ప్రపంచ భాషల్లో తెలుగు మేటి

న్యూ జీలాండ్ లో మొదటి సాహితీ సదస్సు

సదస్సు నిర్వహణ అద్భుతం  – యార్లగడ్డ 

నేను హాజరైన సాహితీ సదస్సులలో అత్యుత్తమమైనది – భరణి 
NZ 1
NZ 2
NZ 3
అమ్మ నేర్పిన మాట అవని అంతట చాట
తల్లి ఋణము తీర్చ తరలి రమ్మని కోర
ధరణి అంతయు పరిధిగా అరుదెంచిరి అంబ సుత(తు)లు
అజరామరంబైన అమర భాషకు అంజలి ఘటించ

ఎల్లలు దాటి పల్లె పదాల పద అల్లికతో తెలుగు మల్లెల సువాసనలు వెదజల్లి చిన్నదైనా వన్నెగల దేశంలో అక్షర సుమాలు వరవళ్ళు దిద్ది సాహితీ ప్రవాహంలా పరవళ్ళు త్రొక్కింది మన తెలుగు. భువి కలికితురాయి భువనంబులో మేటి న్యూ జీలాండ్ అమ్మ భాషకు సాటి లేదనుచు అంజలి ఘటించింది.

భూతలానికి తలమానికమైన న్యూ జీలాండ్ దేశంలో మొదటి సాహితీ సదస్సు ఒక ప్రపంచ స్థాయిలో జరగడం ముదావహం. ప్రపంచంలోని నలుమూలల నుండి తెలుగు భాషాభిమానులు తరలి వచ్చి రెండు రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయినాథుని సమక్షంలో తమ ఆలోచనలు అక్షర రూపంలో పంచుకున్నారు.

ఈ సదస్సులో ముఖ్యంగా తెలుగు సాహితీ సువనంలోని పలు విధాలైన అంశాలు – పద్యాలు, పాటలు, జానపదాలు, నాటకాలు, సామెతలు, ఉపన్యాసాలు, కవితలు, కథలు, మాండలీకాలు, మన కవులు, పేరడీలు – ఇలా ఎన్నెన్నో ఘట్టాలు ఇనుమడింపజేసి రసవత్తరంగా సాగింది.

ఈ కార్యక్రమంపై  శ్రీ గోవర్ధన్ మల్లెల గారు సమర్పించిన సమీక్ష 
న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి తెలుగు సాహితీ సదస్సు నవంబర్ 16 , 17 తేదీలలో న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం హాల్ నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యంత వైభవంగ జరిగాయి। ఈ సాహితీ సదస్సులో భాగంగా 16 వ తారీఖు సాయంత్రం 6 గం నుంచి తెలుగు భాష ఔన్నిత్యాన్ని పెంపొందింప చేసే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించటం జరిగింది।

ఈ సాహితీ సదస్సు కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా ఆంధ్ర ప్రదేశ్ తెలుగు భాషా సంఘ అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత, దర్శకుడు, తత్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి గారు, తెలంగాణ రాష్ట్ర శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారు రావటం ఈ రెండు రోజుల సదస్సుకి వన్నె తెచ్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు।
16 వ తారీఖు ఉదయం 8 గం లకు అల్పాహారంతో మొదలైన ఈ సదస్సు లో వివిధ దేశాలనుంచి విచ్చేసిన అతిధులు, వక్తలు, కళాకారులకు న్యూజీలాండ్ తెలుగు సంఘం సాదరంగా ఆహ్వానం పలికి ఆహ్వానితులు, అతిధులు ఒకరికొకరు పరిచయం చేసుకొనే అవకాశం కల్పించింది।

ప్రారంభోత్సవ సభ
NZ Sahiti Sadassu2019
NZ Haka
Janapadam
9 గం 30 ని లకు శ్రీ షిర్డీ సాయి మందిరం ప్రధాన అర్చకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారు వేద మంత్రాలతో ఆహూతులను, అతిధులను ఆహ్వానం పలుకగా, విశిష్ఠ అతిధులు, ముఖ్య అతిధులు, తెలుగు సంఘ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత మగతల గార్లు జ్యోతి ప్రజ్వలనతో తొలి సాహితీ సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం జరిగింది।
న్యూజిలాండ్ తెలుగు సంఘం తరపున పూర్వ అధ్యక్షులు శ్రీ జగదీశ్వర రెడ్డి మగతల గారు, ప్రస్తుత అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత మగతల గార్లు ముఖ్య అతిధులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, శ్రీయుతులు తనికెళ్ళ భరణి గారు, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారు, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ యుతులు Dr అచ్చయ్య కుమార్ గారు, మారిషస్ నుంచి విచ్చేసిన శ్రీయుతులు సంజీవ నరసింహప్పడు మరియు ఈ సదస్సు స్ఫూర్తిదాత, నిర్వాహక సంఘ అధ్యక్షులు శ్రీయుతులు మల్లికేశ్వర రావు కొంచాడ గార్లను సాదరంగా వేదిక పైకి ఆహ్వానించి, శ్రీ రావు కొంచాడ గార్ని సాహితీ సదస్సు ప్రారంభ ఉపన్యాస వేదికకు అధ్యక్షత వహించ వలసిందిగా కోరటం జరిగింది।

