ప్రపంచానికే వెలుగివ్వగల భాష తెలుగు

ఈ నెల 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా….

ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాషల్లో తెలుగు ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ప్రపంచంలో తెలుగు వారిలేని దేశమే లేదంటే అది అంతర్జాతియ స్థాయిలో కూడా ప్రత్యేక భాషగా వెలుగులను అందిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేనేలేదు

Ancient_TeluguScrip

మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయ్యింది. విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ, భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.

భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.

త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు వివరించారు. తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు. ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు. తెలుగుభాషను పోర్చుగీసు వారు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.

తెలుగు భాష వయసు
palm leafక్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని “గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.

క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని “నాగబు” పదంలోని “బు” ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావింపబడుతున్నాయి. అదేవిధంగా క్రీ.శ. 848లోని పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో పద్యాలున్నాయి.
తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలమైన 16వ శతాబ్దం స్వర్ణయుగం.

సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావజాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళ

 

తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది.
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.

చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది. తెలుగులో 20వ శతాబ్దంలోనే ఎక్కువ సాహిత్యం వచ్చింది. ఇంతకుముందులేని సాహిత్య ప్రక్రియలెన్నో ఈ శతాబ్దంలో వికసించాయి. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు చెందినవారు రచయితలయ్యారు.
అనేకమంది కవుల కృతులతో ఆంధ్ర భాష అలరారింది. ఆచార్య భద్రిరాజు క్రుష్ణమూర్తి ఆధ్వర్యంలో 1,08,330 పదాలతో కూడిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం 8 సంపుటాలుగా ఆంధ్ర యూనివర్సిటిచే ప్రచురించబడింది. ఇంగ్లీషు తరువాత తెలుగు భాషకే ఇంతటి కోశ సంపద ఉంది.

తెలుగు భాష ప్రస్తుత స్థితిగతులు
తెలుగు భాషకు 3వేల ఏళ్ల చరిత్ర ఉంది. 1500ఏళ్ల నాటి శాసనాలు, తెలుగు సాహిత్యంలో నన్నయకు ముందే పదో శతాబ్దానికి చెందిన రేచన ‘కవిజనాశ్రయం’ మొదటి కావ్యమని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడవుతోంది. తెలుగుకు దాదాపు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. ఆధునిక సాహిత్యంతోపాటు ప్రాచీన సాహిత్యానికి తగినంత గౌరవం, ప్రాముఖ్యతను మన ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రాచీన సాహిత్యమంటే మనది కాదనే భావన తొలగాలి. ప్రాచీన గ్రంథాల్లో నేటి పరిస్థితులకు అక్కరకొచ్చే విషయాలెన్నో ఉన్నాయి. 13వ శతాబ్దానికి చెందిన కేతన ‘మనుస్మృతి,’ ‘పరాశర స్మృతి’ని వ్యాఖ్యానిస్తూ ‘విజ్ఞానేశ్వరం’ అనే ధర్మశాస్త్ర గ్రంథం రచించాడు. ఆ రోజుల్లోనే తెలుగులో న్యాయశాస్త్ర గ్రంథాన్ని రచించడమంటే మాటలు కాదు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మహావీరాచార్యుడు సంస్కృతంలో ‘గణిత సార సంగ్రహం’ రాశాడు. దాని ఆధారంగా 13వ శతాబ్దానికి చెందిన పావులూరి మల్లన్న తెలుగులో గణితశాస్త్రాన్ని రచించాడు. నాటి పద సంపదను వెలికితీసి ఆధునిక భాషలో వాడటం ద్వారా తెలుగు విస్తృతి పెరుగుతుంది. పాల్కురికి సోమనాథుడు ‘బసవ పురాణం’లో ఒకచోట రజకుడిని ‘మడివేలు’ అని సంబోధించాడు. రజకులు పదం కన్నా, మడివేలు పదం బాగుంది కదా! అలా ప్రాచీన తెలుగు సాహిత్యంలోని లక్షల పదాలను వెలికితీయాలి. వాటిని నిఘంటువుల్లో చేర్చాలి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహారికంలో ప్రయోగించాలి.

వెయ్యేళ్లకుపైగా సాహిత్యం మన భాష సొంతం. కానీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 15కోట్లమంది తెలుగు వాళ్లున్నారు. చాలామంది తాము తెలుగు వాళ్లమని చెప్పుకోడానికి సిద్ధంగా లేరు. మన సంవిధానం ప్రకారం భారతీయులు దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు. వాళ్ల మాతృభాషలో విద్యా విధానాన్ని అనుసరించే హక్కు వాళ్లకుంది. అయినా ప్రస్తుతం అలా జరగడం లేదు. ఉద్యోగావకాశాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఇతర భాషల వారికి ఉద్యోగావకాశాలు ఇవ్వద్దొని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. దాంతో ఆ ప్రాంతాల్లో నివసించే కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు తాము తెలుగు వాళ్లమని చెప్పుకోడానికే భయపడుతున్నారు. ముందుగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా సమావేశమవ్వాలి. భాషా విధానం గురించి చర్చించాలి. పొరుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకు స్థానిక భాషతోపాటు మాతృభాష నేర్చుకునే వెసులుబాటు కల్పించాలి.

