మనకాలపు మహా వాగ్గేయకారుడు

మనకాలపు మహా వాగ్గేయకారుడు

మనకాలపు మహా వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ

శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షీతార్, శ్యామశాస్త్రిల పేర్లు వినుంటాం. సంగీత త్రిమూర్తులుగా భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసిన వారి వైదుష్యానికి అచ్చమైన వారసునిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ నిలుస్తారు. ఆయన జయంతి జూలై 6…

ఆయన కర్ణాటక సంగీత గాయకుడు మాత్రమే కారు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు కూడా.. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నారు. అతను వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందారు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు.

1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జన్మించారు. అతను కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. కొచ్చర్లకోట రామరాజు అతను మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశారు. ఉన్నట్టుండి అతను కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరారు. అతను తదనంతరం అతను శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డారు. అతను ప్రముఖ సంగీతకారుడు, వేణువు, వయోలిన్, వీణ విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా అతని దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.

1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య, అతను గురువు సుసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాలు సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశారు. ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.

1960లలో బాలమురళీ స్టేజిమీది ప్రవర్తన వేరుగా ఉండేది. కూర్చున్నచోటనే ఆయన నడుము పైభాగాన్ని కదిలిస్తూ, పక్క వాయిద్యాలు వాయించేవాళ్ళ వేపుకు పలకరింపుగా వంగుతూ, ఆగకుండా రుబ్బుడుపొత్రంలాగా తిరుగుతూనే ఉండేవాడు. ఆ అలవాటు క్రమంగా తగ్గడం చూశాం. అలాగే గమకాలూ, బిరకాలూ ప్రదర్శించే ఆరాటం కూడా తగ్గింది. అయితే రాగం, స్వరం, తాళం, లయ అన్నిటిమీదా ఆయనకు ఎంతో అధికారమూ, నియంత్రణా మొదటినుంచీ ఉండేవి. ఆయనను మైలు దూరానికి కూడా సమీపించగల కర్నాటక గాయకులు లేరని ఏనాడో ఋజువైపోయింది. ఆయనకు సమకాలికులం అయినందుకు మనమంతా గర్వపడవచ్చు.

1960లలో ఆయనకు వయొలిన్ వాయించిన లాల్గుడి, ఎం.ఎస్.గోపాలకృష్ణన్ ఆయనకు సహకరించిన అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులు. ఒక సందర్భంలో లాల్గుడి తనను ఎలా చిరాకు పెట్టినదీ బాలమురళిగారే చెప్పేవారు. మామూలు కీర్తన ఒకటి పాడి బాలమురళి స్వరకల్పన చేస్తున్నప్పుడు జవాబుగా ప్రతిసారీ లాల్గుడి ఒక ముక్తాయింపు వాయించసాగాడట. అతని పని పట్టాలని ఆ వెంటనే బాలమురళి కేదారంలో ‘రామా నీపై’ కీర్తనను మామూలు పద్ధతిలో కాకుండా సమంమీదనే మొదలుపెట్టారట. చివరకు స్వరకల్పనలోకూడా అదేరకంగా పాడుతున్నప్పుడు లాల్గుడి మాత్రం అలవాటు చొప్పున సమం వదిలి పల్లవి అందుకున్నాడట. దాన్ని సరిదిద్దుకోమని బాలమురళి మైకులోనే చెప్పారట. ఎం.ఎస్.గోపాలకృష్ణన్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదుగాని పరోక్షంగా బాలమురళి గురించి ఆయన చేసిన వ్యక్తిగతమైన కామెంట్లు బాలమురళిగారికి కోపం తెప్పించినట్టుగా తెలిసింది. క్రమంగా లాల్గుడి సోలోయిస్టుగానే రాణించసాగాడు. మొత్తంమీద వీరిద్దరూ బాలమురళి గారికి దూరమైపోయారు.

