శ్రీ సూర్యం ప్రణమామ్యహం!!

శ్రీ సూర్యం ప్రణమామ్యహం!!

ఈ నెల 19 సూర్యజయంతి (రథసప్తమి)

శ్రీ సూర్యనారాయణుడు కనిపించే ఏకైక దైవం… సమయ పాలనా చక్రవర్తి… ఆరోగ్యదాత… అభయప్రదాత… అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. భాస్కరుడు ప్రసరించే సహస్ర కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడు తాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహే శ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయం కాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ప్రత్యక్షదైవం. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం…

సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడు కర్మసాక్షి. మాఘశుక్ల సప్తమి నాడు తొలిసారిగా ఈ భూమికి కనిపించి రథమెక్కాడట భాస్కరుడు. ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి. అందుకే రథసప్తమి అయిందని పురాణాలు అంటున్నాయి. సూర్యు డు ఆధ్యాత్మిక విశేషమే కాదు… భౌతిక, ఖగోళ, శారీరక ప్రాముఖ్యం కలిగిన గ్రహనాయకుడు కూడా. సమస్త మాన వాళి ఆరోగ్యం- భాస్కర ప్రసాదంగా చెబుతారు. విదేశీయు లు కూడా సూర్యస్నానం చేసేది అందుకే. ఉదయకాలం పూట కాసేపు సూర్యకాంతికి ఎదురునిలచోవడంలో అంత రార్ధం ఆరోగ్యసూత్రమే. మన సంప్రదాయాల్లోని సంధ్యా వందన నియమం అందుకేనని అంటారు.

ఆయా సమ యాల్లో సూర్యకిరణాలు ఆరోగ్యాన్నందించేవిగా భావించడం వల్లే… సంధ్యావందన నియమాన్ని విధిగా ఆచరించ మని చెబుతోంది భారతీయశాస్త్రం. రథసప్తమి రోజున సూ ర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి పో యి పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సుర్యుని గమనం ఏడు గుర్రాలు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదం ‘హిరణ్యయేన సవితారథేన’ అని తెలు పుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణా యనం అని రెండు విధాలుగా ఉంటుంది. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం.

సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూ ర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకం రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. ‘భా’ అంటే సూర్యకాంతి, ‘రతి’ అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీ యులు. ‘భారతీ’ అంటే వేదమాత. వేదమాత నారా ధించువారు కూడా భారతీయులే.

అరసవల్లి ఆదిత్యుడు…
అజ్ఞాన తిమిరాన్ని కోటికోట్ల అరుణ కిరణాలతో చెల్లాచెదురు చేసి సమస్త జీవరాసులను మేల్కొలిపే ఆదిదేవుడు ఆదిత్యుడు. అటువంటి సూర్యభగవానుడు మూర్తీభవించిన దైవంగా శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో నిత్యారాధనలు జరిగే ఏకైక సూర్యదేవాలయం ఇదొక్కటి మాత్రమే కావడం ఈ ఆలయ విశిష్టతను చాటి చెబుతోంది. ఆరోగ్య ప్రదాతగా నిలచిన ఆదిత్యుని జయంతి రథసప్తమినాడే జరుగుతుంది.

చరిత్ర పుటల్లో అరసవల్లి…
చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

ఆలయ నిర్మాణం జరిగిందిలా…

అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధా నిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంధం దొరికిందని, అందులో సూర్యదేవుని పూ జా విధానాలు ఉన్నాయని వారు మహరాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది. వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాం తంలోని ఆలయాలను సంరక్షించారు. క్రీస్తు శకం 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయా త్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. ఆ తరువాత ఏ ప్రాముఖ్యతా లేని ఈ ఆలయాన్ని 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు పునరుద్దరించారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం అలుదు నివాసి వరుదు బాబ్జీరావు ఆదిత్య ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

