స్వరరాగ రసగంగ

ఈ స్వరరాగ గంగా ప్రవాహనికి శత వసంతాలు

M.R.Govt Colledge Music Dance
తెలుగు ప్రజలను వందేళ్ళుగా సుస్వరాలతో రంజింపజేస్తున్న కళా విద్యా నిలయం .. విఖ్యాత సంగీతానికి ఆలవాలం.. ఎందరో మహానుభావులు ప్రదర్శనలిచ్చిన రంగస్థలం. ఎందరో విద్యార్థులను, మరెందరో విద్వాంసులను తీర్చిదిద్దిన కళాక్షేత్రం. అదే విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల. తెలుగు ప్రజల సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతున్న విజయనగరంలో కొలువుతీరిన ఈ కళాశాల దేశంలోనే ప్రముఖమైనది. సప్తస్వరాలు, నవరసాలు పండించే ఈ కళాశాల విశ్వవ్యాప్తంగా ఎంతో మంది సంగీత, నట సామ్రాట్‌లను అందించింది. ఇక్కడ సరిగమలు పలికిన వారెందరో ప్రపంచ నలుమూలలా సంగీత పరిమళాలను వెదజల్లారు. వందేళ్లుగా ఈ కళాశాల నుంచి సంగీతం నిరంతరంగా, నిర్విరామంగా, నిత్యనూతనంగా ప్రవహిస్తూనే ఉంది.

విజయనగరం మహరాజా సంగీత, నృత్య కళాశాలకు ఇది శత వసంతాల ఉత్సవ సందర్భం. విశ్వవ్యాప్తంగా విస్తరించిన విజయనగర సంగీత, నృత్య కళాకారుల కుటుంబం ఆనంద డోలికల్లో మునిగి తేలుతోంది. 1919 ఫిబ్రవరి 5న విజయనగరం పట్టణంలో ‘విజయరామ గాన పాఠశాల’ నేటి సంగీత కళాశాల ఏర్పడింది. అప్పటికి దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన మొట్టమొదటి సంగీత విద్యాలయం. దీన్ని 4వ పూసపాటి విజయరామ గజపతి నెలకొల్పారు. ఈ సంగీత కళాశాల ఏర్పాటు కారణం మాత్రం చాగంటి గంగరాజు (గంగబాబు) గారి అంధత్వం, విజయరామ గజపతి ముందుచూపు సహజంగానే కళాశాల ఏర్పాటుకి తోడ్పడ్డాయి. ముంతాజ్‌ బేగమ్‌ మరణానికి గుర్తుగా ఆగ్రాలో తాజ్‌మహల్‌ నిర్మిస్తే గంగబాబు విద్యాభ్యాసం కోసం విజయనగరంలో సంగీత కళాశాల ఏర్పడటం ఓ చారిత్రక సందర్భం.
విజయనగరం సంస్థానంలో పూసపాటి విజయరామ గజపతిరాజు వద్ద వ్యక్తిగత కార్యదర్శి చాగంటి జోగారావు. ఆయన కుమారుడు గంగబాబు పుట్టుకతోనే అంధుడు. జోగారావు పంతులది సంపన్న కుటుంబమే. వారిది కంటకాపల్లి దగ్గర నిడిగట్టు అగ్రహారం. హౌదా, డబ్బు ఉన్నప్పటికి కుమారుడు పుట్టుకతోనే చూపులేనివాడనే మనస్తాపం ఆ దంపతులను కలవరపరిచేది. విజయరామ గజపతి ఈ విషయం గమనించారు. ఓసారి ఆంతరంగిక సమావేశంలో ఈ సంగతి ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వ్యక్తిగత వైద్యులు అయిన డాక్టర్‌ రామయ్యంగార్‌ మహారాజుకు ఒక సలహా ఇచ్చారు. సంస్క ృత కళాశాల నిర్మించినట్లే సంగీత విద్యాలయం నెలకొల్పితే బాగుంటుందని, అది గంగబాబు వంటి విద్యార్థులకు ఉపయోగపడుతుందని సూచించారు. ఆ సూచన ఆనంద గజపతికి నచ్చింది. దానికి ఆచరణగా విజయరామ గాన పాఠశాలను ఏర్పాటు చేశారు. తరువాత కాలంలో అదే మహారాజ సంగీత, నృత్యకళాశాలగా పరిణామం చెందింది.

