అనితర సాధ్యం

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా ఎన్టీ రామారావు అవలంబించిన మార్గం అనితర సాధ్యం అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు చెప్పారు. సినిమా రంగంలో ఆయన నిర్దేశించిన క్రమశిక్షణ, ఆయన పాటించిన నియమాలు ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఊటీ లాంటి అతి శీతల ప్రాంతంలోనూ మేక్ అప్ చేసుకుని ఏడు గంటలకల్లా షూటింగ్ స్పాట్ కి వచ్చేసేవారని , దానితో యూనిట్ లోని వారందరూ అంతకుముందే లొకేషన్ లో ఉండవలసి వచ్చేదన్నారు.

లొకేషన్ లో ఆయన ఉన్నారంటే ఒక పులో, ఒక సింహమో ఉన్నట్టుగా భావించేవారని, కాకపోతే అది భయంతో కాదు….గౌరవంతో, అభిమానంతో అని కె రాఘవేంద్ర రావు చెప్పారు.

ఆయన కొన్ని పాత్రల్లో ఆవహించి నటిస్తున్నారా అనిపించేదని, ఆయన నటన ఎందరికో స్పూర్తినిచ్చేదని ఆయన తెలిపారు.

ఆయన దర్శకుడై ఉండి కూడా  ఎక్కడా ఏ సందర్భంలోనూ జోక్యం చేసుకునే వారు కాదని, దర్శకుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నటించేవారని చెప్పారు.

షూటింగ్ టైం లో ఏదీ వృధా చెయ్యకూడదని చెప్పేవారు. చివరికి నిర్మాతైనా సరే వృధా చెయ్యవద్దని సూచించేవారని కె రాఘవేంద్ర రావు చెప్పారు.

ఒక నటుడికైన పరిపూర్ణ లక్షణాలు ఆయనలో ఉండడంతో ఎవరైనాసరే ఆచితూచి మాట్లాడ వలసి వచ్చేదన్నారు. డైలాగులు పలకడంలోను, హావభావాలు ప్రదర్శించడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని కె రాఘవేంద్ర రావు అన్నారు.

Send a Comment

Your email address will not be published.