స్థల పురాణం…
ప్రాచీన చరిత్రలో విశిష్టతకు చిరునామాగా నిలిచిన సూర్యనారాయణస్వామి ఆలయానికి దేశంలోని అన్ని ఆలయాల వలే స్థల పురాణం కూడా వుంది. స్థల పురాణాలకు వేదికైన స్కంధ పురాణాలలో ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించినట్టు చెబుతారు. ఆయన తన వజ్రాయుధంతో తవ్విన చెరువునే ఇంద్రపుష్కరిణిగా పిలుస్తారు. ఆ చెరువులో దొరికిన సూర్యభగవానుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారని స్కంధ పురాణం చెబుతోంది. నాగావళి నదీ తీరంలో బలరాముడు ప్రతిష్టించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించడానికి దేవేంద్రుడు రాగా, తన అనుమతి లేకుండా అతడు వచ్చినందుకు నంది కాళ్లతో తన్నిందని, దాంతో దేవేంద్రుడు అరసవల్లిలో పడ్డాడని అంటారు. నంది ఇచ్చిన శాపవిమోచనం కోసం దేవేంద్రుడు అరసవల్లిలో ఆలయ నిర్మించాడని మరో కథనం ప్రచారంలో వుంది.

సూర్యజయంతే రథసప్తమి…
సూర్యుడు మకరరాశిలోని ప్రవేశించిన తరువాత మాఘమాస శుద్దసప్తమిని రథసప్తమిగా పేర్కొంటారు. ఈ సప్తమి రోజు సౌరకుటుంబానికి కేంద్రమైన సూర్యుడు ఉద్భవించినట్టు చెబుతారు. సూర్యోదయాన్నే… ‘సప్తసప్తమహాసప్త’ శ్లోకాన్ని జపిస్తూ స్నాన మాచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెబుతున్నారు. ఇంద్ర పుష్కరణిలో భక్తులు తలపై జిల్లేడు ఆకులు, రేగుపండ్లు, నువ్వులు పోసుకోని మూడుసార్లు అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తే పునర్జన్మ వుండదని అనాదిగా వస్తున్న నమ్మకం. రథసప్తమి రోజున స్ర్తీ సాంగత్యాన్ని, తైలం, మాంసాహారాన్ని ఎవరు త్యజిస్తారో వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుందని చెబుతారు. స్వామి నిజరూప దర్శన పూజలతో భక్తులకు నవగ్రహ దోష నివృత్తి జరిగి ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం. అందువల్లే రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు సూర్యదర్శనం కోసం తరలివస్తారు.

రథసప్తమి పూజలిలా
అరసవల్లిలో వెలసిన ఆదిత్యుని సన్నిధిలో రథసప్తమి రోజు ఉదయం మహా అభిషేక సేవ, పంచామృతాలు, సుగంద ద్రవ్యాలతో మూలవిరాట్‌కి మహా అభిషేకం జరుగుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం వల్ల ఈ జన్మలో జన్మంతరాలలో మాటలు, చేతలు, దృష్టిదోషం వల్ల చేసిన పాపాలు, ఏడు జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. భక్తులకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో మట్టిపొయ్యి మీద బియ్యం, పాలు, పంచదార లేదా బెల్లంతో తయారుచేసిన క్షీరాన్నాన్ని వండాలి. పందిరి చిక్కుడు ఆకుల మీదగాని తెల్ల జిల్లేడు ఆకుల మీదగాని ఆ క్షీరాన్నాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యం పెట్టాలి.

ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. సూర్యజయంతి రోజున ఎర్ర చందనం (రక్తచందనం) అష్టదళ పద్మం వేసి (8 ఆకులమీద) సూర్యనారాయణ స్వామిని ఆవాహనం చేసి ఉపచార పూజలు చేయాలి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని పద్మ, బ్రహ్మ పురాణం, సౌరపురాణాలు చెబుతున్నాయి.

