లిటిల్ వండర్ అక్షర

యద్య దాచరతి శ్రేష్ఠః |
త త్త దేవేతరో జనః ||
సయత్ ప్రమాణం కురుతే |
లోక స్త దనువర్తతే ||

భావం : లోకంలో ఉత్తమ వ్యక్తి ఎలా నడచుచున్నాడో ఇతర జనులున్నూ ఆ విధముగానే నడుస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో దానిని లోకము కూడా అనుసరిస్తూ నడుస్తుంది.
– భగవద్గీత

Aksharaఅమ్మ ఒడి ఇంకా వీడనేలేదు. నాన్న బడి ఇంకా చేరనేలేదు. బయటి ప్రపంచంపై ఒక అవగాహన లేదు. పట్టుమని ఏడేళ్ళు కూడా నిండలేదు. కలలు కనటానికి వయసు సరిపోదు. కమ్మని తెలుగింటి వంటలు చేయకపోతే కంటికి కునుకు రాదు.

‘కరోనా’ కరుణించింది. ఖాళీ సమయంలో ఏదైనా చేయాలనిపించింది. తండ్రి సువాసనలకు పరీ(ర)క్షించుకోవాలని అనుకుంది. పరంపరను కొనసాగించాలనుకుంటుంది. ‘నలభీమ’ అవతారం నవీనరీతిలో ఎత్తాలనిపించింది. తానే కేంద్ర బిందువై శ్రీకారం చుట్టింది. తెలుగుదనానికి నిట్టనిలువుటద్దంలా రూపు దిద్దుకుంటోంది.

నష్టంలో లాభాన్ని చూసేవాళ్ళ ఆలోచనా ధోరణి వేరు. గడ్డుకాలం మనకి అడ్డం ఏమిటీ అనుకుంటే క్రొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టొచ్చు. అందరూ కష్టాల్లో ఉన్నారు అనుకొని మనమేమీ చేయలేము అనుకుంటే ముందుకెళ్ళే అవకాశమే లేదు.

ఆస్ట్రేలియాలో ‘దోసా హట్’ అన్న పేరు విననివారుండరు. ఇప్పుడు ఎల్లలు దాటి ఇతర దేశాలలో కూడా తన ఉనికిని చాటుకుంటుంది. దోసా హట్ అధినేత శ్రీ అనిల్ కుమార్ కర్పూరపు గారి జ్యేష్ఠ పుత్రిక అక్షర తండ్రి అడుగుజాడల్లో పావులు కదుపుతోంది. వ్యాపారంలో మెళుకువలు నేర్చుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం తెలుగు వంటలపై దృష్టి సారించి చిన చిన్న వంటకాలు ఎలా చేయాలో స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ (Ashu’s Lil World) సృష్టించుకొని అందరికీ చేసి చూపిస్తుంది. కనుమరుగౌతున్న తెలుగు వంటలు మన దగ్గరకు తీసుకువస్తుంది.

ప్రవాసంలో పుట్టి పర సంస్కృతితో సహజీవనం చేస్తూ ‘మన’ సంస్కృతిపై మక్కువ పెంచుకొని మన పండగలకు కావలసిన వంటకాలతో తన కార్యక్రమాలు భావితరాలకు అందివ్వడానికి కృషి చేస్తుంది.

కొన్ని మచ్చుతునకలు:
Sweet Pongal: https://youtu.be/6u2iW1Ivo8M
Paanakam: https://www.youtube.com/channel/UCFMiwZwY6eSFOFMndiPV2yg

దోస సంస్కృతిని ఆస్ట్రేలియాకి పరిచయం చేయడంలో కృతకృత్యులైన శ్రీ అనిల్ మరియు శ్రీ ప్రవీణ్ మన సంస్కృతీ సాంప్రదాయాలను కూడా మరో రూపంలో భావి తరాలకు అందివ్వాలన్న సంకల్పంతో ప్రస్తుతం దృష్టి సారించారు. వారి పిల్లలకు సన్మార్గంలో నడిపిస్తూ వారివురు చేపట్టిన బాటనే ఎంచుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతైనా తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేయడం, భాష-సంస్కృతి పట్ల గౌరవ భావాలు పెంపొందించడం – ఇవన్నీ పిల్లల పెంపకంలో మెళుకువలే కదా!. పరిమళించే పూవు వాసనపై చెట్టు ప్రభావం ఉండకపోవచ్చు, కానీ చెట్టు లేకుండా పూవు ఉండదు కదా!

చిరంజీవి అక్షర వంటల యజ్ఞంలో విజయం సాధించి మనందరికీ కనుమరుగౌతున్న తెలుగు వంటకాలు వెలుగులోకి తీసుకురాగలదని అశీర్వదిద్దాం.

Send a Comment

Your email address will not be published.