ద్వారం వారి ప్రవేశం …
music school
గంగబాబుకి వయోలిన్‌ నేర్పించాలని నిర్ణయించారు. మరి నేర్పేది ఎవరు? గురువు కోసం అన్వేషించటం మొదలెట్టారు. ఆ ప్రయత్నంలోనే – ద్వారం వెంకటస్వామి నాయుడు తారసపడ్డారు. ఆయన గాన పాఠశాలకు మొదటి వయోలిన్‌ అధ్యాపకులు. బహు భాషాపండితుడు, సంగీత, సాహిత్యంలో ఉద్ధండుడూ అయిన ఆదిభట్ల నారాయణదాసు కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌. మొదటి విద్యార్థి చాగంటి గంగబాబు.
ప్రతిరోజూ ఇంటినుంచి కళాశాలకు వచ్చేందుకు గంగబాబుకి రాజావారు ఒక గుర్రపు బగ్గీ ఏర్పాటు చేశారు. గంగబాబు ఏకసంథాగ్రహి. గురువు గారి వద్ద విద్యను త్వరితంగానే గ్రహించేవాడు. తరువాత కఠోర సాధన చేసేవాడు. ఆవిధంగా అనతికాలంలోనే వయోలిన్‌ వాయిద్యంలో మంచి పట్టు సాధించాడు. 16 ఏట నుంచి తన గురువు ద్వారం స్వామినాయుడుతో కలిసి కచేరీలు మొదలు పెట్టాడు. అలా దేశం నలుమూలలా అనేక కచేరీలు చేశాడు. రెండు దశాబ్దాల పాటు పలు ఆకాశవాణీ కేంద్రాల్లో కచేరీలు వినిపించారు. గంగబాబు వద్ద విద్యనభ్యసించి దేశంలో ప్రఖ్యాతి విద్వాంసులుగా కీర్తి సంపాదించారు. అటువంటి ప్రముఖుల్లో …. పద్మవిభూషణ్‌ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి కూడా ఉన్నారు. తాను గంగబాబు గారి దగ్గర పల్లవి పాడటం నేర్చుకున్నట్లు ఆయన తన ‘సంగీత జీవనయాత్ర’లో రాసుకున్నారు. అలాగే మంగతాయారు, దేవరకొండ సూర్యప్రభ, ద్వారం దుర్గాప్రసాద్‌ గారి శ్రీమతి పూర్ణ మనోరమ, ద్వారం సత్యనారాయణరావు, ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని పి.సుశీల, జోస్యుల కామేశ్వరరావు, ఏవిఎన్‌ మూర్తి (సినీనేపథ్య గాయకుడు) తదితరులు గంగబాబు గారి దగ్గర సంగీత విద్యనభ్యసించినవారే! వారంతా సంగీత కళాశాలలో విరిసి, మెరసిన సంగీత ప్రజ్ఞానిధులే! ఇలా గంగబాబు మొదటి విద్యార్థిగా ప్రారంభమైన గాన పాఠశాల నేడు సంగీత, నృత్యకళాశాలగా విరాజిల్లుతోంది. వందలాది, వేలాదిమందికి సరిగమల నుంచి సర్వ శ్రేష్ట సంగీతం దాకా అధ్యాపనం చేస్తోంది.
గంగబాబు 1973లో కన్నుమూశారు. ఆయన వారసత్వాన్ని మనువరాళ్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనుమరాలు చాగంటి రాజ్యలక్ష్మి ఈ కళాశాలలో గాత్రం అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు.

