అందమైన నటనకు ప్రతీక

మహిళా ప్రేక్షకలోక అభిమానాన్ని విశేషంగా పొందిన శోభన్ బాబు …
ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగిపోయే భర్త పాత్రలో జీవించిన మేటి నటుడిగా పేరు సంపాదించిన గొప్ప నటుడు శోభన్ బాబు…

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు. ఉప్పు సూర్యనారాయణ రావు, రామతులసమ్మ దంపతులకు 1937 జనవరి నెలలో 14వ తేదీన పుట్టిన శోభన్ బాబు పెళ్లి 1958 మే 15వ తేదీన శాంతా కుమారితో జరిగింది. శోభన్ బాబు రైతు కుటుంబం నుంచి వచ్చారు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఆయన స్వగ్రామం

కుంటముక్కుల, మైలారంలో ప్రాధమిక విద్య కానిచ్చుకుని ఇంటర్ విజయవాడలో చదువుకున్నారు.
డిగ్రీ గుంటూరులోని ఏ సి కాలేజీలో చదివిన శోభన్ బాబు మద్రాస్ లో లా చదువుతూ మధ్యలోనే మానేశారు.

శోభన్ బాబు కొడుకు కరుణ శేషుకి విజయతో పెళ్లి కాగా కూతురు మృదుల భర్త డాక్టర్. పేరు శరత్. మరో ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకి కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి.

హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే శోభన్ బాబుకు నాటకాల పైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే ఆయనను మంచి నటుడిని చేసింది.

శోభన్ బాబుతో నటించిన తొలి కథానాయిక ఎల్ విజయలక్ష్మి. ఆయన నటించి విడుదలైన మొదటి చిత్రానికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు.

ఆయన నటించిన చిత్రాలలో మొదటగా వంద రోజులు ఆడిన చిత్రం నర్తనశాల. ఇక ఆయన హీరోగా నటించి 25 వారాలు ఆడిన చిత్రం మనసులు మారాలి. ఆయన ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం పొట్టి ప్లీడర్. ఆయనకు మాస్ ఇమేజి తెచ్చిపెట్టిన చిత్రం మానవుడు దానవుడు.

ఆయానతో నటించిన కథానాయికలు – జయసుధ, ఎల్ విజయలక్ష్మి, రాజశ్రీ, వాణిశ్రీ, శారద, భారతి, జయప్రద, షీలా, చంద్రకళ, రాజసులోచన, విజయశాంతి, రాధిక, రాధ, శ్రీదేవి, అంబిక తదితరులు. అందరికన్నా ఎక్కువ సినిమాల్లో ఆయన సరసన హీరోయిన్ గా నటించిన తార జయసుధ. జయసుధ, శోభన్ బాబు కలిసి నటించిన చిత్రాలు మొత్తం 31.

చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమున్న శోభన్ బాబు చూసిన మొదటి చిత్రం కీలుగుఱ్ఱం. ఈ చిత్రాన్ని ఆయన తిరువూరులో చూశారు. మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూసిన శోభన్ బాబు నటించి విడుదల అయిన మొదటి చిత్రం దైవబలం 1959 సెప్టెంబరున 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ చిత్రం పెద్దగా హిట్టవ లేదు. ఆయన ఓ సినిమాలో శివుడి వేషం వేసినందుకు పొందిన పారితోషికం 1500 రూపాయలు. అయితే ప్రతిజ్ఞా పాలన అనే ఛిత్రంలో నారదుని వేషం వేసినందుకు 750 రూపాయలు తీసుకున్నారు.

నర్తనశాలలో అభిమన్యుడిగా, భీష్మలో అర్జునుడుగా , సీతారామకల్యాణంలో లక్ష్మణుడుగా, బుద్ధిమంతుడులోకృష్ణునిగా ఆయనకు ఓ గుర్తింపు వచ్చిన సమయంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని చెప్పుకునే వారు శోభన్ బాబు.

నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు వంటి బిరుదు పొందిన శోభన్ బాబు ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డు అయిదుసార్లు, సినీగోయెర్స్ అవార్డు ఎనిమిది సార్లు, వంశీ బర్కిలీ అవార్డు మూడు సార్లు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డును బంగారు పంజరం సినిమాకుగాను 1970లో అందుకున్నారు.

క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే శోభన్ బాబు ఏరోజూ ఎటువంటి వ్యసనాలకు లోనవలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ కాంగానే తిన్నగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసేవారు. డబ్బును పొదుపు చేయడంలోనూ, మదుపు చేయడంలోనూ చాలా మందికి ఆదర్శంగా నిలిచిన శోభన్ బాబు ఎన్నో గుప్తదానాలు చేసారు.

దాదాపు మూడు దశాబ్దాలలో 220కి పైగా చిత్రాలలో నటించిన శోభన్ బాబు 1996లో విడులయిన హలో..గురూ చిత్రం తర్వాత ఇక నటించలేదు.

శోభన్ బాబుకు చిత్రరంగంపై యెనలేని అభిమానం , గౌరవం ఉన్నప్పటికీ కన్న సంతానాన్ని ఈ పరిశ్రమకు దూరంగానే ఉంచారు. తనకు అందరి నటుల మీదా ఎంతో గౌరవం ఉన్నప్పటికీ ఎందరో దర్శకులు, నిర్మాతలూ సహకరించినా ఆయన తన కొడుకుని ఈ రంగంలోకి రానివ్వలేదు.తమ వ్యాపారం చూసుకోమన్నారు.

ఆయన తన కెరీర్ లో 1972 నుంచి ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకే షూటింగుకి టైం ఇచ్చేవారు. వారాంతాలలో నటించేవారు కాదు. ఆయన తన 59వ ఏట సినిమాల నుంచి రిటైర్ అయ్యారు.

ఆయన జీవనయాత్ర 2008 మార్చి 20 వ తేదీ ఉదయం చెన్నై లోనే ముగిసింది.

Send a Comment

Your email address will not be published.