వికసించిన సైకత కళ

1-TP Mishra

వంశ‌ధార తీరంలో వికసించిన సైకత కళ

ఏ కళ అయినా కేవలం జీవనోపాధికి మాత్రమే పరిమితం కాకూడదు. దానికి విస్తృత సామాజిక ప్రయోజనం ఉండాలి. అతడు తన జీవికకూ, ఆశయానికీ సైకత శిల్పాలను సృజించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అందుకు వంశధార నదీ తీరాన్నే వేదికగా చేసుకున్నాడు. అలా పుష్కర కాలంగా మొదలైన అతని సైకత శిల్పకళా నైపుణ్యం దేశంలోనే పేరెన్నికగన్న కళాకారుల్లో ఒకరిగా నిలిపింది. అతనే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైకత శిల్ప కళాకారుడు తరణీ ప్రసాద్‌ మిశ్రో. సైకత శిల్పకళలో మిశ్రో ‘జీవన’ ప్రస్థానం ఆయన మాటల్లోనే…..

ఆంధ్ర రాష్ట్రానికి ఈ కొసనున్న శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీనర్సుపేట మా ఊరు. నేను సైకత శిల్ప కళాకారుడిగా ఎదగడం ఒక్కరోజులో జరిగేపనీ కాదు. కుటుంబపరంగా ఎన్నో కష్టాల్ని అధిగమించి, నాదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ జీవన సమరం చేస్తున్నాను. కళని ఒక సాధనంగా మలచుకుని, ముందుకు కొనసాగుతున్నాను.

మాది అతి సాధారణమైన కుటుంబం. సైన్స్‌ గ్రూపుతో 1997లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినా.. ఆర్థిక ఇబ్బందులతో ఆపై చదవలేకపోయా. నాన్న కాశీవిశ్వనాథ్‌కు మానసిక ఆరోగ్యం బాగోదు. దాంతో ఆయన చికిత్సకే ఉన్న నాలుగెకరాలూ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పటికి వయస్సులో చిన్నవాడినైనా తప్పనిసరై, ఉద్యోగాల వేటలో పడ్డాను. ఉద్యోగం రాలేదు. ఓవైపు నాన్న అనారోగ్యం, మరోవైపు కుటుంబపోషణ ఓ సవాల్‌గా మారాయి. అప్పటికే చిత్రలేఖనంలో కొంత ప్రవేశం ఉన్నా, దానివల్ల పెద్దగా లాభం లేకపోయింది. చేసేది లేక ఉపాధి కోసం విశాఖకి వలసపోయాను. అక్కడే ఆటోమొబైల్‌ గ్యారేజ్‌లో పెయింటర్‌గా మొదట జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కాంట్రాక్టర్‌ దగ్గర వెల్డర్‌గా కొంతకాలం పనిచేశాను. ఎంత కష్టపడినా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దాంతో కష్టాలూ ఎటూ తప్పవని అర్థమై, తిరిగి 2004లో సొంతూరుకు వచ్చేశాను. స్థానికంగా ఒక డ్రాయింగ్‌ టీచర్‌ దగ్గర చిత్రలేఖనంలో మెలకువలు తెలుసుకున్నా. బ్యానర్లు రాసుకుంటూ, పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని.