తదనంతరం శ్రీ మల్లికేశ్వర రావు గారు ఈ సదస్సు నేపథ్యం గురించి ఆహూతులకు వివరించి ముందుగా ప్రముఖ అతిధి శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని ప్రసంగించటానికి ఆహ్వానించటం జరిగింది। శ్రీ యార్లగడ్డ గారు తెనుగు బాష విశిష్టత, ఆవశ్యకత, ప్రస్తుత రాజకీయ మరియు సామజిక పరిస్థితుల్లో తెలుగును కాపాడుకోవటం గురించి సభకు వివరించారు।
తరువాత శ్రీ తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ తెలుగు బాష కమ్మదనం, భారత దేశం లోనే కాకుండా ఇతర దేశాలలో బాష కై పడుతున్న ఆరాటం గురించి చక్కగా వివరించారు। న్యూ జీలాండ్ వంటి దేశంలో తెలుగు భాష కోసం మొదటిసారిగా ఇంత పెద్ద సాహితీ సభను ఏర్పాటు చేసి తమ భాషాభిమానాన్ని ప్రకటించుకోవడం మన భాష కూడా ప్రపంచ భాషలకు దీటుగా నిలబడుతున్నదని వక్కాణించారు.

NZ Sriniivas

ఆ తరువాత శ్రీ సత్యనారాయణ గారు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవటానికి తన అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న అనేక కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు। వారి ప్రసంగంలో సాహిత్యం – సామజిక ప్రయోజనం గురించి కూడా సభకు వివరణలతో తెలియ చేయటం జరిగింది।

పుస్తక ఆవిష్కరణలు
ఈ సందర్భముగా వివిధ దేశాల నుంచి కొందరు రచయితలు వ్రాసి, ప్రచురించిన కొన్ని పుస్తకాలను ఆవిష్కరించటం జరిగింది। వాటిలో ప్రముఖమైనవి –
శ్రీ రమాకాంత్ రెడ్డి గారు వ్రాసిన ‘వాసంత సమీరాలు’, శ్రీ కళ్యాణ్ తటవర్తి (మెల్బోర్న్ ) గారు వ్రాసిన ‘న్యూజిలాండ్ సాహితీ సదస్సు శతకం’ , శ్రీ ఉమా మహేష్ శనగవరపు (మెల్బోర్న్) గారు వ్రాసిన ‘అక్షర విజ్ఞానం’ శ్రీ సంజీవ నరసింహ అప్పుడు (మారిషస్) గారు వ్రాసిన ‘అన్నమయ్య పదకోశం’,
న్యూ జీలాండ్ శతకం ఈ క్రింది లంకెలో లభ్యమౌతున్నది
http://www.lulu.com/content/e-book/new-zealand-telugu-satakam/25551749
అక్షర విఙ్ఞానం పుస్తకం ఈ క్రింది లంకెలలో లభ్యమౌతున్నది
http://kinige.com/book/Akshara+Vignanam
http://www.lulu.com/shop/umamahesh-senagavarapu/%E0%B0%85%E0%B0%95%E0%B0%B7%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%99%E0%B0%9E%E0%B0%A8/ebook/product-24315007.html

న్యూ జీలాండ్ కాలమానం ప్రకారం వ్రాసిన మొదటి క్యాలెండర్ 

శ్రీ నేతి శివరామకృష్ణ శాస్త్రి (సిడ్నీ) గారు మరియు శ్రీ భాస్కర శర్మ గారు  వ్రాసిన న్యూజిలాండ్ క్యాలెండరు, ప్రత్యేక అతిధుల చేతుల మీదుగా ఆవిష్కరించటం జరిగింది।
ఆ తరువాత న్యూజిలాండ్, మలేషియా దేశాలలో తెలుగు పిల్లలకు తెలుగు బడుల ద్వారా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు జ్ఞాపికలు బహుకరించటం జరిగింది।