ఆదిత్యునికి నామాలెన్నో…
‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అని మాతృ పురాణం లో, ‘దివే శం సుఖార్ణ’ అని స్కందపురాణంలో, ‘తేజ స్నామో విభా వసు’ అని శ్రీమద్భాగవతంలో, ‘ఆదిత్య హృదయం పారా యణం సర్వశత్రు వినాశన’ అని రామాయణంలో శ్రీసూ ర్యభగవానుని ప్రస్తుతించారు. అంతటి మహిమాన్వితుడు, ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత, గ్రహరాజు, త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుని మాసానికో పేరుతో పిలు స్తారు. అంటే 12 నెలలకు పన్నెండు పేర్లు… చైత్రమాసం లో ‘మిత్ర’ అని, వైశాఖంలో ‘రవి’, జ్యేష్టంలో ‘సూర్య’, ఆషాడంలో ‘వాసు’, శ్రావణంలో ‘ఖగ’, భాద్రపదంలో ‘పూష’, ఆశ్వయూజంలో ‘హిరణ్యగర్భ’, కార్తీకంలో ‘మరీచ’, మార్గశిరంలో ‘ఆదిత్య’, పుష్యంలో ‘సవిత్రు’, మాఘంలో ‘అర్క’, ఫల్గుణంలో ‘భాస్కరుడు’ అని పిలుస్తారు. భారతదేశంలో సూర్యభగవానునికి నిత్యపూజ, అర్చన జరిగే దేవాలయం అరసవల్లి మాత్రమే.

అపురూపం ఆదిత్య స్వరూపం…
అరసవల్లిలో వెలసిన ఉషా ఛాయా పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేకత లేని ది అంటూ ఏది లేదు. స్వామివారి దేవాలయం, సూర్య కిర ణాలు, ఇంద్ర పుష్కరిణికి ఎంత ప్రాధాన్యం ఉందో స్వామి వారి విగ్రహానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. స్వామివారిని కృష్ణ శిలతో కళాత్మకంతో తీర్చిదిద్దిన ఏక శిలా విగ్రహం ఇక్కడ వుంది. దీనికి అరుణ శిల అని కూడా ప్రసిద్ధి. దీనికి కారణం మూల విరాట్‌ను అరుణ అనే ప్రత్యేకమై శిలలో దేవ శిల్పి విశ్వకర్మచే చెక్కించారు.

ఆదిత్యునికి ఆరుణ శోభ…
సకల జీవులకు ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుడు ప్రతీ ఏడాది అక్టోబరు, మార్చి నెలలో అరుణ శోభను సంతరించుకుంటాడు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి మారే సందర్భాలలో సూర్యకిరణాలు స్వామివారి ధృవమూర్తిని తాకుతాయి. ఆ సమయంలో బాలభానుని లేలేతకిరణ స్పర్శకు ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోతూ అరుణశోభలో భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రతీ ఏటా మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు, అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు కనిపించే ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తరించడానికి దేశం నలు మూలల నుం చి భక్తులు తరలి వస్తుంటారు. ఆదిత్యున్ని పాదాలను సుమారు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకే దృశ్యం ఆలయ నిర్మాణ నైపుణ్యానికి దర్పణంగా నిలుస్తోంది. గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆలయ వాస్తునిర్మాణం లోనే ఈప్రత్యేకత ఉంది. చాలా వరకూ ఆలయాలు ఉత్తరాభిముఖంగా ఉంటే ఈ ఆలయంలో మాత్రం ముఖద్వారం తూర్పునకు అభిముఖంగా ఉంటుంది.

అదిత్యారాధన అన్నింటికీ మాతృక…
సూర్యభగవానుని ఆరాధన ను నిత్యం ఆచరిస్తే… వారికి మోక్షం లభిస్తుంది. సూ ర్యారాధనలోనే సకల దేవతారాధ నల మూలాలున్నాయి. రథసప్త మి రోజు అత్యంత శ్రేష్టమైన పర్వ దినం. ‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అన్ని జీవరాసులకూ ఆరోగ్యప్రదాత ఆదిత్యుడే… నిత్యం సూర్యనమస్కారాలు చేసేవారికి ఎటువంటి ఆనారోగ్య సమస్యలూ తలెత్తవు…అని అరసవల్లి ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర శర్మ చెబుతారు.

రథసప్తమి నాటి శిరస్నానం వేళ పఠించవలసిన శ్లోకం..

శ్లో య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జన్మజన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసి న సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రథసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!