పూరీలో మలుపు తిరిగింది
sand-sculpturesపక్కనే ఉన్న ఒడిసా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ యాత్రకు మా కుటుంబసభ్యులతో కలసి వెళ్లా. అక్కడ సముద్రతీరంలో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది. అది ఒక మహిళ సైకత శిల్పం. అది నాకు ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పుడే నేనూ సైకత శిల్పాలు రూపొందించాలనే నిర్ణయానికొచ్చాను. ఊరికి తిరిగొచ్చాక వంశధార నదీ తీరాన్ని అభ్యాసానకి వేదికగా చేసుకున్నాను. కొన్నినెలలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాకు నేనే గురువుగా భావించుకున్నా. నా ఊహలకు, ఆలోచనలకు రూపాల్ని ఇచ్చేవాడిని. అలా ఏకాగ్రతతో నేను చేసిన సాధన ఫలితమే నన్నీరోజు ఓ సైకత శిల్పికారుడిగా తీర్చిదిద్దింది. బ్రెజిల్‌ దేశానికి చెందిన సైకత శిల్పి అండ్రియన్‌ వజస్కీ కృషిని మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఆయన గురించి వివరాలు సేకరించి, కొత్త అధ్యయనం చేశాను. వివిధ దేశాల్లోని సైకత శిల్పాలపై ఇంటర్నెట్‌ సాయంతో పరిశీలన చేశాను. వాటిని భారతీయ సంస్కృతికి అన్వయిస్తూ, విభిన్నమైన శైలితో రూపకల్పన చేయాలని అనుకున్నా. ఆ క్రమంలో అలాంటి సైకత శిల్పిగా గుర్తింపునూ పొందాను.

కుటుంబ ప్రోత్సాహంతో
నా కళను అన్ని వేళలా కుటుంబసభ్యులు ప్రోత్సాహించడం జరుగుతోంది. ఈ కళతో కొంత ఆదాయం రావడం వల్ల డిగ్రీ పూర్తిచేశాను. నాన్న మరణించారు. ప్రస్తుతం నా కుటుంబం అమ్మ వసంతకుమారి, భార్య భారతి, ఇద్దరు పిల్లలు. వీరిని పోషించడమే నా ప్రధాన కర్తవ్యం. అందుకు ఈ కళే నాకు ప్రధానమైన ఉపాధి కూడా. కేవలం మా గ్రామం దగ్గరున్న నదీతీరమే నా సైకత శిల్పాలకు పరిమితం కాదు. జనావాసాల్లోనూ సైకత శిల్పాలు రూపొందిస్తుంటాను. పలుచోట్ల పెళ్లిళ్లు, వివిధ కంపెనీలు, సంస్థల ప్రమోటింగ్‌ ఈవెంట్లకూ లోగోలు, సృజనాత్మకమైన సైకత శిల్పాల్ని రూపొందింస్తుంటాను. సామాజికాంశాలతో ఉన్న వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక రోజుల్నీ శిల్పాలుగా మలుస్తాను. అవి నాకు ప్రముఖ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి.

కళాత్మక విలువలతో
సైకత శిల్పాల్ని కొంతమంది ఔత్సాహికులు తయారుచేస్తున్నారు. అయితే కళాత్మక విలువలు కలిగిన వాటికే మంచి గుర్తింపు. 5 TP Mishraఒక్కో సైకత శిల్పం తయారీకి దాని పరిమాణాన్ని, విన్యాసాల్ని అనుసరించి నాలుగు గంటల నుంచి 36 గంటల వరకూ సమయం పడుతుంది. అతి తక్కువ సంభావ్యత గల వాలు తలంలో శిల్పాన్ని రూపొందించాలి. అవసరమైన చోట చిన్న చిన్న రంధ్రాలు కూడా చేస్తాను. శిల్పం కంటే వర్ణానికి ప్రాముఖ్యత ఉన్నచోట మాత్రమే రంగులు వాడతాను. ఈ సైకత శిల్పాన్ని భద్రంగా కాపాడగలిగితే ఎనిమిది రోజుల వరకూ అలానే ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటివి 400కి పైనే రూపొందించాను.