NZ 5
తదనంతరం, ప్రధాన ఆర్ధిక పోషకులు Dr పద్మజ కోయ, Dr మధు కోయ, శ్రీ గోవర్ధన్ మల్లెల గార్లను సత్కరించటం జరిగింది।
ఆ తరువాత మధ్యాహ్న విందుకు విరామం ప్రకటించారు।
ఈ సదస్సు రెండు రోజులూ తెలుగు సంఘం ఏర్పాటు చేసిన ఆతిధ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి। ఒక పెళ్లి వేడుకను తలపించే రీతిన ప్రొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం బంతి భోజనాలు, సాయంత్రం తేనీరు మరియు ఉపాహారం, రాత్రికి మరల విందు భోజనంతో అత్యంత రుచికరమైన వంటలతో అతిధులను ఆదరణతో చూసుకున్న తెలుగు సంఘం వారు సదా స్మరణీయులు।

మధ్యాహ్న భోజన అనంతరం వివిధ దేశాల నుంచి వచ్చిన వక్తలు కొందరు వారు ఎన్నుకున్న విశేష అంశాల గురించి ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది।
మొదటి రోజు వక్తలు-వారి ప్రసంగాంశములు:

మన భాష – సంస్కృతి
శ్రీమతి నిమ్మగడ్డ అరుణ (సిడ్నీ) గారు – భాష ఒక సంపద
శ్రీ రామ్ ప్రకాష్ ఎర్రమిల్లి (మెల్బోర్న్) గారు – ‘ఆస్ట్రేలియా భువన విజయం’ సంవేదికపై ఒక సమీక్ష
శ్రీ రామ మూర్తి కోడూరు (మెల్బోర్న్) గారు – స్వర్ణయుగంలో తెలుగు సాహిత్యం
శ్రీ భవాని శంకర్ (ఆక్లాండ్) గారు – C P బ్రౌన్ – తెలుగు సాహిత్య సేవలు
శ్రీమతి భారతి కందిమళ్ల (హైదరాబాద్) గారు – పౌర గ్రంధాలయాలు – బాష సంస్కృతి సేవ

మలేషియా చిన్నారులు
Malaysia
WhatsApp Image 2019-11-22 at 18.48.30
ఈ ఉపన్యాసాల తరువాత మలేషియా నుంచి వచ్చిన కాళాకారులు(చిన్న పిల్లలు) తమ ప్రతిభను అనేక సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా చాల చక్కగా ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు। శ్రీ నందమూరి తారక రామారావు గారి ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుంది. మలేషియాలో తెలుగువారి ప్రస్థానం బుర్రకథ రూపంలో చిన్నారులు ఎంతో చక్కగా అభినయించారు.

మన కవులు
తేనీటి విరామం తరువాత తిరిగి ప్రారంభమైన ఉపన్యాసాలలో ఆక్లాండ్ వక్తలు ప్రసంగించటం జరిగింది। శ్రీ గోవర్ధన్ మల్లెల గారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం గురించి, శ్రీ శ్రీనివాస రావు నందగిరి గారు సమాజం పై బాల సాహిత్యం ప్రభావం గురించి, శ్రీ స్థిత ప్రజ్ఞ అల్లం గారు Dr సి నారాయణ రెడ్డి గారి గురించి ఉపన్యసించారు।

సాంస్కృతిక కార్యక్రమాలు
NZ 4

స్వల్ప విరామం తరువాత ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు కుమారి నిషిత విస్సంరాజు గానంతో మొదలయ్యాయి। ఆ తరువాత భువన విజయం ఆస్ట్రేలియా వారు న్యూజిలాండ్ లోని కళాకారుల సహకారంతో ప్రదర్శించిన “భువన విజయం” నాటకం తెలుగు సాహితీ సదస్సు కార్యక్రమానికి వన్నె తెచ్చిందనటంలో ఎట్టి సందేహం లేదు। ఇందులో నటించిన, దర్శకత్వం వహించిన కళాకారులందరూ అభినందనీయులు।
తరువాత ఆక్లాండ్ కళాకారులచే జానపద నృత్యము అత్యంత సుందరంగా ప్రదర్శించటం జరిగింది।
తదనంతరం శ్రీ గోవర్ధన్ మల్లెల, శ్రీ శ్రీనివాస రావు నందగిరి ప్రదర్శించిన “దర్శకుడి దైవ దర్శనం” అనే లఘు నాటిక ఆహూతుల్ని అత్యంత ఉల్లాస పరిచింది।