బాలమురళి ఛలోక్తులు కూడా బావుండేవి. ప్రముఖ మృదంగ విద్వాంసుడు టి.వి.గోపాలకృష్ణన్ కొన్నాళ్ళు గాత్రకచేరీలు కూడా చేసాడు. బాలమురళిగారి వ్యాఖ్య – ‘అతను మృదంగం వాయిస్తున్నప్పుడు మెయిన్ గాయకుడిలాగానూ, గాత్రం పాడుతున్నప్పుడు పక్కవాయిద్యగాడిలాగానూ ప్రవర్తిస్తాడు’. అలాగే ‘శంకరాభరణం సినిమా చూశారా?’ అని అడిగితే ‘చూశాను. అయితే అందులో శంకరాభరణం ఏదీ?’ అని ఎదురుప్రశ్న వేశారు. బాలమురళిని దశాబ్దాల క్రితమే గుర్తించి, గౌరవించినది లతా మంగేశ్కర్. ‘ఆవిడతో మీరెలా మాట్లాడారు?’ అని అడిగితే ఆయన ‘నేనేమో ఇంగ్లీషులో మాట్లాడతాను, అది ఆవిడ కర్థం అవుతుంది. ఆవిడ హిందీలో జవాబు చెపుతుంది, అది నా కర్థం అవుతుంది’ అన్నారు. ‘ఆవిడ తన మనసులోని భావాన్ని చెప్పదు; మన భావాల్ని మాత్రం ఇట్టే తెలుసుకుంటుంది’ అన్నారు.

పారుపల్లి రామకృష్ణయ్యగారి గురించి ‘ఆయనొక ఆదర్శగురువు, ఏదీ దాచుకోకుండా శిష్యులకు అన్నీ నేర్పబూనే గొప్ప వ్యక్తి’ అని బాలమురళి చెప్పారు. తన గురువులందర్నీ కీర్తిస్తూ కాఫీ రాగంలో ‘భావమే మహాభాగ్యముగా’ అనే మంచి పాట రాశారు. తన చిన్నప్పుడు గురువుగారి వెంట తమిళనాడు అంతా తిరిగానని అన్నారు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడట. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేదట. చిన్నవయసులో గురువుగారి వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవట. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది. ఏడు దశాబ్దాల సంగీతయాత్రలో బాలమురళి ఎందరో పెద్దవారిని కలుసుకో గలిగారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, మైసూర్ వాసుదేవాచార్య మొదలైనవారు ఆయనను మెచ్చుకున్నారు. మద్రాసులోని ఒక బాలమురళి సన్మానసభకు 90 ఏళ్ళ వయసున్న పాపనాశం శివన్, బులుసు సాంబమూర్తి రావడం విశేషం.

బాలమురళికి మొదట్లో కొంత సినిమా గ్లామర్ ఉండేది. అది క్రమంగా తగ్గిపోయింది. తాను పాడిన సినిమాపాటలను గురించి ప్రస్తావిస్తూ ఆయన ‘మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో చెపుతారు. నాకు తోచినది నేను పాడతాను. అది వాళ్ళకు నచ్చుతుంది’ అన్నారు. అదంత తేలిక విషయం కాకపోయినా సమర్థుడైన సినిమా సంగీతదర్శకుడు ప్రతిభావంతుడైన గాయకుణ్ణి బాగా ఉపయోగించుకోగలడనేది తెలిసినదే. ‘భక్త ప్రహ్లాద’లో ఆయనను పాడమని మెయ్యప్పన్ చెట్టియార్ కోరగా, నారద పాత్ర కూడా తానే వేస్తానని బాలమురళి స్వయంగా అడిగాడని అంటారు. అందులో ఆయన పాడిన మొదటి రాగమాలిక అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు; ఎస్.వి.రంగారావు (ఎస్.వి.ఆర్.) తో అన్ని సీన్లలో ధైర్యంగా పాల్గొని నటించగలగడం గొప్ప విశేషం. అప్పట్లో ఎస్.వి.ఆర్. తమని మింగేస్తాడని శివాజీ గణేశన్ అంతటి నటులు కూడా జాగ్రత్తపడేవారు. ఆ రోజుల్లో బాలమురళి ‘త్యాగయ్య’ అనే తమిళ స్టేజి నాటకంలోకూడా నటించి, పాడారు. అందులో ఆయన పాత్రోచితంగా ‘తక్కువ’ పాడడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సంగీతంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా ఆయనకున్న సంయమనం, ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం, తొణకకుండా ఉండడం వగైరాలన్నీ చాలా మెచ్చుకోదగ్గ విషయాలు. బాపు తీసిన ‘త్యాగయ్య’ కోసమని ముందు అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారట. బాలమురళిగారు తాను పాడడమే కాక త్యాగయ్యగా నటిస్తానన్నారని వినికిడి. చివరికి జే.వీ.సోమయాజులు త్యాగయ్య గా నటించి, బాలసుబ్రహ్మణ్యం పాడడం, సినిమా ఫెయిలవడం జరిగాయి. నటన మాట ఎలా ఉన్నా బాలమురళి పాడి ఉంటే త్యాగయ్యకు కొతైనా న్యాయం జరిగుండేది.

