"అఖిల్" ఒకే

నాగార్జున అక్కినేని తనయుడు అఖిల్ నటించిన తొలి చిత్రం “అఖిల్” సంతృప్తికరమే. దీపావాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రావడంలో ఆలస్యమైనా అన్ని హంగులతో వచ్చి విజయం సాధించినట్టే చెప్పుకోవాలి.

అఖిల్ సరసన సాయేషా సైగల్ నటించింది.

ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి , మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ తమన్ కలిసి హుషారైన పాటలు అందించారు. సంగీత దర్శకులు మణిశర్మ నేపథ్య సంగీతం అనగానే ఓ అంచనా వేసుకుంటాం. కానీ ఆ సంగీతంలో ఆయన బాణీ కనిపించలేదు.

వెలిగొండ శ్రీనివాస్ రాసిన కథకు స్క్రీన్ ప్లే , మాటలు కోన వెంకట్ వే.

ఈ చిత్రానికి ప్రముఖ నటుడు నితిన్ నిర్మాత కాగా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.

టైటిల్ పాత్ర పోషించిన అఖిల్ కథాపరంగా ఓ అనాథ. డబ్బుల కోసం ఫైట్లు గట్రా చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. అఖిల్ ఓ మెడికల్ స్టూడెంట్ ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఆ వైద్య విద్యార్ధినిగా దివ్య పాత్రలో సాయేషా నటించింది. అఖిల్ తానొక డాక్టర్ అని అబద్ధం చెప్పి స్నేహం చేసి ప్రేమలో పడతాడు. అంతేకాదు ఆమె పెళ్లిని విజయవంతంగా చెడగొడతాడు. ఆమెకు చేరువవుతాడు. వీరి ప్రేమ ఒకవైపు సాగుతుంటే సాయేషాను ఆఫ్రికా రౌడీ బోడో కిడ్నాప్ చేస్తాడు. విషయం తెలిసిన అఖిల్ ఆమె కోసం ఆఫ్రికాకు బయల్దేరతాడు. అయితే సాయేషాను బోడో ఎందుకు కిడ్నాప్ చేసాడు? అతని గుప్పెట్లోనుంచి సాయేషాను అఖిల్ ఏ విధంగా రక్షించాడు? అన్న అంశాలను వెండితెర మీద చూడాలి.

అఖిల్ క్యారక్టర్ ని భిన్నమైన దారిలో నడిపించడంలో దర్శకుడు వినాయక్ విజయవంతంయ్యాడు. అఖిల్ ని సూపర్ హీరోగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా అఖిల్ ని చూపించే ప్రయత్నంలో దర్శకుడు అనుకున్నది సాధించాడు అనే అభిమానులు అంటున్నారు.

బ్రహ్మానందం తన పంచ్ లతో ఆకట్టుకోగా రాజేంద్ర ప్రసాద్ – అఖిల్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

మొత్తంమీద అఖిల్ అభిమానులను నిరాశ పరచలేదు. అఖిల్ స్టెప్స్ బాగున్నాయి. కథానాయిక సాయేషా సైగల్ నటన గొప్పగా లేదు.

Send a Comment

Your email address will not be published.