సందేశాలిచ్చే శిల్పాలు
ఏ ఊరు వెళ్లినా ఆ ఊరిలోని ప్రధానమైన సామాజిక రుగ్మత ఏదో గుర్తిస్తాను. దాని నుంచి బయటపడడానికి, అక్కడివారు చైతన్యం పొందేలా సందేశాలు రాస్తూ, సైకత శిల్పాన్ని రూపొందించడం నాకున్న ఒక అలవాటు. నూతన సంవత్సరం, రిపబ్లిక్‌ డే, ఉగాది, మహిళా దినోత్సవం, సంక్రాంతి, దసరా, దీపావళి, అక్షరాస్యతా దినోత్సవం, ఆగస్టు పదిహేను, కొత్త సంవత్సరాది వేడుకలు ఇలా ఏ సందర్భం వచ్చినా వెంటనే స్పందించి దాని సందేశాన్ని సైకత శిల్పం ద్వారా ప్రజలకు వివరిస్తాన. క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ గతంలో 200 పరుగుల నాటౌట్‌ రికార్డును సాధించిన సందర్భంలోనూ సైకత శిల్పం ద్వారా ప్రజలకు తెలియజేశాను. అది అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా రూపొందించిన సైకత శిల్పమూ ఎంతగానో ఆలోచింపజేసింది.

అక్షరాస్యతా ఉద్యమం, వయోజన విద్య, సంక్షేమ పథకాలు, బహుళార్థక ప్రాజెక్టులు, వందేమాతరం, వివిధ రకాల దేవుళ్ల సైకత శిల్పాలు, గాంధీ, అబ్దుల్‌ కలామ్‌ తదితర ప్రముఖులు… ఇలా నేను రూపొందించిన సైకత శిల్పాలు వంశధార నదీ తీరానికి వచ్చే సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టునేవి. ఈ సైకత శిల్పాల్ని చూసేందుకు ఒడిసా, ఉత్తరాంధ్ర జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో వివాహాలు, ఇతర శుభ కార్యాలకు వివిధ వర్గాల వారు ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, సందర్భానికి తగిన విధంగా అక్కడికక్కడే సైకత శిల్పాల్ని తయారు చేయించుకుంటుంటారు. దీనివల్ల నాకు ఆర్థికంగా ప్రయోజనం కలగడమే కాకుండా, వ్యక్తిగతంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

3 TP Mishra

జాతీయ స్థాయిలో
ఢిల్లీలోని ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ పేరుతో ఉన్న థీమ్‌ పార్కులో మూడు సైకత శిల్పాల్ని ఏర్పాటు చేయడానికి ఆరేళ్ల కిందట పార్క్‌4-T P Mishra నిర్వాహకులు నాతో ఒప్పందం చేసుకుని రూ.25 వేలు పారితోషికంగా ఇచ్చారు. అప్పటి నుంచీ అవసరమైనవారికి వారు కోరిన విధంగా సైకత శిల్పాల్ని రూపొందించి, అందిస్తుండడంతో జాతీయ స్థాయిలోనూ నా శిల్పాలకు మంచి గుర్తింపు లభిస్తోంది. దేశంలో న్యూ ఢిల్లీ, ముంబయి, పూనె, గోవా, హైదరాబాద్‌, అలంపూర్‌, పర్లాకిమిడి, మన ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల సైకత శిల్పాలను రూపొందించాను. సైకత శిల్పాల ప్రదర్శనలు కూడా నిర్వహించాను.

వారం ఉంటే గొప్పే
సైకత శిల్పాల జీవితకాలం చాలా తక్కువ అయినప్పటికీ ఎంతో శ్రద్ధతో రూపొందించాలి. తగిన విధమైన ఇసుక, తేమ వంటివి అనుకూలంగా లేకపోతే వీటిని రూపొందించడం కష్టమే. అంతేకాదు వారం వ్యవధి దాటి అవి అలాగే ఉంటే, ఎంతో గొప్ప విషయం. నీటి ప్రవాహం వల్ల, తీవ్రమైన ఎండ వల్ల, పిల్లలు తొక్కి పాడుచేయడం వల్ల రూపురేఖలు మారి, మళ్లీ ఇసుకలో కలిసిపోతాయి. అప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది. కానీ తప్పదు. ఈ కళే మా కుటుంబానికి ఉపాధిని అందిస్తోంది.
————————

Send a Comment

Your email address will not be published.