శివోహం...!

శివోహం...!

ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చే మహా శివరాత్రి.. శివునికి అత్యంత ఇష్టమైనది. సృష్టి, స్థితి, లయల్లో.. లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదన్న సామెత ఉంది. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా అంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా ఏం తినకుండా.. రాత్రి కూడా నిద్ర పోకుండా భక్తులు శివుడిని కొలుస్తారు. అయితే, ఈ రోజున శివుడిని ఎలా కొలవాలి. ఎలా పూజ చేయాలి.. తదితర నియమాలు తెలుసుకోవాల్సిందే.

అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి. ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు. జాగారం ఎందుకు చేస్తారు. జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.

అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.

క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500–1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్‌ ఫ్లడ్‌ వంటి చరిత్రకారుల అంచనా.

శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి.. దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతుంటారు. మహా శివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించడం వంటివి చేయనే కూడదు. ఓం నమ: శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది.

శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంత శ్రేష్టమైంది. శివరాత్రి ఉదయం యథాతథంగా నిత్యకృత్యాలు చేయాలి. రోజూ చేసే పూజను చేస్తూనే సంధ్యావందనాలు చేయాలి. శివార్చన చేయాలి.. పూజాగదిలో తడిబట్టలు వదిలి పొడిబట్టలు వేసుకుని శివుడిని పెట్టే స్థలంలో అష్టదళాన్ని పెట్టి దాని ఎదురుగా నందిని పెట్టాలి. శివ పరివాహాన్ని ఆవాహన చేసి పూజ చేయాలి. ఈ రోజు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ||

అంటూ బిల్వార్చన చేయాలి. ఉదయం పూజ చేసి, మధ్యాహ్నాం, సాయంత్రం మరోసారి పూజ చేసి అర్ధరాత్రి వరకైనా అభిషేకం చేయాలి.

శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే వుంటుంది. అందుకే భక్తజనులందరూ ఈ రాత్రి పూట భజనలు- పురాణ కాలక్షేపం- లేదంటే శివనామస్మరణతో గడుపుతారు. కొందురు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ‘ఓం నమ: శివాయ’ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిజాముకి పూజ, అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు తీర్చుకొని, సంధ్యావందనం చేసి పుష్పాలు, అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి.

ఉపవాసాల్లో విధానాలు:
రోజంతా ఉపవాసం వుండి ఆ మరునాటి ఉదయం భోం చేయడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.

మహా శివరాత్రి మహత్యం:
దేవతలు, రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికే సమయంలో అందులో నుండి తొలుత కామధేనువు వచ్చింది. అది వశిష్టుడికి ఇచ్చారు. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది. దానిని దేవేంద్రుడు తీసుకున్నాడు. మరోసారి చింతామణి పీఠం వచ్చింది. దాన్ని కూడా దేవేంద్రుడే తీసుకున్నాడు. మరోసారి చంద్రుడు వచ్చాడు. ఆకాశానికి పంపించేశారు. ఆ తర్వాత మదనం చేయగా విషం వచ్చింది. దీన్ని చూసి భయపడ్డ దేవతలు లోకాన్ని కాపాడాలని శివుడిని వేడుకుంటారట. దాంతో మహా శివుడు వెంటనే(మహాశివరాత్రి రోజున) ఆ విషాన్ని మింగేస్తాడట. కడుపులోకి మింగకుండా కంఠంలోనే ఉంచుతాడు. దాంతో ఆయన కంఠం నీలంగా మారిపోయిందని, అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. విషాన్ని మింగి లోకాన్ని కాపాడినందున.. ఆ రోజు శివుడిని ఆరాధించి, అభిషేకించి విషం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి స్వాంతన చేకూర్చి.. పరమేశ్వరుడి ఆశీస్సులు పొందవచ్చని వివరిస్తున్నాయి.

అంతేకాదు.. శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు. శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే.. అందుకు బ్రహ్మ, విష్ణువుల మధ్య వచ్చిన తగవు కారణం అని చెబుతోంది శివపురాణం. బ్రహ్మ – విష్ణువుల మధ్య వచ్చిన ఆధిపత్య సమస్యను తీర్చడంలో భాగంగా శివుడు అగ్ని స్థంభంగా ఆవిర్భవిస్తాడట. దాని ఆది, అంతములు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని అంటాడట. అగ్ని స్థంభం మొదలు చూడ్డానికి బ్రహ్మ.. అంతం చూడ్డానికి విష్ణువు బయలు దేరుతారు. అంతం కనుగొన లేక పోయిన విష్ణువు వెనుదిరగగా.. దారి మధ్యలో కనిపించిన కామధేనువు, మొగలిపువ్వును చూసి.. బ్రహ్మ తాను మొదలు కనుక్కున్నానని అంటాడట. కానీ అది నిజం కాదు. తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలందుతాయని వరమిస్తాడట శివుడు.

అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పూవు పూజార్హం కానిదని, కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు పరమేశ్వరుడు. అంతే కాదు అబద్ధం చెప్పిన బ్రహ్మ ముఖాన్ని కత్తిరిస్తాడు. ఇలా శివ లింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ దాగి వుంది. అందుకే మహా శివరాత్రికి ఎంతో విలువనిస్తారు హైందవులు.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్త్ర || ………

అంటూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే సకల రోగబాధలూ తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని చెబుతారు. ఇలా శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన- ఉపవాస- అభిషేక- అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం.

Send a Comment

Your email address will not be published.