మాతృభాష విషయంలో ఆదర్శంగా ఉన్న రాష్ట్రాలు
మాతృభాష పట్ల అవగాహన, గౌరవం తమిళుల్లో ఎక్కువ కనిపిస్తుంది. తమిళనాడులో ప్రాథమిక విద్యలోనూ తమిళాన్ని తప్పనిసరి చేశారు. మనం మాత్రం ఆంగ్లం మోజులో పడి, తెలుగును పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాం. ‘పిల్లలకు ఇంగ్లీషు బాగా నేర్పించండి. దాంతోపాటు తెలుగు కూడా నేర్పంచండి’ అని కొన్నేళ్లుగా భాషావేత్తలు, సామాజిక నిపుణులు మొత్తుకుంటున్నారు. ఆ మాటలు మనవాళ్లకు పెద్దగా చెవికెక్కడం లేదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌ రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతోంది.

తెలుగు భాష ప్రాముఖ్యత
మనలోని భావాలను వ్యక్తపర్చడానికి భాష కావాలి. ఏ ఒక్క భాషతోనూ అన్ని భావాలనూ వ్యక్తంచేయలేం.script ప్రపంచంలో చాలా భాషలకు లేని పద సంపద తెలుగు సొంతం. ఏదైనా భాష ఎదగాలంటే, ఇతర భాషల్లోని మంచి పదాలను తనలో ఇముడ్చుకోగలగాలి. ఇంగ్లిష్‌ అలాగే ప్రపంచ భాషగా ఎదిగింది. ఆంగ్లంలో మన తెలుగు పదాలు కూడా ఉన్నాయి. తెలుగులో పందికొక్కు పేరు నుంచే ఇంగ్లి్‌షలో బ్యాండీకుట్‌ పదం పుట్టింది. కూర నుంచి కర్రీ పదం వచ్చింది. మన తెలుగులోనూ ఇతర భాషా పదాలున్నాయి. వాటిని వ్యతిరేకించాల్సిన పనిలేదు. కాకపోతే సాధ్యమైనంత వరకు తెలుగు పదాలను వాడితే మంచిది. కృత్రిమ పదాలను కల్పించడాన్ని మాత్రం వ్యతిరేకించాలి. తెలుగు నిఘంటువులు మనకు చాలానే ఉన్నాయి. విద్యార్థుల కోసం ఆధునిక వ్యవహారిక పద కోశం, పాకెట్‌ సైజు డిక్షనరీలను ముద్రించాలి. అచ్చుతోపాటు అంతర్జాలంలోనూ వాటిని అందుబాటులోకి తేవాలి. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలన్నింటినీ అంతర్జాలంలో ఉంచాలి. అప్పుడే మన సారస్వతం గొప్పతనం ప్రపంచ నలుమూలలకూ వ్యాపిస్తుంది.

అచ్చిక తెలుగు అచ్చ తెలుగు అయ్యింది. తెలుగు మాటల్లో తత్సమాలు, తద్భవాలు ఉంటాయి. తత్సమాలలో సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు ఉంటాయి. సంస్కృత సమాలుకాని ఇతర పదాలను అచ్చ తెలుగు పదాలు అంటారు. అంటే ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు కలిసి అచ్చ తెలుగు అవుతుంది….జాను తెనుగు పద బంధాన్ని మొట్టమొదటగా తన కుమార సంభవంలో ప్రయోగించినవాడు నన్నెచోడుడు. జానుతెనుగనగా తేట తెలుగు, స్పష్టంగా తెలిసెడి తెలుగు అని నిఘంటుకారుల అభిప్రాయం. మధురమైన తెలుగు అని జాను తెలుగు గురించి బ్రౌన్ నిఘంటువు వివరించింది. జాను అను పదాన్ని స్పష్టము అనే అర్ధంలో తిక్కన ప్రయోగించాడు. డా.సి. నారాయణ రెడ్డి “ఏది ఒకానొక దుర్బోధక విషయముని కూడా సామాన్య జనులకు సైతం సుబోధకంగా, సుప్రసన్నంగా అందించునో అది జాను తెనుగు” అని వివరించారు.