ఎందరో మహానుభావులు
విజయనగరం సంగీత కళాశాల ప్రఖ్యాతి విశ్వ విఖ్యాతం. ఇక్కడి నుంచి ఎందరో మహానుభావులు ఉద్భవించారు. సంగీత సామ్రాట్టులుగా, గానగంధర్వులుగా ఎదిగారు. సర్వత్రా రాణించారు. రవళించారు. ప్రముఖ సినీసంగీత స్వరజ్ఞులు, గాన గంధర్వుడు ఘంటశాల వెంకటేశ్వరరావు, ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, కర్ణాటక సంగీత విద్యాంసుడు నేదునూరి కృష్ణమూర్తి, ఎంఎస్‌ బాలు, సాలూరు వాసు, కోటీ … ఇంకా ఎంతోమంది ఇక్కడ విద్యనభ్యసించి సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగినవారే! ప్రస్తుతం ఈ కళాశాలలో సప్తస్వరాల్లా ఏడు విభాగాలు నడుస్తున్నాయి. అవి : 1 గాత్రం, 2. వయోలిన్‌, 3. భరతనాట్యం 4. డోలు, 5. నాదస్వరం, 6. మృదంగం, 7. వీణ.. ఇవన్నీ దేనికదే ప్రత్యేకతను, ప్రాధాన్యతనూ సంతరించుకున్నాయి.
తొలి అధ్యక్షునిగా సకల కళాసార్వభౌముడు, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు పాఠశాల అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. అనంతరం కళాశాలగా రూపుదిద్దుకుంది. అప్పటికే కళాశాలలో వయోలిన్‌ అధ్యాపకునిగా పనిచేస్తున్న ద్వారం వెంకటస్వామి నాయుడు రెండో అధ్యక్షునిగా నియమితులయ్యారు. అనంతర కాలంలో ద్వారం నరసింగనాయుడు, ద్వారం భావనారాయణరావు, గాయకరత్న శ్రీరంగం గోపాలరత్నం, నేదునూరు కృష్ణమూర్తి తదితరులు కళాశాలలో కర్ణాటక సంగీత కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. ఇలా ఎంతోమంది ప్రముఖుల ప్రస్థానానికి కళాశాల పునాదైంది. ఆకాశవాణి, దూరదర్శన్‌, శాస్త్రీయ సంగీత నృత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న కీలక కళాకారులు కూడా ఇక్కడి విద్యార్థులే! గతమెంతో ఘన చరిత్రగల ఈ కళాశాల ఎందరో మహానుభావుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. దేశం గర్వించదగ్గ సంగీత కళాకారులకు పురుడు పోసింది.

గొప్ప కళా వైభవం
సాలూరు వారి సంగీత సంప్రదాయం… ద్వారం వారి వయోలిన్‌ వైభవం… ఘంటసాల వారి గానామృతం… ఈ కళాశాల కీర్తిప్రతిష్టలకు అసమాన ప్రతిభా పతాకాలు. శాస్త్రీయ సంగీతంలో సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారం మంగతాయారు, వయోలిన్‌ విద్వాంసులు కెవి రెడ్డి, ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, సినీరంగంలో అగ్రశ్రేణి గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, గానకోకిల పి.సుశీల, సంగీతం సత్యం, ఒడిశాకు చెందిన సంగీత దర్శకులు డాక్టర్‌ అశ్వద్ధామ మొదలుకుని నేటితరం బిఎ నారాయణ, బి.పవన్‌, బి.సంతోష్‌, ద్వారం సత్యనారాయణ వంటివారెందరో ఇక్కడే సరిగమలు నేర్చుకున్నారు. వీరంతా చెన్నై, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీతోపాటు దేశవిదేశాల్లో సంగీత ప్రపంచంలో స్థిరపడ్డారు. కళాశాల ప్రారంభం నుంచి వయోలిన్‌ విభాగం అధ్యాపకులుగా ద్వారం వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితం అప్పలరాజు, ఆంధ్రజాలరి డివై సంపత్‌కుమార్‌, వసుంధర థామస్‌, వైజయంతితోపాటు నేటితరం మయూరి నృత్యాలయ, నర్తనశాల, అభినయప్రియ నర్తనశాల నిర్వాహకులు శ్రీదేవికృష్ణ, రాధికారాణి, సాయి ప్రియ తదితర నర్తకీ నర్తకులు కూడా ఇక్కడ విద్యనభ్యసించినవారే!

సంగీత సాహిత్యాలు
విజయనగరం అంటేనే చాలామందికి సంగీత సాహిత్యాలు గుర్తొస్తాయి. మహాకవి గురజాడ ఇక్కడివారే! మహా కథకుడు చాగంటి సోమయాజులు గట్టి కథలు రాసింది ఇక్కడి నుంచే! ఇంకా ఎందరెందరో సంగీత సాహిత్య మహాజ్ఞులు ఆవిర్భవించింది, ప్రపంచానికి పరిచయం అయిందీ విజయనగరం పట్టణం నుంచే! ఈ పట్టణానికి మొదటినుంచి అలాంటి వాతావరణం ఉంది. విద్యకు, కళలకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది విజయనగరం సంస్థానంలో ఒక ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన అంశం. సంగీత, నృత్య కళాశాల అలాంటి ఘనమైన వారసత్వానికి ప్రతీక. అయితే, ఈ ఘనత అంతా గతం గురించి చెప్పుకోటానికే పరిమితం అవుతుంది. స్వాతంత్య్రానంతర పాలకులు వీటి కొనసాగింపు, విస్తరణ విషయంలో చేసిన కృషి శూన్యం.. కాకుంటే కొంతమాత్రం.
సంగీత కళాశాలలోప్రస్తుతం వయోలిన్‌, గాత్రం, వీణ, మృదంగం, భరతనాట్యం, నాదస్వరం, డోలు వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏటేటా వందలాది మంది విద్యార్థులు సంగీతంలో డిప్లొమా పూర్తి చేస్తున్నారు. మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండు. అది నెరవేరవల్సి ఉంది. కళాశాల ప్రారంభ దశలో సంగీత, నృత్యానికి టెక్నికల్‌ బోర్డు ఆధ్వర్యాన పరీక్షలు నిర్వహించేవారు. ఆ తరువాత ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల ప్రస్తుతం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యాన నడుస్తోంది.

