కరోనా – తెలుగువారి కరుణ

కరోనా – తెలుగువారి కరుణ

‘కరోనా’ వైరస్ మానవాళి మనుగడకి ఒక అనూహ్య పరిణామము. కనీ వినీ ఎరుగనటువంటి కథనం. ప్రపంచంలో ఇప్పటివరకూ ప్రపంచంలో 20 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడి ఒక లక్ష మంది ప్రాణాలు విడిచారు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ఆరు వేలమంది ఈ వైరస్ బారిన పడి సుమారు 61 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు కొంతమేర అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లెవెల్ 3 నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.

దాదాపు 60 సంవత్సరాల ప్రస్థానం గల ఆస్ట్రేలియాలోని తెలుగువారు ప్రపంచంలో అందరిలాగానే ‘కరోనా’ విళయానికి తల్లడిల్లిపోతున్నారనడానికి సందేహం లేదు. మన తెలుగువారు చాలామంది IT రంగంలో పనిచేస్తున్న కారణంగా ఇంటినుండి పనిచేయడానికి అనువైన సౌకర్యం ఉండి ‘ఇల్లే కదా స్వర్గసీమ’ అన్న నానుడికి అనుగుణంగా పనిచేస్తున్నారు. IT రంగం అభివృద్ధి చెందిన తరువాత ఇతర రంగాల్లో పనిచేస్తున్నవారికి కూడా ఇంటినుండి పనిచేయడానికి అన్ని వసతులు ఉన్నాయి. సామాజిక దూరం పాటిస్తూ వైద్య రంగం, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు మరికొన్ని రంగాలు తప్పించి అందరూ ఇంటినుండి పని చేస్తున్నారనే చెప్పవచ్చు.

ముందు జాగ్రత్త చర్యగా చాలామంది ఇంటికి కావలసిన సరకులు – బియ్యం, దినుసులు, పప్పులు వగైరా గత నెల ‘కరోనా’ మహమ్మారి ప్రాభల్యం పెరిగినప్పటికంటే ముందే భారతీయ కిరాణా షాపులనుండి సమకూర్చుకున్నారు. సుమారు 6 నెలలు విమాన సర్వీసులే కాకుండా ఓడలపై కూడా సరకుల రవాణా ఉండకపోవచ్చని అంచనా. ఇక్కడ పౌరసత్వం, శాశ్వత నివాసం (పెర్మనెంట్ రెసిడెన్సీ) ఉన్నవారు ఎవరూ ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడిన దాఖలాలు లేవు. ఇప్పటికిది చాలా సంతోషకరమైన విషయం.

కాలక్షేపం ఎలా?
24 గంటలూ ఇంట్లోనే ఎవరి గదిలో వాళ్లుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్నది అన్ని సంస్కృతులకూ భిన్నమైన పని. ముఖ్యంగా భారతీయులకు మరీను. ‘ఇంట్లోనుండి పని చేయుట’ వలన గృహ హింస పెరిగి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యెక పథకం రూపొందించడం జరిగింది. మనలో చాలామందికి ఇవన్నీ క్రొత్తగా ఉన్నాయి.

మనవాళ్ళు కొంతమంది ఇది మంచి తరుణమని ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలు- అష్టా-చెమ్మ, పులి-జూదం, దాడి-దిక్కిడి, చదరంగం(ఇది చెస్ కాదండోయ్) వంటి ఆటలు ఇంట్లో పిల్లలతో ఆడుతూ వారికి నేర్పిస్తున్నారు. మళ్ళీ ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి వెళ్లి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు.

విద్యార్ధులు:
చాలా విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు సామాజిక ఎడబాటు దృష్టిలో ఉంచుకొని అంతర్జాల సాంకీతికను ఉపయోగించి తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే చాలామంది విద్యార్ధులు భారతీయ రెస్టారెంట్లు, పెట్రోలు స్టేషన్లు, కిరాణా షాపుల్లో పనిచేసేవారి జీవన భృతికి ఇబ్బందులు కలిగాయి.

ప్రస్తుతం ఇక్కడి తెలుగు సంఘాలు మరియు ఇతర వ్యక్తిగత గ్రూపులు ప్రత్యేకంగా విద్యార్ధుల గురించి వివిధ రకాలుగా డబ్బుని చేకూర్చి కనీస అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్నాయి. తిండికి కావలసిన వస్తువులు పాకెట్లలో విద్యార్ధులందరికీ పంచడానికి వివిధ రకాలుగా కృషి చేస్తున్నాయి. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడ నుండి ఈ వస్తువులను తెచ్చుకోవచ్చో తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అర్ధిస్తున్నారు.

ఈ క్రింది లంకెలలో కొన్ని వివరాలు చూడవచ్చు: (ఇవే కాకుండా ఇంకా ఎంతోమంది వివిధ రకాలుగా సహాయం అందిస్తున్నారు)

https://www.facebook.com/groups/TAAICommunity/?fref=nf
https://www.facebook.com/Kasarla-Nagender-Reddy-KNR-373660323154229/
https://www.facebook.com/australiatelanganaassociationinc/
https://www.facebook.com/melbournetelangana/

Send a Comment

Your email address will not be published.