తెలుగు లిపి :భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. భాష నాగరికతతోపాటు వృద్ధి చెందుతుంది. ఐతే భాష పుట్టిన చాలా కాలం వరకు ఆ భాషకు లిపి ఉండదు.లిపి ముందుగా రాజ్య వ్యవహారాలకోసం పుడుతుందిగానీ వాజ్ఞ్మయం కోసం కాదు. మాట్లాడే భాషని లిఖితపూర్వకంగా గుర్తించడాన్ని “లిపి” అంటారు. ఒక్కొ భాషకు ఒక్కో లిపి ఉంటుంది. లిపి లేని భాషలూ ఉన్నాయి. మన దేశంలోని భాషా లిపులన్నీ కూడా క్రీ.పూ.250 నాటి “బ్రాహ్మీ” లిపి నుంచి పుట్టినవే. 15వ శతాబ్దందాకా తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేదని తెలుస్తోంది.

తెలుగుకు ప్రపంచ గుర్తింపు రావాలంటే?
తెలుగులో ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలి. శాస్త్ర, సాంకేతిక విద్య, న్యాయ, వైద్యశాస్త్రాల్లో తెలుగు పుస్తకాలు లేవు. మన పాలకులు అనుకుంటే అది పెద్ద పని కాదు. తగినన్ని నిధులు కేటాయించి, వంద మంది అనువాదకులను నియమించి వైజ్ఞానిక, విజ్ఞాన, సామాజిక శాస్త్రాల్లోని పాఠ్యపుస్తకాలను తెలుగులోకి అనువదించాలి. నిజాం పాలనలో సైన్స్‌, ఇంజనీరింగ్‌, వైద్య, న్యాయశాస్త్రాలను ఉర్దూలో అనువదించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బోధనంతా ఉర్దూలోనే సాగింది. ఆనాడు నిజాం చేసిన కృషి నేటి పాలకులు చేయలేకపోవడం బాధాకరం. తెలుగు ఔన్నత్యం గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఇతరులకు తెలియజెప్పాలి. అప్పుడే ప్రపంచ భాషగా ఎదుగుతుంది.

మాతృభాష పరిరక్షణకు ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలు
జర్మనీ వెళ్లాలంటే జర్మన్‌ నేర్చుకోవాల్సిందే. లేకపోతే వాళ్లు రానివ్వరు. జపనీస్‌ నేర్చుకుంటేనే జపాన్‌ వెళ్లగలరు. వాళ్ల విజ్ఞానమంతా వారి మాతృభాషలోనే ఉంది. చైనాలోనూ అదే పరిస్థితి. యూరోపియన్‌ దేశాలు సైతం మాతృభాష పరిరక్షణలో ముందున్నాయి. స్వీడన్‌లో ఒక్క సూచిక బోర్డు కూడా ఇంగ్లి్‌షలో కనిపించదు. స్వీడి్‌షలోనే ఉంటాయి.

తెలుగు వెలగాలంటే ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు
సమగ్రమైన తెలుగు అత్యున్నత స్థాయిలో బోధన, పరిశోధన, పరిపాలన జరిగేట్టు తగిన ప్రాధికార సంస్థను నెలకొల్పాలి. ప్రతి సబ్జెక్టుకూ తెలుగు పదకోశాలను రూపొందించాలి. కనీసం హైస్కూల్‌ స్థాయి వరకైనా తెలుగు వారు తెలుగులో చదవాలనే నిబంధన విధించాలి. పరిపాలనా భాషగా తెలుగే ఉండాలి. నాడు బ్రిటీష్‌ అధికారులే తెలుగు నేర్చుకుని తెలుగునాడును ఏలారు. నేడు మన పాలకులు తెలుగులో పాలన కొనసాగించలేరా? స్థానిక సంస్థల నుంచి రాష్ట్రస్థాయి పరిపాలన, న్యాయస్థానం తీర్పులు, జీఓలు వంటివన్నీ తెలుగులోనే వెలువడాలి. అందుకు తగిన నిఘంటువులను రూపొందించాలి. కర్నాటకలో అనువాద అకాడమీ ఉంది. అలాంటి సంస్థను తెలుగు ప్రభుత్వాలూ నెలకొల్పాలి. మనకు కావాల్సింది ఇంగ్లిష్‌ మోడల్‌ స్కూళ్లు కాదు, తెలుగులో మోడల్‌ పాఠశాలలను నెలకొల్పాలి. తెలుగు మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించేలా పాఠశాలలను బలోపేతం చేయాలి. తెలుగులో ఉండే పద సంపదనంతటినీ ప్రతీ తెలుగు వ్యక్తి తెలుసుకునే అవకాశం కల్పించాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది.

Send a Comment

Your email address will not be published.