‘అజ్ఞాతవాసి’ తో త్రివిక్రమ్ పక్కా క్లాసికల్ మూవీ తీశాడేమోననిపించింది. ఇందులో అద్భుతమైన మాస్ కథ దాగి ఉందని అర్థమవుతోంది. ఎందుకంటే ‘వీడి చర్యలు ఊహాతీతం వర్మా!’ అంటాడు. అంటే ఊహలకు అందకుండా ఈ పాత్ర ఉంటుందని మనకి చెప్పకనే చెప్పారు. మళ్లీ చివర్లో ‘వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడా వర్మా’ అంటాడు. ఇందులో ఎంతో అర్థం ఉంది. పవన్కళ్యాణ్ ఈ చిత్రంతో చరిత్ర సృష్టించబోతున్నాడు…అంటూ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించడం గమనించాల్సిన అంశమే.
దేశవిదేశాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం పవన్ కళ్యాణ్ కు ఇది ఇరవై అయిదో చిత్రం.
పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రమనగానే సినీ అభిమానుల్లో భారీ అంచనాలుండడం సర్వసాధారణం. అయితే ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఉండడం విశేషం.
ఏబీ గ్రూప్ అంటూ ఓ సంస్థ. ఈ సంస్థకు అధినేత గోవింద భార్గవ్. ఈ పాత్రలో బొమన్ఇరానీ నటించారు. ఆయన బడా వ్యాపార వేత్త. కొందరు ఈ వ్యాపారవేత్తపై అసూయతో ఆయన కొడుకు (విందా) ని హతమారుస్తారు. దీంతో ఈ వ్యాపారాన్ని చూసుకోవడానికి విందా భార్య బాలసుబ్రహ్మణ్యం పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ ను సంస్థ మేనేజర్ గా నియమిస్తుంది. విందా భార్య ఇంద్రాణి పాత్రలో ఖుష్బు నటించింది. అయితే పవన్ కళ్యాణ్ విందాను ఎవరు చంపారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇందుకోసం అతను అభిషిక్త భార్గవగా ఎలా మారాడు, విందా హంతకులను ఎందుకు చంపాలనుకుంటాడు వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాలి.
మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సారి భిన్నమైన కథనంతో సినిమా నడిపించాడు. కార్పొరేట్ సంస్థలో వ్యవహారాలు, పరస్పర ఆధిపత్య పోరు, ఈ క్రమంలో ఒకరిపై మరొరకి ఎత్తులు వంటి విషయాలకే అధికప్రాధాన్యమిచ్చి సినిమా నడిపించాడు. కథంతా కమర్షియల్ కోణంలోనే రాయడం ఆలోచించాల్సిన విషయమే. దీంతో కథ గురించి ప్రత్యేకించి చెప్పుకోడానికేమీ లేదీ సినిమాలో.
నటీనటుల విషయానికి పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగానే తన నటనతో మరోసారి మురిపంచాడు. రెండు పాత్రలలోనూ ఆయన నటన బాగుంది. అలాగే ఆయన మాటల మాడ్యులేషన్లో వేరేగా చెప్పక్కర్లేదు.
ఖుష్బూ నటన బాగుంది. ఆమె నటనకు ప్లస్ మార్కులే పడ్డాయి. కీర్తి సురేష్, అనుఇమ్మానుయేల్ పాత్రల గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. విలన్ పాత్రను దర్శకుడు సరిగ్గా నడిపించలేకపోయాడని అనుకుంటున్నారు. రావు రమేష్, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్లు కూడా ఈ చిత్రంలో నటించారు.
అనిరుధ్ సంగీతం అనుకున్నంత బాగులేదు. నేపథ్య సంగీతం కాస్త పరవాలేదు. పాటలేవీ పదే పదే వినేలా లేవు. పవన్ కళ్యాణ్ కొడకా సాంగ్ అనే పాట పాడారు.
లొకేషన్ల చిత్రీకరణ బాగుంది. అలాగే ఛేజింగ్ సన్నివేశాలు కూడానూ.
ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా కాస్తంత నిరాశపరచింది అనడంలో సందేహం లేదు. కామెడీ పెద్దగా లేదు. కథలో కొత్తదనం శూన్యం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానరుఫై చిన్నబాబు నిర్మించిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులే ఆడించాలి. ఆదరించాలి.
ఇలా ఉండగా, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను సినిమా నుంచి తొలగించాలంటూ విజయవాడ మాచవరం పోలీస్స్టేషన్లో ఓ న్యాయవాది కేసు వేశారు. ఆయన పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అనే పేరుగలవారి మనోభావాలు దెబ్బతినేలా ఈ పాట ఉందని దీనిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.