—————————————————-

ఆదిత్య హృదయం – పారాయణ
రామచంద్రుడు రావణుణ్ణి ఎలా వధించాలి అని చింతిస్తుండగా అగస్త్యుడు వచ్చి… భయాలు శత్రుపీడ తొలగడానికి, ఆరోగ్యం, విజయం, శుభం కలగటానికి ఇది చదువుకో అని ఆదిత్య హృదయన్ని భోదించాడు. అది చదివాక రాముడు రావణుణ్ణి అవలీలగా సంహరించగలిగాడట. విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమోత్తమ గ్రంథరాజమని ఆనాడు అగస్త్యుడు రామ చంద్రునికి ఆదిత్య హృదయాన్ని చెబితే, దాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో అదించాడు.

అది సూర్యుడి గురించి అందించిన స్తోత్రం కనుక సూర్యుడి ఆవిర్భావ దినం అయిన రథసప్తమి నాడు చేస్తే మంచిది. అది జరిగింది ఈ మాఘమాసంలో కనుక ఈ మాసం మొత్తం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయ్యవచ్చు. మాఘమాసంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య దాకా రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానంచేసి, పాయసాన్ని తయారు చేసి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్యుడికి పాయసాన్ని నివేదన చేసి నలుగురికి పంచడం చేస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందినవాళ్ళం అవుతాం. రాముడు లంకలో ఉన్న రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి దగ్గరికి చేర్చుకున్నాడు.

రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఉన్న లంకానగరం వంటిదే మన శరీరం. మనలో రాజసిక, తామసిక, సాత్విక ప్రవృత్తులు ఉంటాయి. రాజసిక, తామసిక గుణములని అణిచివేయాలి, సాత్వికాన్ని పెంపొందించుకోవాలి. అదిత్యహృదయ పారాయణ వల్ల మనలో అంతర శత్రువులు అయిన రాజసిక, తామసిక ప్రవృత్తులని అణిచివేయగలుగుతాం.

సూర్య రథం ప్రత్యేకత
అధితి, కశ్యపుల పుత్రుడు సూర్యుడు. సూర్యుడు బంగారు రథం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూ ర్యుడి బంగారు రథానికి ఒకే ఒక్కచక్రం ఉం టుంది. ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటా యి. రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. ఒక చక్రం సంవత్సరానికి, ఆరు ఆకులు ఆరు ఋతువులకి, ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు, ఇంద్ర ధనస్సులోని ఏడు రంగులకు సంకేతంగా చెబుతారు. సర్వసాక్షీ భూతుడైన సూర్యభగవానుడు కాలానికి కర్త కనుక మన ప్రాచీనులు ఆ విషయాన్ని ఈవిధంగా ప్రతీకాత్మకంగా తెలియజేశారు.
సప్తాశ్వ రథమారూఢమ్‌ ప్రచండం కాశ్యపాత్మజమ్‌
శ్వేత పద్మ ధరం దేవమ్‌తం సూర్యం ప్రణమామ్యహమ్‌
సప్తాశ్వాల పేర్లు…
1. గాయత్రి
2. బృహతి
3. ఉష్ణిక్కు
4. జగతి
5. త్రిష్టుప్పు
6. అనుష్టుప్పు
7. పంక్తి

రథసారధి అనూరుడు
అనూరుడు అనగా ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే అరుణుడు (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినత. ఈమె సవతి కద్రువ. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవిస్తారు. వినతకు రెండు గుడ్లు పుడతాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళే నాగ సంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలకపోవడంతో…

లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపో తుంది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూస్తుంది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపిస్తాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినం దుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రు వకు దాసిగా ఉండమని శపిస్తాడు. రెండవ గుడ్డులో మహా బలాఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్దని చెబుతాడు. అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరు డికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టు కుని వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసు కుంటాడు. గరుత్మం తుడినే గరుడుడు అని కూడా అంటా రు. అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన సంపాతి, జటాయువులు వీరి కుమారులు.
————–

కోణార్క్‌ సూర్యదేవాలయం

భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సూర్యదేవాలయం… కోణార్క్‌ సూర్యదేవాలయం. ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 – 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోణార్క్‌లో సముద్ర తీరాన నిర్మించిన సూర్య దేవాలయం కలదు. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రథానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది.

Send a Comment

Your email address will not be published.