మాతృ భాషా దినోత్సవం

Telugu Bhasha Dinotsavamఅంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ప్రతీ ఏటా ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచమంతా జరుపుకుంటారు. ఆస్ట్రేలియాలో అన్ని ముఖ్య నగరాల్లో వివిధ భాషలు మాట్లాడే వారు ఊరేగింపులు జరిపి మాతృ భాషా ప్రాముఖ్యతను, ఆవశ్యకతను చర్చింటుకుంటారు.

భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్య, వ్యాపార, పర్యటన మరియు ఇతర రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్న తరుణంలో మాతృ భాష యొక్క ఆవశ్యకత మరింత సంతరించుకుంది. ఇక్కడి అన్ని రాష్ట్రాలు భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ భాగస్వామ్య వ్యాపార సంబంధాలు విస్తరించాలన్న ఆలోచనతో ఉండడం వలన బహు భాషల్లో ముఖ్యంగా భారతీయ భాషలు – హిందీ, తెలుగు, పంజాబీ, గుజరాతీ, తమిళం మొదలైన భాషల్లో ప్రావీణ్యత ఉన్నవారికి ఉద్యోగ రీత్యా మంచి అవకాశాలు ఉన్నట్లు అవగతం అవుతుంది.

ఈ మధ్య ఒక సంక్రాంతి కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక్లీ పార్లమెంట్ సభ్యుడు స్టీవ్ డిమోపోలోస్ మాతృ భాష నేర్పించడానికి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలని విక్టోరియా ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని ముందు ముందు బహు భాషలు మాట్లాడేవారు భారత ఆస్ట్రేలియా దేశాల సంబందాలు పెంపొందించడానికి ఎంతో అవసరం అని తెలుగు వారు ఈ విషయంలో అప్పుడే ముందున్నారని చెప్పారు.

ఈ మధ్యనే ‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పేరుగాంచిన మన భాష మనతోనే ఆగిపోకుండా స్థానికులకు కూడా అందివ్వాలన్న తలంపుతో విక్టోరియన్ స్కూల్ అఫ్ లాంగ్వేజ్ వారితో సంప్రదించి విక్టోరియా రాష్ట్రంలో తెలుగు భాషను అందరికీ అందుబాటులో ఉండడానికి పధకాలు రచించి వారిచ్చే సూచనల ప్రకారం ఇక్కడి తెలుగు సంఘం దరఖాస్తును తయారుచేసి వారియొక్క అనుమతిని పొందడం కూడా జరిగింది. ఇది తెలుగు భాషాభిమానులకు గొప్ప శుభవార్త. తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం. దీనివలన తెలుగు భాషను బోధనా భాషగా విక్టిరియా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం పాయింట్ కుక్ సెకండరీ కలీజీలో ఈ నెల 10వ తేదీ నుండి ప్రతీ శనివారం ఉదయం తరగతులు మొదలయ్యాయి.

ఒక సంస్కృతి మాతృ భాషతో ముడిపడి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించి పిల్లలకు భాషలోని మూల సూత్రాలు నేర్పించే ప్రయత్నం చేస్తే భాష మరింత పరిణితి చెంది ఉన్నత శిఖరాలు అధిష్టించే అవకాశం పెరుగుతుంది. ఇది అందరి భాద్యతగా గుర్తించాలి. అమ్మ భాషను ఎలుగెత్తి చాటుదాం. మన ఉనికిని మనం కాపాడుకుందాం

“దివ్యమైనది మా మాట పలుకరో నీ నోట
పరదేశీయులు కూడా కడుమేచ్చేనంట
‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పెరుగాంచెనట
అమ్మ భాషను మించినది అవనిలో లేదంట”

Send a Comment

Your email address will not be published.