బాలమురళిని వీణ విద్వాంసుడు చిట్టిబాబు ఎంతో అభిమానించేవారు. తన పెద్దకుమారుడి ఉపనయనానికి బాలమురళి కచేరీ ఏర్పాటు చేసి, డబ్బివ్వబోతే ఆయన తీసుకోలేదట. అప్పుడు చిట్టిబాబు బలవంతాన ఒక టీవీ సెట్ కొని బహూకరించాడట. తన వీణ కచేరీ ఒకదానికి బాలమురళి హాజరైనప్పుడు చిట్టిబాబు వీణమీద బాలమురళి రాసిన బృందావని రాగంలో తిల్లానా వాయించారు. ఆ తిల్లానా చిట్టిబాబుకు చాలా ఇష్టం. ఒకసారి మ్యూజిక్ అకాడమీ కచేరీ చెయ్యబోతూ బాలమురళి తన పక్కనే కూర్చుని కాయితంమీద ఏదో రాస్తున్నారట. ఏమిటని అడిగితే ‘ఏం లేదు, ఇవాళ్టి కచేరీకని ఒక తిల్లానా రాస్తున్నాను’ అన్నారట. చిట్టిబాబు నిర్ఘాంతపోయి ‘ఇంకొన్ని నిమిషాల్లో మొదలవబోతున్న మీ కచేరీ కోసం ఇప్పుడు తిల్లానా రాస్తున్నారా?’ అని అడిగాడట. ఈ విషయం మాతో చెపుతూ చిట్టిబాబు ‘ఆయనెక్కడండీ బాబూ, మేమెవ్వరం అలాంటి సాహసం చెయ్యం’ అన్నారు. అలాగే బాలమురళి నఠభైరవి రాగంలో పాడిన ‘యామిహే’ అన్న అష్టపది చిట్టిబాబుకు చాలా ఇష్టం. అది తెలుసుకుని మేమా రికార్డు కొన్నాం. ఒక కన్నడ సినిమాలో బాలమురళి పురందరదాసు కీర్తన ‘జగదోద్ధారన’ పాడారు. అదే సినిమాలోనే కాబోలు చిట్టిబాబు విష్ణువు వీణ వాయించే వేషం వేశారట.

1973లో బాలమురళి పుట్టినరోజు సందర్భంగా మద్రాసులో నాలుగు రోజుల కచేరీ జరిగింది. అందులో ఆయన పక్కవాయిద్యాలు లేకుండా పాడారు. హిందూ దినపత్రికలో సంగీతసమీక్షలు రాసే ‘ఎన్.ఎం.ఎన్.’ ఆయనకు పెద్ద అభిమాని. శ్రుతిశుద్ధంగా, అపస్వరాలు లేకుండా, అలిసిపోకుండా ఇలా ఒంటరిగా పాడగలగడం ఆయనకే సాధ్యం అని అతను సమీక్ష రాశాడు. నాలుగో రోజు బాలమురళి కృతులను ఆయన శిష్యులంతా పాడారు. ఎన్నడూ నేర్చుకోకపోయినా, వారితో ప్రముఖ సినీగాయని పి.లీలకూడా వచ్చి కొన్ని కీర్తనలు పాడడం విశేషం. ఈ కచేరీలన్నిటినీ బాపుగారు ఆడియో స్పూల్‌ మీద రికార్డు చేశారు.

 

మద్రాసులో జరిగిన మరొక కచేరీలో త్యాగరాజు దుర్లభమైన రచనలు కొన్ని దొరికాయనీ, వాటిని ప్రసిద్ధ విద్వాంసులు పాడతారనీ ప్రకటిస్తే బాలమురళి పేరు చూసి మేము వెళ్ళాం. ఎం.ఎల్. వసంతకుమారి, తదితర గాయనీగాయకులు పాల్గొన్న ఆ కచేరీలో బాలమురళి చేత ఆఖరుకు పాడించారు. లిస్టు ప్రకారం ఆయనవంతు ముందే రావాలికదా అని నేను విసుగ్గా ఆర్గనైజర్లని అడిగాను. ‘ఇంకా నయం; ఆయన పాడేసి వెళితే చివరికి వినేవాళ్ళెవరూ మిగలరు ‘ అని వాళ్ళన్నారు. మద్రాసులో ఇదొక ఓపెన్ సీక్రెట్. ఒక దశలో సభల నిర్వాహకులందరూ బాలమురళిని బాయ్‌కాట్ చేసి బ్లాకవుట్ చేసేందుకు ప్రయత్నించారు. అరుదుగా జరిగే ఆయన కచేరీలకు జనం విరగబడి రావడం, టికెట్లు బాగా అమ్ముడుపోవడం చూశాక ఒక్కొక్కరే ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఆయన కచేరీల ద్వారా సొమ్ముచేసుకోవడం మొదలెట్టారు. త్వరలోనే ఆయనకు తిరుగులేకుండాపోయింది.

