లావోత్సు వ్యవహారం

లావోత్సు  వ్యవహారం

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన గొప్ప పుస్తకాలలో ఒకటి “తౌ తే జింగ్” దీనిని మామూలుగా అయితే తావో అంటారు.
తావో అంటే మార్గం అని అర్ధం.
చైనీయుల జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకం ఇది. దీనిని రాసిన వారు లావోత్సు.
లావోత్సు విచిత్రమైన మనిషి. ఆయన తత్వాలు కూడా వినోదమైనవి.
అందరు పిల్లలూ పుట్టగానే ఏడవడమే కదా సర్వసాధారణం.
కానీ లావోత్సు పుట్టగానే నవ్వారు.
ఆయన జీవితాంతం సాధారణమైన మనిషి అనుసరించే వాటికి భిన్నంగా వ్యవహరించేవారు. కానీ ఆయన ఓ జ్ఞానిగా ప్రసిద్ధి పొందారు.
మామూలుగా ఆలోచించే వ్యక్తికి జ్ఞానులు చెప్పే మాటలు కాస్త క్లిష్టంగా అనిపిస్తాయి.
ఆయన కాలంలో చైనా ను పాలించిన ఓ చక్రవర్తి ఆయనను ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి పిలిపించారు.
కానీ ఆయన తనకు ఆ పదవి వద్దని సున్నితంగా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణం చెప్పమని చక్రవర్తి అడిగారు. ఆయన చెప్పిన కారణానికి చక్రవర్తి విస్తుపోయారు.
లావోత్సు చెప్పిన విషయం “ప్రభుత్వానికి సంబంధించి మీ అభిప్రాయానికి, నా అభిప్రాయానికి నిచ్చెన వేసినా అందదు. నువ్వు పూర్వులు చెప్పిన మాటలను పట్టుకుని అనుసరించే మనిషివి. నేను నా మనస్సాక్షి మేరకు నడచుకునే వ్యక్తిని. నీకూ నాకూ అసలు కుదరదు. ఒక విషయానికి సంబంధించి నా అభిప్రాయం, నీ అభిప్రాయం భిన్నమైనవిగా ఉంటాయి. వాటివల్ల నీకూ నాకూ ఇద్దరికీ సమస్యే” అని.
అయితే చక్రవర్తి ఆయన మాటలకు సమ్మతించలేదు.
“మీలాంటి జ్ఞానులు నాకు దారి చూపాలి. కనుక మీరు ప్రధానిగా ఉండాలి” అని చక్రవర్తి ఒత్తిడి చేసాడు.
దానితో లావోత్సు మరోదారిలేక సరేనన్నారు.
అయితే ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన రోజే సభకు ఓ వ్యవహారం పరిష్కారం కోసం వచ్చింది.
ఆస్తిపరుడు ఒకడు “వాడు నా ఇంట్లోకొచ్చి దొంగిలించాడు. వాడిని నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను” అని చెప్పాడు ఓ మనిషిని చూపిస్తూ.
ఆ వ్యవహారాన్ని లావోత్సు విచారించారు.
ఆస్తిపరుడు చెప్పింది నిజమే అని దొంగ ఒప్పుకున్నాడు.
“దొంగకు ఆరు నెలల జైలు శిక్ష. దొంగిలించడానికి అవకాశం ఇచ్చిన ఇంటి యజమానికీ ఆరు నెలల శిక్ష ” అంటూ లావోత్సు తీర్పు చెప్పారు.
చక్రవర్తి తోపాటు అందరూ ఆయన తీర్పుకి విస్తుపోయారు.
“అదేమిటి? ఏం న్యాయం అది? నేనేం నేరం చేశాను? దొంగిలించడానికి అవకాశం ఇచ్చానని చెప్పడమే సరి కాదు. ఇది ప్రపంచంలో చాలా విచిత్రమైన విషయం” అన్నాడు ఆస్తిపరుడు.
లావోత్సు చెప్పారు –
“నువ్వు చేసిన నేరం ఏమిటో తెలుసా? ఒకడిని దొంగగా మార్చావు. అతను కడుపేదరికంతో బాధపడుతున్నాడు. ఆ పేదరికమే వాడిని దొంగతనం చేయమని ఉసిగొల్పింది. అంటే వాడి దొంగతనానికి కారణం వాడి పేదరికం. వాడి పేదరికానికి కారణం ఎవరు? నువ్వు. వీడు నీ ఇంట్లో దొంగిలించాడు. నువ్వు పలువురి ఇంట్లో దొంగిలించావు. పేదల శ్రమను నువ్వు దోచుకున్నావు. వారి చెమటను డబ్బులుగా చేసుకుని నువ్వు ధనవంతుడవయ్యావు. ఆ డబ్బును నువ్వు కూడబెట్టావు. నువ్వు రెండు తప్పులు చేసావు. ఒకటి ఇతరుల శ్రమను దోచడం. మరొకటి మంచివాడిని దొంగగా మారడానికి రెచ్చగొట్టావు. నువ్వే పెద్ద దొంగవు. నువ్వే పెద్ద నేరస్తుడివి. న్యాయంగా చూస్తే నీకు ఎక్కువ శిక్ష వెయ్యాలి. కానీ నేను కరుణ చూపించాను. అందుకే నీకు శిక్ష తగ్గించాను” అని లావోత్సు చెప్పగానే ఆస్తిపరుడు కంగుతిన్నాడు.
చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మో ఇలాంటి వ్యక్తులతో కష్టమని ఎంచిన చక్రవర్తి లావోత్సుని ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించాడు. లావోత్సు అమ్మయ్య అనుకుని బయటకు వచ్చేసారు.
– సుమా హరి

Send a Comment

Your email address will not be published.