జనరంజని వారి కావ్యరంజని

జనరంజని వారి కావ్యరంజని

మన సంస్కృతికి వారసులు

రామాయణం, మహాభారతం భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఇతిహాసాలు. వాటిలోని ఒక్కొక్క ఘట్టం ఒక దివ్యమైన అనుభూతిని ఆదర్శవంతమైన సందేశాన్నిస్తుంది. చిన్నప్పుడు నాయనమ్మ ఒడిలోనో, అమ్మమ్మ ఒడిలోనో కూర్చొని విన్న కథలు ఇప్పటికీ చెవిలో వినిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా పేదరాశి పెద్దమ్మ, ఆకాశ రామన్న, చందమామ, బాలమిత్ర, పంచతంత్ర ఇత్యాది కథలు చదవడం పెద్దవారు పిల్లలకి అలవాటు చేసారు. అందులోనున్న నీతి కథలు, నైతిక విలువలు నేర్పించాలని పరితపించారు. భావితరాలకు మన సంస్క్రుతిలోనున్న గొప్పదనాన్ని, ప్రాముఖ్యతను తెలియపరచారు అనేకంటే తెలియపరచడానికి ఎంతో కృషి చేసారు. వారి సమయాన్ని వెచ్చించి ఎంతో త్యాగం చేసారు.

2020 మానవ మనుగడను ప్రశ్నించే ఒక పీడకలగా మిగిలిపోయింది. అయితే ఈ సమయంలో చాలామంది పెద్దవాళ్ళు అంతర్జాలంలో చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం దొరికింది. పిల్లలు మాత్రం కరోనా పుణ్యమాని ఇంట్లోనే టివి కార్యక్రమాలు చూస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో కాలం వెళ్ళబుచ్చారు. వారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరగలేదు.

సిడ్నీ జనరంజని రేడియో వారు ఈ సంక్రాంతి సందర్భంగా పిల్లల కోసం “రామాయణ కావ్యరంజని” అనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ మరియు భారతదేశం నుండి సుమారు 30 మంది 5-12 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు పాల్గొని రామాయణంలోని కొన్ని ప్రశ్నలకు చక్కటి సమాధానాలిచ్చారు. వారంతా ఎంతో ఉత్సాహంగా పోటీపడి మరీ సమాధానాలు చెప్పారు.

ఈ పోటీ “రామాయణం” ఇతివృత్తంగా ఉంటుందని ముందుగానే తెలియపరచడం వలన అందరూ సమాయత్తమై కూలంకుషంగా రామయణ కథను చదివి లేక ఇంట్లో ఉన్న పెద్దవారితో చెప్పించుకొని అందులోని కొన్ని ముఖ్యమైన పాత్రలు, సన్నివేశాలు తెలుసుకొన్నారు. ఈ గొప్ప ఆలోచనకు రూపకర్త జనరంజని బృందం అధ్యక్షురాలు శ్రీమతి అరుణ శర్మ నిమ్మగడ్డ గారు. కార్యక్రమాన్ని సిడ్నీ జనరంజని యువత వాలంటీర్ శైలజ కంభంమెట్టు గారు సమర్ధవంతంగా నిర్వహించి పిల్లలందరూ చక్కగా సమాధానాలు చెప్పడానికి తోడ్పడ్డారు. మిగిలిన కార్యవర్గ సభ్యులు కరపత్రాలను తయారుచేసి సరిదిద్దడంలో ఎంతో సహాయం అందించారు.

సగీత భారతి అధ్యక్షులు, న్యూ జిలాండ్ వాస్తవ్యులు శ్రీ మల్లెల గోవర్ధన్ గారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. చిరంజీవి కార్తికేయ మరియు గౌరి చక్కగా సమాధానాలు చెప్పినందుకు బహుమతులు గెలుచుకున్నారు.
భారత హై కమీషనర్ వారి శ్రీ స్వామి వివేకానంద ట్రస్ట్ సంచాలకులు శ్రీ రామానంద్ గార్గ్ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి మన సంస్కృతిని పిల్లలకు నేర్పించి పెంపొందించడానికి తోడ్పడుతున్న జనరంజని కార్యవర్గ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నెన్నో నిర్వహించాలని అభిలషించారు.

2 Comments

  1. ఏదేశమెళ్ళినా పొగడరా భారతిని,రమణీయ రామాయణాన్ని ఈనాటి పిల్లలచే దానిలోని పద్యాల కూలంకషంగా చదివి లేక ఇంటలోని పెద్దల చేత రామాయణంలోని పాత్రలు,సన్నివేశాలను ఆకళింపు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నా పిల్లలందరికీ మరియు ఈ కార్యక్రమం నిర్వాహూలకు అభినందనలు

Leave a Reply to Usha Cancel reply

Your email address will not be published.