శ్రీలంకలో పుట్టి తెలుగు చిత్రసీమలో రాణించిన సుజాత

శ్రీలంకలో పుట్టి తెలుగు చిత్రసీమలో రాణించిన సుజాత
– ఈ నెల 6 సినీనటి సుజాత వర్థంతి

sujathaసుజాత తెలుగు చిత్రసీమలో చెరగని గోరింటాకు. ఆమె 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, మలయాళం, తమిళం సినిమాల్లో ఆమె నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, రంగనాథ్, కమలహాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆమె 1967లో తబస్విని సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె తొలి తెలుగు సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన గోరింటాకు. గోరింటాకు, సంధ్య, సుజాత వంటి సినిమాలు హిట్ కావడంతో ఆమె తెలుగు సినీరంగానికే పరిమితమయ్యారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకున్నారు. గుప్పెడు మనసు, ఏడంతస్థుల మేడ, సర్కస్ రాముడు, గురుశిష్యులు, బంగారు కానుక, శ్రీరామదాసు, ప్రేమతరంగాలు, సూత్రధారులు, పుసుపు పారాణి వంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగుకు సంబంధించిన మహిళగా ఆమె గుర్తింపు పొందారు. సుజాత 1952 డిసెంబర్ 10వ తేదీన శ్రీలంకలో పుట్టారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో ఉండడంతో ఆమె 8వ తరగతి వరకు శ్రీలంకలోనే చదివింది. ఆ తర్వాత తండ్రితో పాటు కేరళకు వచ్చేశారు. దాంతో చదువు సాగలేదు. అన్న ప్రోత్సాహంతో పలు నాటకాల్లో నటించారు. ఆ నటనానుభవంతోనే ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. 1997లో ఆమెకు సహాయనటిగా నంది అవార్డు లభించింది. తెలుగులో ఆమె తల్లి పాత్రలు కూడా వేశారు. ఆమె కలైమామణి బిరుదు కూడా అందుకున్నారు. ఆమె చెన్నైలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుజాత ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించారు.

సుజాత నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా మన్ననలు అందుకున్నారు. ఆమె వ్యక్తిత్వంపై ఏ విధమైన మచ్చ లేదు. ఆమె పరాయి Actress Sujathaభాషా నటి అనే స్పృహ తెలుగు ప్రేక్షకులకు లేరు. అంతగా తెలుగు ప్రజలను ఆమె ఆకట్టుకున్నారు. తెలుగులో ఆమె బలమైన పాత్రలను మాత్రమే ఎంచుకున్నారు. హీరో పక్కన రక్తమాంసాలు లేని హీరోయిన్ పాత్రలు ఆమె పోషించలేదు. సినిమాలో హీరోతో పాటు ఆమె పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉండేది. గోరింటాకు చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల కుటుంబ సభ్యురాలిగా మారిపోయారంటే ఆశ్చర్యం లేదు. గోరింటాకు చిత్రంలో హీరోయిన్‌గా ఆమె తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారో వెంకటేష్ చంటి సినిమాలో తల్లి పాత్రలోనూ అంతే ఆకట్టుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు సరసన ఆమె ఎక్కువగా నటించారు. దాసరి నారాయణ రావు సరసన ఎమ్మెల్యే ఏడుకొండలు వంటి చిత్రాల్లో ఆమె నటించారు. భాష రాదనే ఉద్దేశంతో సుజాత తెలుగులో నటించడానికి అంగీకరించలేదు. అయితే, రచయిత్రి కె. రామలక్ష్మి ఒత్తిడి చేయడంతో ఆమె గోరింటాకు చిత్రంలో నటించడానికి అంగీకరించారు. భాష రాకపోవడంతో ఓ పెద్ద డైలాగ్ చెప్పడానికి సుజాత 16 టేకులు తీసుకుంది. దీంతో భాష రాకపోతే ఈ బాధ తప్పదని ఆమె తెలుగు భాష నేర్చుకున్నారు. గోరింటాకు చిత్రంలో సుజాతకు సరిత డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత స్వయంగా ఆమె డబ్బింగ్ చెబుకున్నారు.

Sujataశ్రీలంకలో పుట్టి సొంత రాష్ట్రం కేరళకు చేరుకున్న సుజాత తమిళం, మలయాళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు త్యాగం, మంచితనం మూర్తీభవించిన పాత్రలను ఎక్కువగా పోషించారు. సుజాత క్రమశిక్షణ గల నటి. షూటింగుకు కూడా తన వాహనంలోనే వచ్చేవారంటే ఆమె ఎంతటి వ్యక్తిత్వం గల నటో చెప్పుకోవచ్చు. సహజ నటిగా పేరు పొందిన జయసుధ అసలు పేరు సుజాత. జయసుధ సినీ రంగ ప్రవేశం చేసేనాటికే సుజాతకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో సుజాత తన పేరును జయసుధగా మార్చుకోవాల్సి వచ్చింది. జయసుధ మొదటి సినిమా టైటిళ్లలో సుజాత అనే వేశారు. అంతగా సుజాత సినీ రంగంలో స్థిరపడిపోయారు. సినిమాల్లోని పాత్రలకు సుజాత జీవం పోశారు. సుజాత నటించిన పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ కదులాడుతాయి. సుజాత తన 58వ ఏట 06ఏప్రిల్ 2011న గుండెపోటుతో మరణించారు.

Send a Comment

Your email address will not be published.