బాలమురళి వయోలా, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరనేది తెలిసినదే. ఆయన గాత్రం, వయోలా, మృదంగం మూడు ట్రాక్స్‌లో వినిపించి రిలీజ్ చేసిన ఒక ఇ.పి. రికార్డుంది. మద్రాసులో జరిగిన ఒక కచేరీలో మొదటి సగం ఆయన వయోలా, రెండో సగంలో గాత్రం వినిపించారు. రెండూ ఒకేసారి చెయ్యవచ్చుకదా అని నేనడిగితే, ‘అబ్బే కుదరదు’ అన్నారు. ఎందుకంటే, కొన్ని గమకాలు వాయించేటప్పుడు నోరు బిగించాలట; కొన్ని గమకాలు పాడేటప్పుడు చెయ్యి బిగించాలట! ఆయన వయోలా వాయిస్తున్నప్పుడు తరుచుగా కమాను కింద పెట్టేసి కుడిచేతిని తుడుచుకోవడం చూస్తే ఆయన ప్రధానంగా గాయకుడేనని తెలిసిపోతుంది.

చిన్నతనం నుంచీ గురువుగారికీ, ఇతర పెద్ద గాయకులకూ వయొలిన్, వయోలా సహకారం అందించడంతో ఆయనకు అందరి సంగతులూ తెలిసిపోయాయి. గాయకుడుగా ప్రసిద్ధుడైన తరవాత కూడా ఆయన చెంబై, సెమ్మంగుడి తదితరులకు పక్కవాద్యం వాయించారు. చెంబై తన కచేరీలో వాయిస్తున్న బాలమురళిని పొగుడుతూనే ఉన్నాడట. ఈ సందర్భంలో చిట్టిబాబు ఒక విషయం చెప్పారు. ఆయన బాలమురళిని ‘జి.ఎన్.బి. ప్లస్ మెలొడీ ఈజీక్వల్ టు బాలమురళి అంటారు; మీరేమంటారు?’ అని అడిగారట. దానికి బాలమురళి ‘అతనే నావల్ల ప్రభావితుడయాడు’ అన్నారట. ఇదెలా జరిగిందంటే, కొన్ని రోజులపాటు జరిగే సంగీత ఉత్సవాల్లో తన గాత్రకచేరీకి జి.ఎన్.బి. చాటుగా వచ్చి, నెత్తిన గుడ్డ కప్పుకుని, వెనకాల నిలబడి శ్రద్ధగా వినడం బాలమురళి చాలాసార్లు చూశారట. ఆ మర్నాడు జి.ఎన్.బి. గాత్రం, బాలమురళి వయోలా పక్కవాద్యం కచేరీలో జి.ఎన్.బి. తన శైలిని అనుకరించడం ఆయన గమనించేవారట. వయసులోనూ, ఖ్యాతిలోనూ సీనియర్ అవడంతో జీ.ఎన్.బీయే బాలమురళిని అనుకరిస్తున్నారని ఎవరూ ఊహించలేదట.

