అంత ఒత్తిడి చవిచూడలేదు

బాహుబలి సినిమాకు చవిచూసినంత ఒత్తిడి తాను నటించిన మొదటి సినిమా సమయంలో కూడా అనుభవించలేదని “బాహుబలి” ప్రభాస్ చెప్పారు. అంతకన్నా ఇంకేదీ చెప్పలేనని, అయితే టెన్షన్ కావలసినంత ఉందని అన్నారు.

బాహుబలి చిత్రంలో ప్రభాస్ అటు తండ్రి, ఇటు కొడుకు పాత్ర పోషించారు. తండ్రి పాత్రకు ఆయన బోలెడంత బరువు పెంచుకోవలసి వచ్చింది. కొడుకు పాత్రకు వచ్చేసరికి ఆ బరువు బాగా తగ్గాల్సి వచ్చిందని ప్రభాస్ చెప్పారు. తండ్రి పాత్రలో ప్రభాస్ బరువు దాదాపు వంద కిలోలు. అదే కొడుకు పాత్ర వచ్చేసరికి 80 – 85 కిలోల వరకు తగ్గాల్సి వచ్చింది.

బాహుబలి సినిమా చేస్తున్న రోజుల్లో ప్రభాస్ చుట్టూ కొన్ని వదంతులు వ్యాపించాయి. వాటి గురించి చెప్తూ వదంతులు పెను హింస అని ప్రభాస్ చెప్పారు. కేరళలో షూటింగ్ జరుగుతున్నప్పుడు బురదలో జారి పడినప్పుడు చేతికి గాయమై డాక్టర్ ని కలిశానని, అయితే మరుసటి రోజు పేపర్లలో వచ్చిన వార్త చూసి చిర్రెత్తుకొచ్చిందని అన్నారు. ప్రభాస్ కోమాలో ఉన్నాడని ప్రభాస్ తలకు గాయమైందని, మా అంకుల్ కృష్ణం రాజుకి కొన్ని వందల కాల్స్ వచ్చాయని ప్రభాస్ అన్నారు. జరిగింది ఒకటైతే వార్తలు మాత్రం ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకున్నారని. ఇలాంటి వార్తలంటే చిరాకని చెప్పారు.

వియత్నాం నుంచి ముగ్గురు యాక్షన్ దర్శకులు వచ్చారని, వాళ్లకు ఇంగ్లీష్ కానీ మన దేశానికి చెందినా మరే భాష కానీ రాదనీ, తమ మధ్య కమ్యూనికేషన్ అంతా సంకేతాలతోనే సాగిందని ప్రభాస్ అన్నారు. వాళ్ళు కేవలం ఒక్క ఇంగ్లీష్ మాట నేర్చుకున్నారని, అది నో అనే మాట అని అంటూ స్టోరీ ఏమిటో వినకుండా కేవలం దర్శకుడు రాజమౌళి కావడంతో బాహుబలి చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. మొదట్లో శ్రీకృష్ణ దేవరాయలు, అల్లూరి సీతారామ రాజు, మరో రాజు ఇలా కొన్ని కథనాలు అనుకున్నా రాజమౌళి అవేవీ కాదని బాహుబలి కథతో సినిమాకు నడుం బిగించారని అన్నారు. బాహుబలి సెకండ్ పార్ట్ ఈ ఏడాది సెప్టంబర్ 15 వ తేదీన ప్రారంభమవుతుందని చెప్తూ అది వచ్చే ఏడాదికి రెడీ అవుతుందని తెలిపారు. బాహుబలి ప్రభావం బాగానే ఉంటుందని చెప్తున్న ప్రభాస్ మంచి సబ్జెక్టు తో ఒక కమర్షియల్ పిక్చర్ చేయాలని ఉందని అన్నారు.

Send a Comment

Your email address will not be published.