ఆ తరువాత శ్రీకృష్ణ రావిపాటి (బ్రిస్బేన్) గారు దుర్యోధన ఏకపాత్రాభినయనం చేయటం జరిగింది।

శివతత్వాలు
Bharani
మొదటి రోజు కార్యక్రమంలో చివరగా శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆలపించిన స్వీయ శివ తత్వాలు ఆహూతుల్ని,సాహిత్యాభిమానుల్ని ఆధ్యాత్మిక చింతనతో వేరే లోకాలకు తీసుకెళ్లటం జరిగింది। ఈ కార్యక్రమంలో కుమారి శ్రావణి కునపులి, కుమారి సుదీక్ష రావూరు, కుమారి అవంతిక నన్నెగారి గాత్ర సహకారం అందించారు। శ్రీ స్థిత ప్రజ్ఞ తబలాపై, శ్రీ భారత్ పారిఖ్ హార్మోనియంపై వాద్య సహకారం అందించారు।

మొదటి రోజు కార్యక్రమాలకు శ్రీ జగదీశ్వర రెడ్డి మగతల, శ్రీమతి అనిత మొగిలిచెర్ల, శ్రీ విజయ్ కొసన, శ్రీ మురళీధర్ రంగు, శ్రీ శ్రీధర్ గోలి, శ్రీ అరుణ్ వనమా, శ్రీమతి రేఖ కుంచె వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు।

రెండవ రోజు
రెండవ రోజు కార్యక్రమంలో కవితలు, పద్యాలూ శీర్షికన కొందరు వక్తలు కవితలు, పద్యాలు సమర్పించటం జరిగింది। వారిలో శ్రీమతి రమాదేవి సాల్వాజిగారు, శ్రీ రమాకాంతరెడ్డి గారు, వేణుగోపాల్ రాజుపాలెం గారు, రఘు విస్సంరాజు గారు, దివాకర్ అన్నదానం గారు, శ్రీ నేతి శివరామకృష్ణ శాస్త్రి గారు వున్నారు। దీనికి ముందు మారిషస్ నుంచి విచ్చేసిన శ్రీ సంజీవ నరసింహప్పడు గారు మారిషస్ లో తెలుగు సంస్కుతిని కాపాడే విధానం అచ్చ తెలుగులో ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకుండా సభకు తెలియ చేయటం రెండవ రోజు కార్యక్రమాల్లో ముఖ్యమైనది మరియు ఆహూతులచే ప్రశంసింపబడింది।

సామెతలు, జాతీయాలు
తరువాత శ్రీకృష్ణ రావిపాటి, శ్రీసుత నాంపల్లి లు నిర్వహించిన సామెతల కార్యక్రమం ప్రేక్షకులకు పాలుపంచుకోవడానికి అవకాశమిచ్చి అందర్నీ అలరింప చేసింది। తదనంతరం శ్రీ శ్రీనివాస్ వడ్డిరాజు, కుమారి నిషిత విస్సంరాజు పాడిన పాత చిత్రాల యుగాల గీతాలు అందర్నీ అలరింప చేసాయి।
శ్రీ శ్రీనివాస రావు నందగిరి పాడిన పుష్ప విలాపం పేరడీ కూడా ఆహుతుల్ని ఆకట్టుకుంది।

గొలుసు కథ
Golusu_Katha
ఈ సదస్సులో గొలుసు కథ ప్రేక్షకులకిచ్చి పూర్తీ చేయమని అడగడం జరిగింది. ఇచ్చిన మూడు గంటలలోనే 30మంది పూర్తీ చేసారు. మొదటి బహుమతి ముగ్గురు కలిసి గెలుచుకున్నారు. వారు సునీత విజయ్, శ్రీదేవి కృష్ణ పుసర్ల మరియు రాజేశ్వరి గంగిశెట్టి గార్లు. రెండవ బహుమతి అరుణ శర్మ నిమ్మగడ్డ గారు గెలుచుకున్నారు. వీరందరికీ ప్రత్యేక అభినందనలు. ఇందులో పాల్గొన్నవారందరికీ అభినందనలు.

