రాయి అయిన దేవుడు

దేవుడికి ఓ ప్రేయసి దొరికింది. ఆమె ఒక్క ఓర చూపుకే దేవుడు బోల్తా పడ్డాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు –

“నేను సృష్టించిన వాటికన్నా ప్రేమ నాలో మరెన్నో సృష్టించింది”

ఎటు తిరిగినా దేవుడికి ప్రేయసి మొహమే కనిపిస్తోంది.

దేవుడు పాడటం మొదలుపెట్టాడు. “ఓ ప్రేయసీ…. నేను ఉన్నానో లేదో అని ప్రపంచమంతటా యుగయుగాలుగా చర్చ. ఇప్పటికీ ఒక ప్రశ్నార్ధకమే. కానీ ఓ ప్రేయసీ…నువ్వు నాలో రంగప్రవేశం చేసినప్పటినుంచి నాలో రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలా దేవుడు పాడుతుంటే దేవుడి మీద పాటలు పాడే వారందరూ ఆయన పాట విని ఆశ్చర్యపోయారు. విస్తుపోయారు.

దేవుడు ఆడటం మొదలుపెట్టాడు. భరత నాట్యం, కూచిపూడి ఇలా రకరకాల శాస్త్రీయ నృత్యాలు చేస్తున్నాడు. దేవుడిని చూసి నృత్యాలు చేసే వారందరూ ఆయన నృత్యాలకు దిగ్బ్రమ చెందారు.

దేవుడు – ప్రేయసీ మాట్లాడుకుంటున్నారు.

ప్రేయసి “నా చేతికి ఒక రుమాలు కావాలి” అని అడిగింది. దేవుడు హరివిల్లు సృష్టించాడు.

ప్రేయసి అడిగింది “నా ముఖం చూసుకోవడానికి ఒక అడ్డం కావాలి” అని. దేవుడు చందమామను పుట్టించాడు.

ప్రేయసి అడిగింది “నాకు పరిమళ భరితమైన ప్రదేశం కావాలి” అని. దేవుడు వెంటనే ఉద్యానవనం ఏర్పాటుచేశాడు. పూల మొక్కలు పుట్టించాడు.. ఎటు చూసిన పూల పరిమళమే.

ఆతర్వాత ఆమె అడగకుండానే ప్రేయసి కోసం అనేకానేకం సృష్టించడంలో దేవుడు తలమునకలయ్యాడు. ఆమెకు ఎప్పుడూ గాలి వీచేటట్లు, ఆమెకు వెలుగు కోసం సూర్యుడిని, ఆమెకు చల్లగా ఉండటానికి నీటికొలను ఏర్పాటు చేసాడు.

విమర్శకులు పగలబడి నవ్వారు. దేవుడిని విమర్శించారు. ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శకులకు సృష్టికర్త హృదయాన్ని చీల్చి చెండాడటమే పని కదా.

“దేవుడా నువ్వు వోట్టి పిచ్చివాడివి… ” అన్నారు విమర్శకులు.

దేవుడు అన్నాడు….”ప్రేమికుడు కావడానికి మొదటి అర్హత అదేమరి” అని.

ఒక రోజు దేవుడు తన ప్రేయసికి ఓ పేరు పెట్టాడు. “ప్రేమ” అని.

దేవుడి ప్రేయసి కాలక్షేపం కోసం ఒక నాటకం చూడాలని ఆశపడింది. దేవుడు బరిలోకి దిగాడు. రాముడుగా నటించాడు. జీసస్ గా నటించాడు. అల్లాగా నటించాడు. బుద్ధుడిగా నటించాడు. ప్రేయసి చప్పట్లు కొట్టి ఆనందించింది.

ఆరోజు నల్లగా తెల్లారింది దేవుడికి. అంతటా చిమ్మచీకటి. సూర్యుడు ఉదయించినా వెలుగు జాడ లేదు. విషాదం అలుముకుంది. కారణం దేవుడి ప్రేయసి హత్యకు గురైంది.

దేవుడు మృగమయ్యాడు. “ఎవరు హత్య చేసారు?” మండిపడ్డాడు. దుష్టశక్తులను నాశనం చేసాడు. చివరికి హంతకుడిని కనుక్కున్నాడు.

తాను నటించిన ఆ నాటకంలోని కథాపాత్రలే తన ప్రేయసిని హత్య చేసారు అని దేవుడు తెలుసుకున్నాడు.

అంతే దేవుడు ఆక్షణమే రాయయ్యాడు.

– తమిళంలో కవి పా విజయ్ రాసిన మాటలివి.
అనుసృజన యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.