సరిగమ స్వరగమకాల వీణాపాణి

సరిగమ స్వరగమకాల వీణాపాణి

సరిగమ స్వరగమకాల వీణాపాణి చిట్టిబాబు

సాధారణంగా సంగీతవాయిద్యాలలో వీణ అనగానే సరస్వతీ దేవి గుర్తుకొస్తుంది..ఇంకా పాత సినిమాల్లో అయితే సావిత్రి, జమున, వాణిశ్రీ లాంటి కథానాయికలు వీణవాయిస్తూ చేస్తున్న అభినయం కళ్ళముందు మెదులుతుంది. కానీ ఒక పురుషుని చేతిలో వీణ సరిగమ స్వరగమకాలను ఆవిష్కరించడం అద్భుతమే. కర్నాటక శాస్త్రీయ సంగీతం లో అ అద్భుతాన్ని తన అకుంఠిత సాధన ద్వారా సుసాధ్యం చేసిన ధన్యజీవి చల్లపల్లి చిట్టిబాబు. సంగీత జగత్తులో వీణా చిట్టిబాబుగా వినుతికెక్కిన సంగీతజ్ఞుని వర్థంతి ఈనెల 9… ఆ సందర్భంగా ఓ చిరు పరిచయం ఇది..

చిట్టి బాబు ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైణికులలో ఇతనొకరు. ఇతని గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా ప్రశంశలందుకున్నారు.

చల్లపల్లి చిట్టిబాబు 1936 అక్టోబరు 13 న కాకినాడలో సంగీతాభిమానుల ఇంట పుట్టారు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఈయన తల్లిదండ్రులు. ఇతనికికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5 యేళ్ళ వయసులోనే వీణను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసారు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ ఎయ్యుని అప్పలాచార్యులు, పండ్రవడ గారి వద్ద శిష్యరికం చేసారు. తరువాత మహామహోపాధ్యాయ డా॥ఈమని శంకరశాస్త్రి వద్ద ముఖ్య శిష్యుడయ్యారు.

ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందారు. ఆయన ‘కోయిలా గీతావిన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణా వాదన విన్యాస కళపై లఘుచిత్రం ‘కళాకోయిలా అన్నది కూడా మరువలేని సాక్ష్యం కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం – శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ, తిరువాయూర్ లో సభ్యత్వం, శ్రీ కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసకత్వం, చిట్టిబాబు ప్రతిభాసిగలో . చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం (1981-87) కలికి తురాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ (1984), సంగీత నాటక అకాడమీ పురస్కారం (1990) ను పొందారు 1948లో చిట్టిబాబును సినిమాలలో నటింపచేయాలని, కుటుంబం మద్రాసుకు వలసపోయారు. లైలా మజ్నూ చిత్రంలో బాలనటుడిగా వేశం వేసాడు కూడా. మరో చిత్రంలో చిన్న పాత్ర వేసాడు. అయితే, చిట్టిబాబుకు సంగీతం మీదే మక్కువ ఎక్కువయింది. అందుకని ఈమని శంకర శాస్త్రి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి, ఎన్నో పద్ధతులు, సూక్ష్మభేదాలు నేర్చుకున్నారు.

కళాకారుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా
ఆ రోజుల్లో అందరు యువ కళాకారులలాగానే చిట్టిబాబు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అందువల్ల ఆయన వీణ వాయించడమే, ఆయనకో వరమయింది. 1948 నుండి 1962 వరకూ దక్షిణ భారత సినిమాలలో రికార్డింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. ఈ కాలంలోనీ సాలూరి రాజేశ్వర రావు, పెండ్యాల నాగేశ్వర రావు ఇంకా విశ్వనాథన్-రామమూర్తిల జోడీతో పని చేసే అవకాశం కలిగింది. ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలనూ సూపర్ హిట్ చేయటంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది. చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంటిలోనూ ప్రతిభ చాటుకున్నారు.

తమిళ సినిమా కలై కోవిల్కి సౌండ్‍ట్రాక్ అందించారు. ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే, సినిమా అంతటా నేపథ్య సంగీతం చిట్టిబాబు అందించారు. ఈ సినిమా ఎందరి మన్ననలో పొందింది. తెలుగు సినిమా సంపూర్ణ రామాయణంకు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా రఘువంశ సుధా అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించారు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన దిక్కట్ర పార్వతికి సంగీత దర్శకునిగా వ్యవహరించారు. 1979లో కన్నడ చిత్రం శ్రీ రాఘవేంద్ర మహిమెకి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.

చిట్టిబాబు పొందిన బిరుదులు, అందుకున్న సత్కారాలు ఎన్నెన్నో…
మైసూర్ మహారాజా వారిచే 1967లో వైణిక శిఖామణి బిరుదు ప్రదానం,
తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదు,
కృష్ణగాన సభ, మద్రాసు వారిచే సంగీత చూడామణి, 1984లో ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ బిరుదు, కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆవార్డు, కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసుడుగా గౌరవం, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు,
వైణిక సార్వభౌమ, వీణాగాన ప్రవీణ, గంధర్వ కళానిధి, వైణిక సమ్రాట్, వైణికరత్న, తంత్రీవిలాస్, కళారత్న తదిర బిరుదులు పొందారు.
యాభై ఆరేళ్ళ వయసులో 9 ఫిబ్రవరి 1996న చెన్నైలో చిట్టిబాబు సంగీత స్వరాలను రసజ్ఞులకు వదిలేసి ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

Send a Comment

Your email address will not be published.