బాలమురళికి నాలుగు షడ్జమాలు సులువుగా పలుకుతాయి. గాయనుల్లో ఒక్క పర్వీన్ సుల్తానాకు మాత్రమే ఇది సాధ్యం. గాయకుల్లో బడేగులాం, అమీర్‌ఖాన్, జస్‌రాజ్ తదితరులు కూడా ఇలా పాడగలరు. బాలమురళి కచేరీల్లో మైక్ వాడుకునే పద్ధతిని చూసి ప్రస్తుతం జస్‌రాజ్ కూడా అలాగే చేస్తున్నారు. కర్నాటక విద్వాంసుల్లో ఒక్క బాలమురళినే హిందూస్తానీ గాయకులు చాలా సీరియస్‌గా పరిగణిస్తారు. ఇది తక్కిన గాయకులు ఆలోచించాల్సిన విషయం. అజయ్ చక్రవర్తి తన సంగీత పాఠశాల సిలబస్‌లో బాలమురళి రచనలను కూడా నేర్పుతారు. ముంబయిలో సురేశ్ వాడ్కర్ బాలమురళిని ఉత్తమ వాగ్గేయకారుడుగా సన్మానించాడు. ముంబయి హిందూస్తానీ సంగీత ఉత్సవాల్లో కర్నాటక విద్వాంసులు పాల్గొనడం అరుదు. కొన్ని సందర్భాల్లో బాలమురళి పాడడం, స్థానికులు విని మెచ్చుకోవడం చూశాను. ఒక కచేరీకి ప్రసిద్ధ విద్వాంసులు గంగూబాయి హానగల్, ఫిరోజ్ దస్తూర్ కూడా వచ్చారు. శివాజీ గణేశన్ తరవాత బాలమురళికి ఫ్రెంచివారు ‘షెవాలియేర్’ పురస్కారం ఇచ్చారనేది తెలిసినదే. స్విట్జర్లండ్‌లో బాలమురళి ఒక ప్రేక్షకుడు కోరినప్పుడు అప్పటికప్పుడే ఒక ఫ్రెంచి పాటకు వరస కట్టి పాడారని ఇండియా టుడేలో రాశారు. ఆయన విశేష సమయస్ఫూర్తిని అనేక సందర్భాల్లో గమనించినవారికి ఇది ఆశ్చర్యం కలిగించదు.

ఆయన చాలా ఏళ్ళకిందట పాడిన 78 ఆర్.పి.ఎం. రికార్డుల్లో ‘నీదు చరణములే’ (సింహేంద్రమధ్యమ), ‘తత్వమెరుగ’ (గరుడధ్వని) చాలా బావుంటాయి. మద్రాసు కళాక్షేత్రలో జరిగిన ఒక కచేరీలో ఆయన కాంభోజిలో తన స్వంత రచన (‘తెలుగువెలుగు కిరణాలు’) పాడుతూ, ఘనరాగాలు అనే కాన్సెప్ట్ తనకు నచ్చదని అన్నారు. ఏ రాగాన్నైనా సరే ‘ఘనంగానో’, ‘తేలికగానో’ పాడవచ్చని ఆయన ఉద్దేశం.

బాలమురళిది సంగీతంలో చాలా విశాలదృక్పథం. చిట్టిబాబునూ, ఆ తరవాత యు.శ్రీనివాస్‌నూ ఆయన మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు. రేడియోలో రకరకాల కార్యక్రమాలే కాక, టీవీలో ‘స్వరరాగసుధ’ మొదలైనవాటిలో ఆయన సినిమా పాటల ద్వారా రాగాల పరిచయానికి కూడా తోడ్పడ్డారు. ఫ్యూజన్ బృందాల్లో పాడడానికి కూడా ఆయన వెనకాడలేదు. అయితే ఆయన ఎన్ని దేశాలు తిరిగినా, రవిశంకర్ తదితరుల్లాగా ప్రేక్షకుల పరిధిని పెంచుకునే ప్రయత్నాలు చెయ్యలేదు. సంగీతంలో అత్యున్నత శిఖరాలని అందుకున్న ఈ మహాగాయకుడికి తన శక్తులను ప్రతిసారీ ‘రుజువు’ చేసుకోవలసిన అవసరం ఉండదు. ఆయన స్వరాలతో ‘ఆడుకోవడం’, గారడీలు చెయ్యడం భాష విషయంలో శ్రీశ్రీని పోలినట్టుగా ఉంటాయి.
శతాబ్దానికో, రెండు శతాబ్దాలకో ఒకసారి ఆవిర్భవించే గొప్ప విద్వాంసుల్లో బాలమురళీకృష్ణ ఒకరు. బాలమురళీకృష్ణ గారి సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి.

బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు, పురస్కారాలు లభించాయి. కర్నాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్న 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సినీ సంగీత దర్శకునిగానూ, సినీ గాయకునిగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారంతో పాటు వివిధ కళా సంస్థల నుంచి సంగీత కళానిధి, గాన కౌస్తుభగాన, కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాథ జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాథ మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలై బిరుదులు అందుకున్నారు. దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించారు. మహా గాయకుడు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నవంబర్ 22, 2016న కాలధర్మం చెందారు.

1 Comment

  1. I want good mridangam please tell me good product

Send a Comment

Your email address will not be published.