూ జిలాండ్ దేశంలో అత్యంత జనసాంద్రత గల నగరం ఆక్లండే. ఉద్యోగావకాశాలు కూడా అక్కడ మిగిలిన నగరాలు కంటే ఎక్కువ. భౌగోళికంగా ఆక్లాండ్ నగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసిఫిక్ మహా సముద్రం మరియు తాస్మానియా సముద్రంతో ఇరువైపులా చుట్టబడి ఉండటంతో ఈ నగరంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే వారు అర్ధగంట ప్రయాణం చేస్తే సముద్ర తీరంలో నిల్చుని హాయిగా పిల్లగాలులతో సేదదీర్చుకునే అవకాశం ఉంది. రెండు గంటలు ప్రయాణం చేస్తే మనోహరమైన దృశ్యాలు కల ఒక అద్భుత ప్రదేశంలో కూర్చొని గంటల తరబడి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

1990 దశకం చివరి వరకూ న్యూ జిలాండ్ దేశస్థులు వేరే దేశాలు సందర్శించడానికి వెళ్ళినపుడు తోటి పౌరులు అత్యవసర పరిస్థితిలో అక్కరకు వస్తుందని తమ ఇళ్ళకు తాళాలు వెయ్యకుండా వెళ్ళే వాళ్లట. ఎంతటి ఉదార స్వభావులో ఈ ఒక్క ప్రక్రియ ద్వారా మనకి అర్ధమౌతుంది. ఇటువంటి దేశంలోని దక్షిణ ద్వీపంలో ఉన్న క్రిస్ట్ చర్చ్ నగరంలో గత వారం (15 మార్చి 2019) ఘోరాతిఘోరమైన, అనూహ్యమైన కాల్పుల దుర్ఘటనలో 50 మంది పౌరులు దైవ సన్నిధిలో ప్రార్ధనలు చేసుకున్న సమయంలో మరణించడం – ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 22, 2011 మిట్టమధ్యాహ్నం క్రిస్ట్ చర్చ్ లో వచ్చిన భూకంపం వలన నగరమంతా అతలాకుతలమై ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చాలామంది నగర వాసులు దేశంలోని ఇతర ప్రదేశాలకు, ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారు. గత తొమ్మిదేళ్ళుగా న్యూ జిలాండ్ ప్రభుత్వం ఈ నగర పునరుద్ధరణకు ఎంతో ధనం వెచ్చించి ఇప్పుడిప్పుడే చాలామంది పౌరులు తిరిగి తమ జీవన గమనాన్ని వెదుక్కుంటూ స్థిరపడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇటువంటి దారుణ మారణకాండ జరగడం అత్యంత విషాదకరం. ఇందులో ఇద్దరు హైదరాబాదుకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. మానవతా హృదయంతో తోటి పౌరుల మరణ వార్త విని మన తెలుగువారు తమ సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా సహాయక కార్యక్రమాలు కూడా చేపట్టారు. మొట్టమొదటిసారిగా ప్రధాన మంత్రి పదవి చేపట్టిన జసిండ అర్దీన్ అసమానమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ఈ కష్ట కాలంలో మృతుల కుటుంబాలను అక్కున చేర్చుకొని అహర్నిశలూ అండగా నిల్చొని ధైర్యాన్ని చెబుతూ అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నారు. ఈ దుర్ఘటనకు గురైన కుటుంబాల సహాయార్ధం అధికారికంగా ఈ క్రింది వెబ్ సైట్ ని పొందుపరిచారు. ఎవరినా డబ్బు ఇవ్వదలచుకుంటే ఈ లింకుని ఉపయోగించవచ్చు.
https://givealittle.co.nz/cause/christchurch-shooting-victims-fund

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగువారందరి తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ తెలుగుమల్లి మృతులందరి ఆత్మలు శాంతి పొందగలవని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Send a Comment

Your email address will not be published.