అబ్దుల్ కలాంపై చిత్రం

ప్రముఖ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఒ చెప్పుకోదగ్గ చరిత్ర.

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అబ్దుల్ కలాంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనకు మిత్రుడు అభిషేక్ అన్ని విధాల సహకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నెలలో మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో సాగుతోంది.

కొన్ని రోజులక్రితం అనిల్ సుంకర తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న కలాం ఇంటిని సందర్శించారు. దాదాపు ఏడాదిగా ఆయన ఇదే పనిలో అంటే కలాం గురించి విషయ సేకరణలో తలమునకలయ్యారు. ఆయన కలాం ఇంటిని సందర్శించడమే కాదు, ఆయన కుటుంబసభ్యులను సమీప బంధువులను కలిసి అనేక విషయాలు సేకరించారు. కలాం చిత్రాన్ని ఇంగ్లీషులో చిత్రీకరిస్తున్న సుంకర అనిల్ మాట్లాడుతూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని ఒక నిర్ణయానికి రావడంతోనే చిత్రీకరణ చేపడతామని అన్నారు.

హాలీవుడ్ నుంచి ఒక దర్శకుడితో చిత్ర కథనాన్ని నడిపిస్తానని చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తీయాలని ఉందని అంటూ చిత్రంలోని నటీనటిలను ఒక్క మన దేశంలో నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా నటీనటులను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు.

చిత్రాన్ని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు పంపాలన్నది తన ఆశయమని అన్నారు. ప్రముఖ రచయిత రాజ్ చెంగాప్ప అబ్దుల్ కలాం పై రాసిన పుస్తకంపై హక్కులు కొనుగోలుచేసినట్టు కూడా అనిల్ తెలిపారు. ఇంటింటికీ వార్తాపత్రికలు వేసే స్థాయి నుంచి దేశాదిపతిగా ఎదిగిన స్థాయి వరకు ఆయన జీవితంలోని మలుపులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.