అటు ప్రభంజనం .. ఇటు తులసీదళం

సంగీతంతో వెండితెరకు పరిచయమైన ఆర్పీ పట్నాయిక్ (రవీంద్ర ప్రసాద్ పట్నాయిక్ ) త్వరలోనే ప్రభంజనం, తులసీదళం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

యూనివర్సిటీలో తనతో పాటు చదివిన కొందరు మిత్రులు ఇప్పుడు మంచి మంచి పదవుల్లో ఉన్నారని, వారిని కలసి మాట్లాడినప్పుడు చర్చలలో వచ్చిన చిత్రమే బ్రోకర్ సినిమా అని ఆర్పీ పట్నాయిక్ చెప్పారు. ఈ సినిమా వచ్చిన తర్వాతే లాబీయింగ్ అన్నది బయటకు వచ్చిందని, సమాజంలోని దోపిడిని, అధికారంలో ఉన్న వారు చేస్తున్న అవినీతిని బ్రోకర్ సినిమాలో చూపించానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రంతో ఒక్కసారిగా ప్రజల ఆలోచనా విధానంలో మార్పేదో వచ్చేస్తుందని తాను అనుకోలేదన్నారు. అలాగని తాను చెప్పాలనుకున్న విషయంలో ఎక్కడా రాజీ పడలేదని వివరించారు.

ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉందన్నారు. బ్రోకర్ సినిమా విడుదలైన కొన్ని రోజులకు, విశాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాల్  చేసింది తమ కీబోర్డ్ ప్లేయర్ అని, అతని మిత్రుడు బ్రోకర్ సినిమా చూసి బోరున విలపించాడన్నారు. ఎందుకని అడిగితే విషయం తెలిసిందని, ఏడుస్తున్న వ్యక్తి ఒక వడ్డీ వ్యాపారని, ఎక్కువ వడ్డీలకు అప్పులు ఇచ్చి జనాన్ని పీడించే వాడని, అతని ఒక్కగానొక్క కొడుకు ప్రమాదంలో చనిపోయాడని ఆ తర్వాత జనంతో చెడ్డవాడని అనిపించుకోకూడదని నిర్ణయించుకుని నిజమైన మనిషిగా బతుకుతున్నాడని, బ్రోకర్ సినిమాలోని కథాంశాన్ని నిజ జీవితానికి అన్వయించుకుని బాధ పడి కళ్ళు తెరిచాడని తమ మిత్రుడు చెప్పినప్పుడు తన కథకున్న బలం గ్రహించానని ఆర్పీ పట్నాయిక్ చెప్పారు. మంచి ఎవరు చెప్పినా దానికి తగిన ఫలితముంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ఆయన అన్నారు. దేశం బాగు పడితే చాలు అనే ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రభంజనం చిత్రానికి సంగీతం సమకూర్చానని, ఇది త్వరలో విడుదల కానున్నదని ఆయన తెలిపారు. మరోవైపు గతంలో నటించిన పాత్రలకు బిన్నంగా నటించిన తులసీదళం చిత్రం కూడా విడుదల కావలసి ఉందని ఆర్పీ పట్నాయిక్ అన్నారు. ఈ రెండు చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.