సంగీతంతో స్వయం ఉపాధి
సంగీతం అనేది కేవలం అభిరుచిగానో, ఆత్మతృప్తిగానో నేటితరానికి సరిపోదు. అందులోంచి కొత్త ఉపాధి అవకాశాలను విస్తృతంగా అందుకునేవిధంగా తగు మార్పులు చేయాలని యువతరం కోరుతోంది. కళలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. బతుకునిండా ఒత్తిళ్లు ఆవరించిన కాలంలో సంగీతం, నృత్యం వంటి కళల అవసరం మరింత పెరుగుతుంది. ఇక్కడ విధ్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా ప్రభుత్వమూ చర్యలు చేపట్టాలి. ఈ కళాశాల విద్యార్థులెంతో మంది సినీ సంగీత దర్శకులయ్యారు. వీరి సహాయకుల్లో ఇక్కడి నుంచి వెళ్లినవారే ఎక్కువ. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలల్లోనూ సంగీతం, నృత్యం ప్రత్యేక సబ్జెక్టులుగా పెట్టాల్సిన అవసరం ఉంది.

సాంస్కృతిక విశ్వవిద్యాలయంగా…
ఖండాంతరాల్లో ఖ్యాతిగడించిన సంగీత కళాశాల … అంతకుమించిన స్థాయిని అందుకోవాలి. ఈ సంగీత, కళావైభవం కొనసాగాలంటే ఈ కళాశాలను సాంస్కృతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ ఆకాంక్ష… కవులు, కళాకారుల నోట కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తోంది. వందేళ్ల ఉత్సవాల సమయంలోనైనా అలాంటి ఉత్సుకత, ఆలోచన ప్రభుత్వానికి రావాలి. కళలను ఆదరించే రసజ్ఞత, కళాకారుల ప్రతిభపాటవాల నిగ్గుతేల్చగల ప్రావీణ్యత ఈ ప్రాంతానికి ఉన్నాయి. రాఘవ నాటక కళాపరిషత్‌ వంటి కళా సంస్థలను ప్రోత్సహించి ఆంధ్రదేశానికి గొప్ప నాటక, సినీ కళాకారులను అందించిన ప్రతిభ ఇక్కడిది. కళా, సాంస్కృతిక ప్రియుల ఆకాంక్షకు అనుగుణంగా విజయగనగరంలో లలిత కళల అకాడమీ ఏర్పాటు చేసేందుకు అమరావతి రాజధాని ప్రకటన సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఆదిశగా ఇప్పటికీ చర్యలు ప్రారంభించలేదు. శతవసంతాల వేళ సరిగమల హేలలో సంగీత, లలిత కళలల అకాడమీ ఏర్పాటుకు పాలకులు పూనుకోవాలి.

విస్తరణతోనే వికాసం
ఘనమైన ఈ కళాశాల ఇంకా గత కాలపు ఘనతలతోనే నడుస్తోంది. తక్షణం ఆధునిక సొబగులను, సౌకర్యాలను అందుకోవాల్సి ఉంది. నవీన తరపు ఆలోచనలకు, అవసరాలకు అనుగుణంగా కొత్తదనాన్ని జోడించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత అందుబాట్లోకి తేవాల్సిన అసవసరం ఉంది. ప్రసిద్ధిగాంచిన ఈ కళాశాలలో ఆడియో, వీడియో, ప్రొజెక్టర్‌ వంటి సదుపాయాలు కూడా లేవు. సాంకేతిక నైపుణ్యం దిశగా అభివృద్ధి చేయాలి. కూచిపూడి నృత్యం, హరికథ, ఫ్లూటు వంటి అనేక విభాగాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఆధునికలను సమకూర్చటం ద్వారా సంగీత కళాశాల శతవసంతాల ప్రస్థానాన్ని ఇంకా విస్తరింపచేయాలి.

Send a Comment

Your email address will not be published.