ఆస్ట్రేలేషియా సాహితీ సమారోహం

Toli Sandhya-nl
గత ఇరవై పాతికేళ్ళుగా తెలుగు భాషకు వేష భూషలను తొడిగి గిడుగు తొడుగులను అడుగడుగునా పడుగులుగా పందిళ్ళు వేసి పరాయి దేశంలో పర సంస్కృతీ సాంప్రదాయాల పరదాల చాటున సహవాసం చేస్తూ ‘అమ్మ’ భాషను రక్షించుకోవాలన్న తపన ఇక్కడి తెలుగువారందరి తలపుల్లో మెదులుతూ వచ్చింది. తరతరాల మన తెలుగు తరగని వెలుగుగా సూర్య చంద్రులున్నంత వరకూ నిలవాలని ఎంతోమంది వివిధ రూపాలలో తమ సేవలందించారు. భావి తరాలకు మన భాషనందివ్వాలని భావ తరంగాలుగా కొన్ని తెలుగు సంఘాలు పత్రికల రూపంలోనూ, కథలు, కథనాలు, కవితలు, పద్యాలు – తెలుగు భాషకే ప్రత్యేకమైన ప్రక్రియలతో ‘కవితాస్త్రాలయ’ వంటి పుస్తకాలు, సంగీత సాహిత్యాలకున్న విడదీయలేని అనుబంధాన్ని నొక్కి చెప్పే పాటలు మరియు జానపదాలు, కావ్య భాషకు మూలాధారమైన రంగస్థల నాటకాలు, వాడుక భాషకు వెన్నెముకలాంటి సాంఘిక నాటకాలు, శ్రవణానందకరమైన రేడియో మాధ్యమాలు – ఇలా అనేకరకాలుగా తమ సేవలందించి తెలుగు అక్షర పక్షం నిలిచారు. ఈ మధ్య తెలుగు నుడికారానికి మరింత మమకారం జోడించి సంధి సమాసాల్లోని ప్రాకారాలను ప్రావీణ్యతతో సామాజిక మాధ్యమాల్లో మరింత మురిపిస్తున్నారు.

సుసంపన్నమైన సాహితీ సంపదను మరింత పదిలపరచుకోవడానికి మరో మెట్టు ఎదగాలన్న సమాలోచనకు నాందీ గీతం పాడుతూ రెండు దేశాల తెలుగువారు నవరస భరితమైన ఒక సాహితీ సదస్సును నిర్వహించి సుందరమైన సుమాక్షర నందన వనంలో మరెన్నో సుగంధ పరిమళాలు వెదజల్లే కవి పుంగవులు తమ కవనధారలు కురిపించాలని కోరుకుంటున్నారు. సరళమైన తెలుగు భాష ‘తొలి సంధ్య’ రూపంలో ధవళ కాంతులు మెరవాలని మురిసిపోతున్నారు. కొన్ని శతాబ్దాల తెలుగు భాషా పరంపర కాంతి పుంజంలా పరిఢవిల్లాలని పరితపిస్తున్నారు.

ఈ బృహత్తర కార్యానికి భూతలానికి తలమానికంగా ఉన్న న్యూ జిలాండ్ దేశంలోని తెలుగు సంఘం నడుం బిగించి మొదటి సాహితీ సదస్సును నిర్వహించడానికి ముందుకు రావడం ఎంతో ముదావహం. తెలుగు మాట్లాడేవారందరూ ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని పిలుపునిస్తూ…

అమ్మ నేర్పిన మాట అవని అంతట చాట
తల్లి ఋణము తీర్చ తరలి రమ్మనిరంట
జన్మ భూమిని కీర్తించ పలుకరో నీ నోట
అమ్మ భాషను మించినది అవనిలో లేదంట

తొలి రోజుల్లోని మధుర జ్ఞాపకాలు మలితరంతో పంచుకోవాలన్న పలువురి పెద్దల కోరికకు పెద్ద పీట వేసి చిన్న దేశమైనా వన్నెగల దేశంగా పేరు గాంచిన న్యూ జిలాండ్ దేశంలోని తెలుగు సంఘం ఈ సంవత్సరం మొదటి సాహితీ సమావేశం ఒక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు అనేకమంది అంతర్జాతీయ అతిథులు వచ్చి వారి ఉపన్యాసాలతో ఉర్రూతలూగించనున్నారు.

ఈ సదస్సులో అన్ని తెలుగు సంఘాలు పాలుపంచుకొని మన తెలుగు భాషా సంస్కృతులను పరిఢవింప జేయాలని తెలుగుమల్లి మనవి చేసుకుంటోంది. పాల్గొనదలచినవారు న్యూ జిలాండ్ తెలుగు సంఘ అధ్యక్షులను లేక కార్యదర్శిని సంప్రదించవచ్చు.

Send a Comment

Your email address will not be published.