మనిషి యానం

మనిషి యానం

మనిషి పరిణామ క్రమంలో ప్రయాణికుడు. అతను సర్వ సృష్టుల ద్వారా ప్రయాణం చేస్తుంటాడు. అందుకే అన్ని సృష్టుల మకరందమూ అతని మనసుకి అంటుకునే ఉంటుంది.

మనిషి సకల సృష్టుల సారమే.

అతను ఆకాశం నుంచి వచ్చాడు. కనుక శబ్దం అతనిలో ఉండనే ఉంటుంది. ఎల్లలు లేని వాడిగా ఉంటాడు.

అతను గాలి నుంచి వచ్చాడు. స్వేచ్చగా సంచరించే వాడిగా ఉంటాడు.

అతను అగ్ని నుంచి వచ్చాడు. కనుక వెలుగు కలిగే ఉంటాడు. ఒకవేళ బోల్తా పడినా లేచి తలెత్తుకుని అగ్నిజ్వాలై కనిపిస్తాడు.

అతను నీటి నుంచి వచ్చాడు. కనుక రుచి కలిగి ఉంటాడు. లోతులను ఎరిగి పారుతుంటాడు.

అతను మట్టి నుంచి వచ్చాడు. కనుక పరిమళం కలిగి ఉంటాడు. సృష్టి కర్తగానూ ఉంటాడు.

అతను చేపగానూ ఉంటాడు. కనుక అతను నీటితో బతికేస్తాడు.

అతను ఓ చెట్టై ఉంటాడు. కనుక అతను ఎదిగిన మట్టిలో వేళ్ళూని విస్తరిస్తాడు. పూలు, పళ్ళు ఇస్తాడు.

అతను పక్షిగానూ ఉంటాడు. కనుక అతను ఎగిరే శక్తీ కలిగి ఉంటాడు.

అతను మృగంగానూ ఉంటాడు. కనుక ఆకలితో సంచరించే జీవిగానూ ఉంటాడు.

పరిపూర్ణత కోసం అతను భిన్న రూపాలు, భిన్న కోరికలూ కలిగి ఉంటాడు. అవన్నీ అతనికి దీవెనలే.

పరిణామ క్రమ సోపానాలు ఎక్కి వచ్చే మనిషి సామాన్యుడు కాదు.
అతనిపై సూర్యకిరణాలు వెలుగై వెలుగుతుంటాయి.

మేఘాలలో మెరుపులు దాగున్నట్లు అతనిలో ఆది మానవుడు దాగి ఉన్నాడు.

మనిషి ఆదిమానవుడి గర్భకోశమే. మనిషి నుంచి ఆదిమానవుడు పుడతాడు.

ఆదిమానవుడు దేవుడి అద్దం. అతను వెలుగై ఏర్పడతాడు. చీకటి అతనిని అంటదు.

ఆదిమానవుడు ప్రేమతో ఏర్పడతాడు. ప్రతీకారం అతనిని అంటదు.

ఆదిమానవుడు అందంతో ఏర్పడతాడు. అవలక్షణం అతనిని అంటదు.

ఆదిమానవుడు బలంతో ఏర్పడతాడు. అతనిని బలహీనం అంటదు.

ఆదిమానవుడు నవ్వుతో ఏర్పడతాడు. అతనిని కన్నీరు అంటదు.

అతను పొగ లేని నిప్పుగా ఉంటాడు. అతని దగ్గర భిన్నాభిప్రాయాలు పరిమళమై వ్యాపిస్తాయి.

అతను దైవత్వ జ్యోతిగా వెలుగొందుతాడు. అతను అన్ని రేఖలూ చెరిపేస్తాడు. మనిషి దగ్గర ఆదిమానవుడు నిద్రపోతుంటాడు. ప్రపంచ సమస్యలు, వేదనలు, పోరాటాలు అన్నీనూ ఆ ఆదిమానవుడి నిద్ర నుంచి లేచొచ్చి “మేల్కొల్పు గీతాలు ” ఆలపిస్తాయి. కనుక ఈ రోజు చీకటి ఎక్కువగా ఉందని దిగులుపడకూడదు. ఆందోళన చెందకూడదు. చీకటి తన వెంటే వెలుగుని తీసుకురావడంలో ఏ లోటూ చేయదు. కనుక మనం ఆ వెలుగు రేఖల్ని అందిపుచ్చుకోవడం ప్రధానం. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.