పద్య మధురిమలతో ఉగాది

విలంబి ఉగాది – తెలుగుమల్లి  మరియు  భువన విజయం
IMG_5551s
ఉగాది అంటే ఖచ్చితంగా ఊరే గుర్తుకొస్తుంది. అమ్మ చేతి కొసర ముద్దలు, చిన్నప్పుడు ఆడిన ఆటలు – అష్ట చెమ్మ, పులి మేక, చదరంగం, కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ళ గుర్తుకువస్తాయి. మామిడి తోటలోని లేలేత చిగురుటాకులు, ఆ చిగుళ్ళు ఆబగా తింటున్న కోయిల గుర్తుకు వస్తుంది. ఆ కోయిల పాడే కుహూరవాలు గుర్తుకు వస్తాయి. తోటలోని మామిడి పిందెలు తొంగిచూస్తూ ఈ ఉగాది పచ్చడిలో ఒక పాత్రానవుతానా అని ఎదురుచూస్తుంటాయి. కొలనుగట్టుపైన వేప చెట్టు ఎవరొస్తారా అని ఎదురుచూస్తుంటుంది. పొలంలోని చెరకుగడ్డ పిల్లగాలికి ఊయలలూగుతూ వయ్యారంగా ఊసులాడుతుంటుంది. చిన్ననాటి జ్ఞాపకాలు చిరుమందహాసంతో పలకరించి పరవసింప జేస్తాయి. చిరు ఊహల గుసగుసలు మరుగయ్యాయని బాధ కలుగుతుంది.

శ్రీ శివ విష్ణు మందిరంలో తెలుగుమల్లి మరియు భువన విజయం నిర్వహించిన ఉగాది కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా జరిగింది. ఈ సారి ముఖ్యంగా భాగవత పద్యాలు, కవితలు, కధలు, సంగీత విద్వాంసుల స్మరణతో పాటు రెండు నిముషాలు తెలుగులో మాట్లాడుట పోటీ ఎంతో రక్తి కట్టించింది.
దీప ప్రజ్వలన
IMG_5560s
IMG_5683s

ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ శివ విష్ణు మందిరం అధ్యక్షులు శ్రీ సనగపల్లి కోటీశ్వర రావు గారు మరియు భారత దేశం నుండి వచ్చిన శ్రీ రాజుపాలెం బుచ్చిరజారావు గారు (శ్రీ రాజుపాలెం వేణుగోపాల్ గారి తండ్రి గారు) దీప ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. చిరంజీవి రియా కంజిరాల ప్రార్ధనా గీతం పాడింది.
కవి సమ్మేళనం
IMG_5598ssతెలుగు భాషకి పద్యం ఒక అందమైన సొగసు. ఒక అపురూపమైన సాహితీ ప్రక్రియ. ఈ ఉగాది సంబరాల్లో పలువురు కవులు పోతన భాగవతంలోనివి మరియు కాళిదాసు వ్రాసిన వసంత ఋతు కవనం పఠించడం జరిగింది. కధలు, కవితలు, కధనాలు, పద్యాలు పాడి ఉగాది కవి సమ్మేళనానికి వన్నె తెచ్చారు. మన తెలుగు పద్యాలు భక్తీ, సాహిత్యంతో పాటుగా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని పలువురు వక్తలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కొంతమంది క్రొత్తవారు చక్కని కవితలు వినిపించి ప్రేక్షకులను అలరించారు. ఇవే కాకుండా మన వాగ్గేయకారులు అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు వ్రాసిన కీర్తనలు కూడా ఈ కార్యక్రమంలో పాడడం జరిగింది.

ముహూర్త బలం మన మంచికే
ప్రతీ ఏటా సిడ్నీ, మెల్బోర్న్ మరియు కాన్బెర్రా (AEST) కాలమానం ప్రకారం సిడ్నీ వాస్తవ్యులు శ్రీ నేతి రామకృష్ణ గారి సంయోజనంతో పంచాంగం తాయారు చేసి తెలుగువారందరికీ అందజేస్తున్న శ్రీ కర్రా భాస్కర శర్మ గారు ముఖ్య అతిధిగా మాట్లాడుతూ పంచాంగం యొక్క ఆవశ్యకతను గురించి తెలిపారు. అన్ని ముహూర్తాలు శుభ ఫలితాలు ఇవ్వాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇవ్వాలన్న నిబంధనా లేదు. మంచి జరగాలన్న శుభసంకల్పం ఒక ఉన్నతమైన ఆశయంతో ముహూర్తాలు నిర్ణయించడం మనలోని గొప్ప సంప్రదాయం అని శ్రీ శర్మ గారు చెప్పారు.

పంచాంగ శ్రవణం
ఉగాది అనగానే ఉగాది పచ్చడి తరువాత పంచాంగ శ్రవణం గుర్తుకు వస్తుంది. కాలమాన పరిస్థితులను బట్టి దేశ వ్యాప్తంగా వచ్చే సంవత్సరం జరగబోయే సంఘటనలు గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆతృతగా ఉంటుంది. శ్రీ వెంకట నరసింహమూర్తి గారు ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం చేసి అందరికీ ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేసారు. సంవత్సర పొడవునా సర్వ జనావళికి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వివరించారు.

రెండు నిముషాలు తెలుగులో మాట్లాడుట
BRI_4079s
IMG_5722SS
IMG_5762ss
IMG_5782s IMG_5758s
IMG_5824s

రెండు నిముషాలు మరే ఇతర భాషా పదాలు వాడకుండా అప్పుడే ఇచ్చిన విషయంపై మాట్లాడే పోటీలో షుమారు 10 మందికి పైగా భాషాభిమానులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమానికి రక్తి కట్టించారు. మునుపెన్నడూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించబడలేదు. ఇందులో విజేతలుగా శ్రీమతి ఉషా లక్ష్మి కామిశెట్టి (మొదటి బహుమతి), శ్రీ చంద్రశేఖర్ నందిరాజు (రెండవ బహుమతి) శ్రీ నరేన్ సుంకిసాల (మూడవ బహుమతి) బహుమతులందుకున్నారు. మన భాషలో కొన్ని ఆంగ్ల పదాలు ఊత పదాలుగా ఎలా జీర్ణించుకుపోయాయో ఈ కార్యక్రమంలో విశిదమయ్యింది.

శ్రీ ప్రశాంత్ వీరమాచినేని మరియు శ్రీమతి నీలిమ వీరమాచినేని దంపతులు ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందజేసి పోటీ విజేతలకు బహుమతులు అందజేసారు. అంతే కాకుండా వారి బృందం ఈ కార్యక్రమానికి వీడియొ మరియు ఫోటోగ్రఫీ తీసి అందమైన చిత్రాలు మనకు అందించారు. తెలుగుమల్లి మరియు భువన విజయం వారికీ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

ఉగాది పచ్చడి
ఈ సంవత్సరం ఉగాది పచ్చడి శ్రీమతి లలిత సరిపల్లె మరియు శ్రీమతి ప్రత్యూష కొంచాడ తయారుచేసి అందరికీ పంచిపెట్టారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి పూర్ణిమ ఘంట వ్యాఖ్యాతగా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ధ్వని ద్వయం శ్రీ మురళి బుడిగె మరియు శ్రీ వడ్డిరాజు శ్రీనివాస్ గార్లు శబ్ద సహకారాన్ని అందించారు.
IMG_5673s
IMG_5577s

Send a Comment

Your email address will not be published.