పూర్వపు రోజుల్లో ఒక చిత్రం తీస్తున్నారంటే ఆ చిత్ర దర్శకుల నుంచి ఎంతటి నటీనటులైనా విధిగా క్రమశిక్షణ పాటించేవారు. పైగా దర్శకుడినైనా, రచయితనైనా సాంకేతిక నిపుణులనైనా నటీనటులు ఎంతో గౌరవంగా చూసేవారు. దర్శకులు, రచయితలు కూడా నటీనటులను ఎంతగానో ఆదరించేవారు. ఈ విధంగా వారి మధ్య పరస్పర గౌరవాభిమానాలు కొనసాగడంతో సినిమా కూడా గొప్పగా తయారై చూడముచ్చటగా ఉండేది. ఆరోజుల్లో కాల్ షీట్ అనుకున్న టైముకి మొదలయ్యేది. అప్పట్లో మద్రాసులో స్టూడియోలు తక్కువగా ఉండేవి. ఆ స్టూడియోలలో లైట్లు కూడా సరిపడా ఉండేవి కావు. వాటితోనే కెమేరామన్లు గొప్ప షాట్లు తీసేవారు. లైటింగు కోసం నటీనటులు ఎంతసేపంటే అంతసేపు నిలుచోవలసి వచ్చేది. అలాంటి రోజుల్లో తీసిన చిత్రమే వందేమాతరం. ఈ చిత్రంలో పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు తాళి కట్టే సన్నివేశం. పీటపై పెళ్ళికూతురు కూర్చుని ఉంటే పెళ్ళికొడుకు ఆమెకు ఎదురుగా నిలుచుని వంగి ఆమె మెడలో మంగళసూత్రం కట్టాలి. ఈ షాటు లైటింగు కోసం దాదాపు ముప్పావు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చిందని పెళ్ళికొడుకుగా నటించిన చిత్తూరు నాగయ్య చెప్తుండేవారు. అంటే నాగయ్య తాళి కట్టడానికోసం నలభై అయిదు నిముషాలు నిల్చునే ఉన్నారన్న మాట. షాట్ అంతా ఓకే అయి చిత్రీకరణ పూర్తికావడానికి గంట పట్టింది. అంత సేపు నిలుచోవడంతో ఆయన నడుము నొప్పి తట్టుకోలేకపోయారట. కానీ ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోలేక పోయానని నాగయ్య అంటుండేవారు. ఆ షాట్ సరిగ్గా వస్తే చాలనుకున్నారట నాగయ్యగారు. ఆయన కమిట్మెంట్ అది.