అందుకే టాలీవుడ్ వదిలేసా

కోమల్ ఝా నిజానికి ఓ ఇంజనీర్. ఆమె నటి అవాలని ఎప్పుడూ అనుకోలేదు. దుబాయిలో ఒక రోజు ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టర్ కలిసారు. వారి మధ్య పరిచయ వాక్యాలు అయ్యాయి. ఆ క్షణంలోనే డైరెక్టర్ ఒక మలయాళం సినిమాలో నటిస్తారా అని ఆమెను అడిగారు. అందుకు ఆమె సమ్మతించడం, 24 గంటలు అనే మలయాళం సినిమాలో ఆమె నటించడం, ఆ తర్వాత ఆమె జీవితం మారిపోవడం…ఇవి అన్నీనూ చకచకా జరిగిపోయాయి.

మలయాళం సినిమా అనంతరం ఆమె టాలీవుడ్ కు మకాం మార్చారు.. ఈ మధ్యే విడుదల అయిన మైనే ప్యార్ కియా అనే తెలుగు సినిమాలో ఆమె నటించారు. ఆ సినిమా మీద మంచి సమీక్షలే వచ్చాయి. ఆమె నటన బాగుందని టాక్ కూడా వచ్చింది. ఇప్పుడామెకు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చింది. అది టీ-సీరీస్ వారిది.

బాలీవుడ్ ఫిలిం గురించి మాట్లాడుతూ ఆ సినిమా పేరు ఎమ్బీఏ అని చెప్పారు. అదొక రొమాంటిక్ కామెడి పిక్చర్ అని చెప్తూ సంగీతం ఎంతో గొప్పగా ఉందని కూడా తెలిపింది. ఆ సినిమాలో తాను ఒక బాధ్యతాయుత కుమార్తె పాత్ర పోషిస్తున్నానని అన్నారు. తండ్రితో పాటు ఇంటి అవసరాలన్నీ తానే చూడవలసిన పాత్రలో నటించానని తెలిపారు. అంతకుముందు చేసిన సినిమాలకు, ఇప్పుడు ఈ తొలి హిందీ సినిమాకు ఎంతో తేడా ఉందని అన్నారు. ఈ హిందీ సినిమా పాత్ర తనకు ఎంతో నచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ హిందీ సినిమాలో సాహిల్ కోహ్లి హీరోగా నటించినట్టు చెప్పారు. ఆయన మరెవరో కాదని, టీ సెరీస్ సంస్థ యజమాని కుమారుడని ఆమె తెలిపారు. ఆయనకు కూడా ఇదే తొలి బాలీవుడ్ చిత్రమని చెప్పారు. ఈ చిత్రం మొదటి పార్ట్ పూర్తయిందని, ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుందని కూడా తెలిపారు.

ఈ హిందీ పిక్చర్ కు ముందు కోమల్ ఝా అయిదు తెలుగు సినిమాల్లో నటించారు. కానీ టాలీవుడ్ తనకు సరైన పబ్లిసిటీ ఇవ్వలేదన్నారు. దక్షిణాదిలో తాను మంచి పాత్రల్లోనే నటించినా అనుకున్నంత ఆదరణ రావడం లేదని, జనం బాగుందని చెప్పినా టాలీవుడ్ సరిగ్గా ప్రచారం చెయ్యడం లేదని ఆమె బాధ పడ్డారు. ప్రమోషన్ తగినంతగా ఉండకపోవడం వల్లే టాలీవుడ్ లో తనకు సరైన గుర్తింపు రాలేదన్నారు. ఈ విష్యం తనను నిరుత్సాహపరచినట్టు ఆమె చెప్పారు.

ఏ నటికైనా పబ్లిసిటీ ముఖ్యమని, చిన్న సినిమా అనే ఆఫ్ బీట్ తెలుగు పిక్చర్ లో తన నటనను ప్రేక్షకులు ఆదరించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు రాకపోవడం బాధ కలిగించినట్టు ఆమె చెప్పారు. కానీ బాలీవుడ్ లో అలా ఉండదని, అక్కడ పబ్లిసిటీ చాలా ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. ఒక తెలుగు సినిమా విడుదల కేవలం రెండు మూడు రాష్ట్రాల్లోనే ఉంటుందని, కానీ హిందీ సినిమా అయితే దాదాపు దేశమంతా విడుదలై సులభంగా పదిమందికీ తెలుస్తుందని ఆమె అన్నారు.

ఒక దశలో ఆమె తిరిగి దుబాయి వెళ్లి అక్కడ ఓ ఇంజనీర్ గా స్థిర పడాలనుకున్నారు. ఆ టైం లో బాలీవుడ్ ఫిలిం ఆఫర్ వచ్చిందని కోమల్ తెలిపారు.

దక్షిణాదిలో ఏడు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క హిందీ సినిమాలో నటిస్తే వచ్చిందని, అందుకే తాను బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని నిర్ణయించానని ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.