సంతోషంలోని సూక్ష్మం

సంతోషంలోని  సూక్ష్మం

గాలి లోపలికి వస్తే చల్లగా హాయిగా ఉంటుంది సరే, లోపల ఉన్న దోమలు, చిన్ని చిన్ని కీటకాలు బయటకు పోతాయి.
అనుమానం అనేది మనిషిలోకి ప్రవేశిస్తే సంతోషం వెనుకవైపు నుంచి వెళ్ళిపోతుంది.
అది అనుమాన రేఖ…. సంతోషానికి చేటు …
ఈరోజుల్లో అంతటా అన్నింటి పైనా అనుమానాలే అనే స్థితి నెలకొంది. కొందరికి ఈరోజుల్లో దేని మీదా నమ్మకం ఉండదు. ఏది చూసినా అనుమానమే.
అసలు ఆ మాటకొస్తే అలాంటి వారికి తమ మీదే నమ్మకం ఉండదు. ఒకరు బస్సులో ఎక్కారు ఏదో పని మీద.
బస్సు పోతోంది.
కాస్సేపు తర్వాత టిక్కెట్లు చెక్ చేసే వ్యక్తి బస్సు ని ఓ చోట ఆపి లోపలికి ఎక్కాడు. ఒక్కొక్కరినీ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. తనమీద తనకే నమ్మకం లేని పో ప్రయాణికుడి వద్దకు వచ్చి టిక్కెట్ చూపించమన్నాడు.
అయితే ఆ అపనమ్మక జీవి “కుడి జేబులో ఉన్న టిక్కెట్టా లేక ఎడమ జేబులో ఉన్న టిక్కెట్టా? ఏది కావాలి? అని అడిగాడు.
టిక్కెట్ చెక్ చేసే వ్యక్తి అయోమయంలో పది సరేగానీ కుడి జేబులోది చూపించు అన్నాడు.
అపనమ్మక జీవి కుడి జేబు లోంచి టిక్కెట్టు తీసి చూపించాడు. అతను చెక్ చేసి రైట్ అన్నాడు. టిక్కెట్టు సరిగ్గానే ఉంది కదా మరో టిక్కెట్టు ఏదీ చూపించు చూద్దాం అన్నాడు.
అపనమ్మక జీవి సరేనని ఎడమ జేబులోనుంచి టిక్కెట్టు తీసి చూపించాడు. అది కూడా సరిగ్గానే ఉంది.
“నువ్వొక్కడివే కదా ప్రయాణం చేస్తున్నది…ఎందుకు రెండు టిక్కెట్లు కొన్నావు?” అని అడిగాడు.
“నేను ఎందులోనైనా ఎంతో హెచ్చరికతో ఉంటాను….ఎవరైనా నా కుడి జేబులో టిక్కెట్టు కొట్టేస్తే అప్పుడు ఎడమ జేబులో టిక్కెట్టు ఉంటుందిగా నాకు ఏ ముప్పూ ఉండదు ” అన్నాడు గొప్పగా.
ఆ తర్వాత టిక్కెట్లు చెక్ చేసే వ్యక్తి మరి రెండు జేబుల్లోని టిక్కెట్లను ఎవరైనా కొట్టేస్తే ఏం చేస్తావు అని అడిగాడు.
అప్పుడు ఆ వ్యక్తి “నేనేమైనా అమాయకుడినా? నా ప్యాన్ జేబులో మరో టిక్కెట్టు ఒక రుమాలులో ఉంచి మడత పెట్టి జాగర్త చేసాను” అని తానేదో గొప్ప పని చేసినట్టు, అప్రమత్తత తనకు తప్ప మరెవ్వరికీ లేదని మనసులో నవ్వుకున్నాడు. తనకు తాను భుజం మీద సెభాష్ అని అనుకున్నాడు.
అటువంటి వ్యక్తిని చాలా హుషారైన వ్యక్తి అనాలా? జాగార్తపరుడు అనాలా? లేక అనుమానం ముందు పుట్టి తర్వాత అతను పుట్టినట్టు చెప్పాలా? లేక పిచ్చి అనుకోవాలా?
తన మీద తనకు నమ్మలేని వ్యక్తులకు దేని మీదా నమ్మకం ఉండదు అని శాస్త్రం చెప్తోంది.
తనను తాను నమ్ముకున్న వ్యక్తులే విజయం సాధించగలరు.
కచ్చితంగా అంకితభావంతో శ్రమిస్తే ఎదుగుతామనే నమ్మకంతో విజయం సాధించవచ్చు.
మనం ఓడిపోతాం అని అనుకుని పని చేస్తే అలాగే ఓడిపోతాం. కనుక జీవితంలో ఆసక్తితో ఏపనైనా చేయాలి. అందులో కృషి లోపం ఉండకూడదు. దాని వెనుక నమ్మకం మూలమై ఉంటుంది.
కొందరు ఏ పని చేయాలన్నా వెంటనే జాతకాలు చెప్పే వ్యక్తి దగ్గరకు వేర్ల్లి అడుగుతారు తాము అనుకున్నది చెయ్యవచ్చా వద్దా అని. ఆలాంటి వారికి తమ సామర్ధ్యం మీద అనుమానం. అసలు అటువంటివారు ముందుగా తెలుసుకోవలసిన విషయం తమకున్న శక్తిసామర్ధ్యాలు, నమ్మకం.
తనను తన శ్రమ మీద పెట్టుకున్న నమ్మకంతో బతుకుతారు కొందరు. అటువంటి వారు తప్పక విజయం సాధిస్తారు.
అంతేకాదు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాకాకుండా తన మీదా, తన సామర్ధ్యం మీదా నమ్మకం లేని వారు జ్యోతిష్కుడిని వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడైనా వారికి జ్యోతిష్కుడి మాటపై ఎంత నమ్మకం ఉంటుందో సందేహమే. వారికి సంతోషం ఆమడదూరంలో ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదు.

Send a Comment

Your email address will not be published.