అక్షరాల కళాతపస్వి

కళ కళ కోసమనే భావనతో వ్యాపార ధోరణికి భిన్నంగా ఎన్నో మంచి చిత్రాలను తీసిన  కళాతపస్వి  కాశీనాధుని విశ్వనాధ్ సంగీత సాహిత్య ప్రధానంగా నిర్మించిన చిత్రాలు ఆయన కళా తృష్ణను చెప్పక చెప్తాయి. ఆయన చిత్రాలు పాటల రచయితలోని రచనా సామర్ధ్యాన్ని వెలికి తీస్తాయి. రచయిత తనను తాను వ్యక్థపరచుకునె అవకాశాన్ని కల్పిస్తాయనడంలో అనుమానం లేదు. అందుకు చక్కటి ఉదాహరణ వేటూరి సుందర రామమూర్తి. సిరికా కొలను చిన్నది అనే వేటూరి గారి సుప్రసిద్ధ రేడియో సంగీత నాటకం విని ముచ్చట పడి ఆయనతో మొదటి సారి పాటను రాయించినది విశ్వనాథ్ గారు కావడం గమనించాల్సిన విషయం. 1974 లో వచ్చిన ఓ సీత కథ అనే చిత్రంలో వేటూరితో భారతనారి చరితం, మధుర కథా భరితం అని సాగే హరి కథా గీతం రాయించింది విశ్వనాథ్ గారే. ఆ పాట తరవాత గేయ రచయితగా  వేటూరి వెనక్కు తిరిగి చూసుకునే అవసరం కలగలేదు.

విలువలకు కట్టుబడి ఆణి  ముత్యాల్లాంటి చిత్రాలు అందించిన విశ్వనాథ్ గారు తొలుత ఆడియో గ్రాఫర్ గా చలన చిత్ర రంగలో అడుగుపెట్టారు. సమీప బంధువు టీ కామేశ్వర రావు సూచన మేరకు సినిమా సాంకేతిక విభాగంలోకి వచ్చిన విశ్వనాథ్ బీ ఎన్ రెడ్డి గారి వాహిని స్టూడియోలో చేరారు.

ఆయన డైరెక్టర్ అవాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ కె వి రెడ్డి, బె ఎన్ రెడ్డి, తాతినేని ప్రకాష్ రావు, భానుమతి, ఆదుర్తి సుబ్బా రావు గారితో పని చేసిన విశ్వనాథ్ ఆదుర్తి గారి పుణ్యామాని కేవలం ఆడియోగ్రఫీకె పరిమితమైపోకుండా తేనెమనసులు, కన్నె మనసులు, సుడి గుండాలు, మరో ప్రపంచం వంటి చిత్రాల్లో కథలపై చర్చలు, స్క్రిప్ట్ రైటింగ్, అంతదాకా ఎందుకు దర్శకత్వంలోనూ పాలుపంచుకున్నారు.

ఒకరోజు అక్కినేని నాగేశ్వర రావు, దుక్కిపాటి మధుసూదన రావు గారు విశ్వనాథగారిని ఎందుకు దర్శకత్వం లోకి అడుగు పెట్టకూడదని అడిగారు. అంతే అడిగిందే తడవుగా ఆయన అన్నపూర్ణా పిక్చర్స్ లో చేరారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఆత్మ గౌరవం. ఇక అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన మొదటి చిత్రం మూగ మనసులు.

ఇలా దర్శకత్వం లోకి అడుగు పెట్టిన విశ్వనాధ్ అనంతరం ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు.

మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ చెప్పినట్టు శంకరా భరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి , శ్రుతి లయలు, స్వర్ణ కమలం అనే ఆరు చిత్రాలు మనలోని షడ్ చక్రాలకు సంకేతాలు. అవి ఒక దానికొకటి సంబంధం కలిగి జీవాత్మ, పరమాత్మలో లీనం కావడానికి ఒక యోగి చేసే సాధనను సూచిస్తాయి. మానవ జీవిత పరమార్థాన్ని ఈ చిత్రాలు ప్రబోధిస్తాయి.

సినిమా జయాపజయాలకు పూర్తి బాద్యత దర్శకుడిదే, అందుకే దర్శకుడిని ఒక ఇంటి యజమానిగా విశ్వనాథ్ గారు అభివర్ణించారు. వెండి తెరలొని అన్ని విభాగాల్లోనూ దర్శకునికి పట్టు ఉండాలని చెప్పే విశ్వనాధ్ కు తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లో సిరివెన్నెల అంటే చాలా ఇష్టం. శంకరాభరణం చిత్రంతో తనకు దక్కిన పేరు ప్రతిష్టలను నిలబెట్టుకోవడానికి ఆయన  ఎప్పటికప్పుడు అంకిత భావంతో శక్తీ వంచన లేకుండా  శ్రమపడ్డారు. అందుకే ఆయన చిత్రాలు తెలుగు చలన చిత్రాలకు   జాతీయంగానూ, అంతర్జాతీయంగాను ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నాయి.

ఎస్ పీ బాలసుబ్రమణ్యం సూచనమేరకు శుభ సంకల్పంలో రాయుడు పాత్రలో నటించిన విశ్వనాథ్ ఆ తర్వాత అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు. ఆయనకు కమల్ హాసన్ ద్రోహి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక మేటి అవార్డులు అందుకున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 19వ తేదీన 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన కలకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని తెలుగు మల్లి తరఫున కోరుకుంటున్నాం.

Send a Comment

Your email address will not be published.