శ్రీ బాలభాస్కర్ తిక్కిశెట్టి గారి ప్రసంగం కూడా అందర్నీ ఆకట్టుకుంది।

భోజన విరామం తరువాత మరికొందరు వక్తలు ప్రసంగించారు। వీటిలో,

మాండలీకాలు
శ్రీ శ్రీధర్ నన్నెగారి – తెలంగాణ జానపదాలు
శ్రీ సి వి రావు గారి- గోంగూర రామాయణం
శ్రీ యోగి వాల్తాటి గారి – అక్కో నీ బాంచన్
శ్రీ శ్రీనివాస్ గుళ్ళపల్లి గారి – అమ్మొమ్మ కథలు
శ్రీ శ్రీధర్ గోలి గారి – మా ఊరి వెటకారం వున్నాయి।
ఆ తరువాత మలేషియన్ బృందం మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు సమర్పించారు।

యువత
ఆ తరువాత యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ హరి కొంచాడ, మానస మగతల ల స్వీయ అనుభవాలు చెప్పారు. యువతకి ప్రాధాన్యమిస్తూ కొన్ని కార్యక్రమాలను రూపొందించాలని వారు సూచించారు. అంతే కాకుండా యువతకు ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశమిచ్చి భావితరాలకు మన తెలుగు భాష ఔన్నత్యాన్ని అందించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వారి ప్రసంగం తెలుగు బాషలో యువత పాత్ర గురించి ఆలోచించేట్టు చేసాయి!

తేనీరు విరామం తరువాత శ్రీ ఉమా మహేష్ శనగవరపు గారు ఆంగ్ల ఆల్ఫాబెటికల్ digitisation లో నలుగుతున్న తెలుగు అక్షరాలు- కొన్ని పరిష్కారాలు అనే అంశం మీద, శ్రీమతి ఉమా సాల్వాజి గారు కవయిత్రి మొల్ల గురించి, శ్రీ వాసుదేవ రావు కూనపులి -శ్రీకృష్ణ దేవరాయలు -తెలుగు సాహిత్యం గురించి, శ్రీ మూర్తి మంచిరాజు – అన్నమయ్య లాలిపాటల గురించి ప్రసంగించారు।

భరణి గారితో ముఖాముఖి
సాయంత్రం కార్యక్రమంలో చివరగా విశిష్ఠ అతిధి శ్రీ తనికెళ్ళ భరణి గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఆహ్వానితులందరూ పాల్గొని, చలన చిత్ర, సాహిత్య,పాండిత్యాలకు సంబంధించిన అంశాల్ని ముచ్చటించుకోవటంతో రెండు రోజుల సాహితీ సంబరాలు అత్యంత వైభవంగా ముగిసింది,

తదుపరి సదస్సు…
పెళ్లి కూతుర్ని అత్తవారింటికి అప్పగింతల్లో అప్పగించినట్లుగా వచ్చే సంవత్సర సాహితీ సదస్సు బ్రిస్బేన్ లో జరుగుతుందని ప్రకటించటం జరిగింది।

ఆచార సాంప్రదాయాలకు అంజలి ఘటిస్తూ
భాషా సంస్కృతులకు అందలం పడుతూ
జనరంజకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ
సుమనస్కులైన సభ్యుల సహకారంతో
స్థానిక సంస్థలతో మమేకమై
ముందుకు సాగుతున్నది అంటూ…

NZ Telugu Assn 2019
ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించి, భవిష్యత్ లో చేసే కార్యక్రమాలు ఈ రీతిలో జరుపగలమా అనే సంశయాన్ని రాబోయే నిర్వాహకులకు కలిగించే విధంగా కష్టపడిన న్యూజిలాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత మగతల మరియు వారి కార్య నిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియ చేసారు. ముగింపు సభలో సదస్సు సమీక్ష, వందన సమర్పణ, కార్యకర్తల సన్మానం జరిగింది।

గోవర్ధన్ మల్లెల। సంగీత భారతి

వివిధ మాధ్యమాలలో న్యూ జీలాండ్ సాహితీ సదస్సు…

ఈటీవి – తెలంగాణా
https://youtu.be/Xwu4lG9AegQ

ఈనాడు
https://www.eenadu.net/archivespage/archivenewsdetails/219051514/18-11-2019/ap

ఈనాడు తెలుగు వెలుగు
http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MTgzMQ==&subid=MTA=&menid=Mw==&authr_id=MTIwNw==&etitle=khandantaramlo%20telugu%20harivillu#

తెలుగు టైమ్స్
http://telugutimes.net/home/moregallery/3/2931/celebrations/Newzealand-Telugu-Association-Telugu-Sahithi-Sadassu

http://telugutimes.net/home/article/65/22613/nzta-telugu-sahiti-sadassu-in-new-zealand

WhatsApp Image 2019-11-22 at 18.48.20
WhatsApp Image 2019-11-22 at 18.47.43
WhatsApp Image 2019-11-22 at 18.48.08

Send a Comment

Your email address will not be published.